MP Raghu Rama Krishna Raju: ఏపీలో వైసీపీ హైకమాండ్ కు కొరుకుడు పడని నేతల్లో రఘురామక్రిష్ణంరాజు ఒకరు. హైకమాండ్ తో విభేదించి తొలినాళ్ల నుంచే చుక్కలు చూపిస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా మారి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. వేటు వేస్తే మరింత స్వేచ్ఛనిచ్చినట్టవుతుందని భావించిన జగన్ సైతం అతడి విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక మల్లగుల్లాలు పడ్డారు. చివరకు కేసుల రూపంలో తగిన ట్రీట్మెంట్ ఇచ్చినా రఘురామరాజు వెనక్కి తగ్గలేదు. వెటకారపు మాటలతో వైసీపీ మైండ్ బ్లాక్ అయ్యేలా స్టేట్ మెంట్లూ ఇస్తూ వచ్చారు.
గత ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి రఘురామక్రిష్ణంరాజు పోటీచేశారు. 32 వేల మెజార్టీతో గెలుపొందారు. ఆ నియోజకవర్గంలో క్షత్రియుల బలం ఎక్కువ. అయితే గెలిచిన అనతికాలంలోనే వైసీపీకి ఆయన దూరమయ్యారు. జగన్ విధానాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇప్పుడు హైకమాండ్ కు రఘురామరాజుకు అగాధం ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తప్పించి ఏదో పార్టీ నుంచి ఆయన బరిలో దిగడం ఖాయంగా తేలింది. వైసీపీ సైతం బలమైన క్షత్రియ అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది.
ప్రస్తుతం నరసాపురం నియోజకవర్గానికి దూరంగా రఘురామ ఉన్నారు. అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్కడి తెలుగు ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.రౌండుటేబుల్ సమావేశాలు, రచ్చబండలు ఏర్పాటుచేస్తున్నారు. అక్కడ ప్రవాసాంధ్రుల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉన్నట్టుండి రఘురామరాజు తన వాయిస్ ను మార్చారు. వైసీపీ అనుకూల స్టేట్ మెంట్లు ఇవ్వడం ప్రారంభించారు. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని చెబుతున్నారు.
గత ఎన్నికల్లో 50 శాతం ఓటు షేర్ సాధించిన వైసీపీ.. ఈ ఎన్నికల్లో మరో శాతం పెంచుకుంటుందని వైసీపీ ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీతో పోల్చుకుంటే టీడీపీ, జనసేన బలహీనంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అయితే ఆయన ఉద్దేశపూర్వకంగా అలా అన్నారా? లేక అందులో వ్యూహాత్మకమా? అన్నది తెలియాల్సి ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం రఘురామక్రిష్ణంరాజు వైసీపీకి అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారని మాత్రం పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవాలు ఏమిటన్నదానిపై రఘురామరాజు స్పందిస్తే కానీ తెలియదు.