https://oktelugu.com/

Iran Visa Free Policy: వీసా లేకుండానే ఇరాన్ వెళ్లొచ్చు.. కాకుంటే ఈ షరతులు వర్తిస్తాయి

కేవలం భారతదేశం మాత్రమే కాకుండా రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, జపాన్, సింగపూర్, మలేషియా, బ్రెజిల్, మెక్సికో తో సహా 33 దేశాలకు కొత్త వీసా నిబంధనలను ఇరాన్ ప్రకటించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 7, 2024 / 10:22 AM IST

    Iran Visa Free Policy

    Follow us on

    Iran Visa Free Policy: ఇస్లాం దేశమైనప్పటికీ ఇరాన్ దేశం భారత్ కు నమ్మకమైన భాగస్వామిగా ఉంది.. సహజవాయువును ఈ దేశం నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్నది. భారత్ నుంచి గోధుమలు ఇతర ఆహార ధాన్యాలను ఇరాన్ దిగుమతి చేసుకుంటుంది. వ్యూహాత్మక వ్యాపార భాగస్వామ్య విషయంలో భారత్_ ఇరాన్ మొదటినుంచి ఏకతాటిపైనే ఉన్నాయి. ఇస్లాం దేశాలు భారత్ పై కొంత వ్యతిరేక ధోరణి కలిగి ఉన్నప్పటికీ.. ఇరాన్ మాత్రం అలాంటి వివక్షను భారత్ పై ఎప్పుడూ చూపలేదు. భారత్ ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా అవతరించిన నేపథ్యంలో.. మన దేశంతో మరింత బలమైన సంబంధాలను ఇరాన్ కోరుకుంటుంది. మధు ఆసియాలో బలమైన ఆర్థిక శక్తిగా అవతరించేందుకు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందాలని భావిస్తోంది. తమ దేశంపై ఉన్న అపవాదును తుడుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తమ దేశానికి వచ్చే పర్యాటకుల కోసం వీసా నిబంధనలను సులభతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా భారతదేశంలో మరింత ఉదారంగా వ్యవహరించాలని ఇరాన్ నిర్ణయించింది.

    కేవలం భారతదేశం మాత్రమే కాకుండా రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, జపాన్, సింగపూర్, మలేషియా, బ్రెజిల్, మెక్సికో తో సహా 33 దేశాలకు కొత్త వీసా నిబంధనలను ఇరాన్ ప్రకటించింది. డిసెంబర్లోనే ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నప్పటికీ దీనిని ఫిబ్రవరి నుంచి అమల్లోకి తీసుకువచ్చింది..ఈ మేరకు సాంస్కృతిక శాఖ మంత్రి ఎజ్జతోల్లా జర్ఘామి వివరాలను వెల్లడించారు. వీసా విధానాలను సులభతరం చేయడం వల్ల తమ దేశానికి సంబంధించి ఉన్న అపవాదును తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆయన వివరించారు. భారత పౌరులకు సంబంధించి నాలుగు షరతులకు లోబడి వీసా రహిత ఇరాన్ ప్రయాణ అవకాశాన్ని కల్పిస్తున్నామని ఎజ్జతోల్లా జర్ఘామి ప్రకటించారు.

    సాధారణ పాస్ పోర్ట్ లు కలిగిన భారతీయులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వీసా లేకుండా ఇరాన్ లో పర్యటించవచ్చు. గరిష్టంగా 15 రోజులు ఉండొచ్చు. విమానంలో ప్రయాణించే వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలం ఉండాలి అనుకుంటే.. కచ్చితంగా వారు భారతదేశంలోని ఇరాన్ మిషన్ల నుంచి వీసాలను పొందాల్సి ఉంటుంది.. ఇక ప్రపంచ పర్యాటక సంస్థ నివేదిక ప్రకారం 2022లో ఇరాన్ దేశాన్ని సందర్శించే వారి సంఖ్య అంతకుముందు ఏడాదితో పోల్చితే దాదాపు 315 శాతం పెరిగింది. 2021లో 9 లక్షల 90 వేల మంది ఇరాన్ దేశాన్ని సందర్శించారు. 2022లో ఈ సంఖ్య దాదాపు 4.1 మిలియన్లకు చేరింది. “2023 లో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులలో గణనీయమైన వృద్ధి నమోదయింది. 2023 మొదటి ఆరు నెలల్లో 31,000 మంది భారతీయులు ఇరాన్ దేశాన్ని సందర్శించారు. 2022 సంవత్సరంతో పోల్చితే 25% వృద్ధిని నమోదు చేశారు. చాలామంది విదేశీ యాత్రికులు పర్యాటకం, వాణిజ్యం, వైద్యం, తీర్థయాత్రల కోసం కోసం ఇరాన్ దేశాన్ని సందర్శిస్తున్నారని” ఇరాన్ పర్యాటక మంత్రిత్వ శాఖ, విదేశీ పర్యాటకశాఖ అభివృద్ధి కార్యాలయ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న మోస్లెమ్ షోజాయ్ గత డిసెంబర్లో పేర్కొన్నారు. ఇరాన్ దేశం వీసా పై తీసుకున్న నిర్ణయం కారణంగా భారత్ నుంచి పర్యాటకులు ఎక్కువ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. పైగా ఇరాన్ లో దర్శనీయ ప్రదేశాలు, పురాతన కట్టడాలున్నాయి. అరుదైన ఔషధ మొక్కలు, డ్రై ఫ్రూట్స్ విరివిగా లభ్యమవుతాయి. అందుకే పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. వీసా పై నిబంధనలు సడలించిన నేపథ్యంలో పర్యాటకంగా ఆదాయం కూడా పెరుగుతుందని ఇరాన్ దేశం భావిస్తోంది. వచ్చే పర్యాటకుల కోసం సదుపాయాలు కూడా కల్పిస్తున్నట్టు ఇరాన్ చెబుతోంది.. అయితే ఇరాన్ ఈ ప్రకటన చేసిన నేపథ్యంలో మిగతా ఇస్లాం దేశాలు కూడా భారత్ పై ఇదే ధోరణి ప్రదర్శించే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.