TDP: రాజ్యసభ ఎన్నికలకు టిడిపి దూరం?

గత ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి అనూహ్య విజయం దక్కించుకున్నారు. మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికలు జరగగా.. చివరి స్థానానికి టిడిపి అభ్యర్థిని నిలిపింది.

Written By: Dharma, Updated On : February 7, 2024 10:08 am

TDP

Follow us on

TDP: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాజ్యసభలో ప్రాతినిధ్యం కొనసాగుతూ వస్తోంది. పార్టీకి గెలుపోటములు ఎదురైనా.. రాజ్యసభలో మాత్రం టిడిపి సభ్యులు కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం టిడిపికి ఒకే ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. ఆయనే కనకమెడల రవీంద్ర. వచ్చే నెలలో ఆయన రిటైర్ కానున్నారు. దీంతో రాజ్యసభలో టిడిపికి ప్రాతినిధ్యం లేనట్టే. ప్రస్తుతం ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెలాఖరున ఓటింగ్ జరగనుంది. అయితే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

గత ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి అనూహ్య విజయం దక్కించుకున్నారు. మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికలు జరగగా.. చివరి స్థానానికి టిడిపి అభ్యర్థిని నిలిపింది. అప్పటికే నలుగురు టిడిపి ఎమ్మెల్యేలు వైసీపీలోకి ఫిరాయించారు. కానీ అనూహ్యంగా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపి అభ్యర్థికి ఓటు వేశారు. దీంతో ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ గెలుపొందారు. సరిగ్గా ఇటువంటి ఫలితమే రాజ్యసభ ఎన్నికల్లో రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. అందుకే టిడిపి అభ్యర్థిని ప్రకటించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అది అంత సులువు అయ్యే పని కాదని తేలుతోంది. ఒకవైపు సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజ్యసభ స్థానం దక్కించుకోవాలంటే దాదాపు 45 ఓట్లు అవసరం. ప్రస్తుతం టిడిపికి ఉన్న బలం 18 మంది ఎమ్మెల్యేలు. ఈ లెక్కన మరో 27 మందిని ఆకర్షించాలి. అది అయ్యే పనియేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ తప్పకుండా విప్ జారీ చేస్తుంది. పార్టీ ఏజెంట్ కు చూపి ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ముందుకు వచ్చేది ఎంతమంది? వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చుతోంది. సిట్టింగ్లను మార్చడంతో జగన్ పై ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు. కానీ వారు రాజకీయంగా విభేదిస్తారా? లేదా? అన్నది తెలియాలి. సీట్ల సర్దుబాటు, ఎన్నికల వ్యూహాల సమయంలో ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడం కష్టంతో కూడుకున్న పని. ఒకరకంగా చెప్పాలంటే చికాకుతో కూడుకున్న వ్యవహారం. అలాగని రాజ్యసభ పదవితో వచ్చేదేమీ లేదు. ఎన్నికల కీలక సమయంలో టైం వేస్ట్ తప్ప.. మరొకటి కాదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే చంద్రబాబు వెనక్కి తగ్గినట్లు సమాచారం. సంఖ్యాపరంగా వ్యత్యాసం ఉండడంతో ఇబ్బంది తప్పదని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో లోకేష్ పట్టుదలతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి చంద్రబాబు ఎలా ముందుకెళ్తారో చూడాలి