https://oktelugu.com/

Successors in Next Election : ఉత్తరాంధ్రలో వారసుల జోరు.. వచ్చే ఎన్నికల్లో బరిలో దిగేందుకు ప్లాన్..!

Successors in Next Election : ఉత్తరాంధ్రలోని సీనియర్ నేతల వారసులు రాజకీయ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇటు అధికార పార్టీలోనూ, ప్రతిపక్ష పార్టీలోనూ ఈ వారసుల హడావిడి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు తల్లి.. తండ్రి చాటు బిడ్డలుగా ఉన్న వాళ్లంతా.. నేరుగా రాజకీయ రణక్షేత్రంలోకి దిగిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్య నాయకులుగా పేరుగాంచిన వారి వారసులు వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. అధికార పార్టీ వైసీపీలోనూ, […]

Written By:
  • BS
  • , Updated On : April 16, 2023 2:55 pm
    Follow us on

    Successors in Next Election : ఉత్తరాంధ్రలోని సీనియర్ నేతల వారసులు రాజకీయ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇటు అధికార పార్టీలోనూ, ప్రతిపక్ష పార్టీలోనూ ఈ వారసుల హడావిడి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు తల్లి.. తండ్రి చాటు బిడ్డలుగా ఉన్న వాళ్లంతా.. నేరుగా రాజకీయ రణక్షేత్రంలోకి దిగిపోవాలని ఆకాంక్షిస్తున్నారు.

    ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్య నాయకులుగా పేరుగాంచిన వారి వారసులు వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. అధికార పార్టీ వైసీపీలోనూ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలోనూ ఆశావహ వారసుల సంఖ్య భారీగానే కనిపిస్తోంది. అటు శ్రీకాకుళం జిల్లా నుంచి అటు విశాఖపట్నం జిల్లా వరకు నాయకుల వారసులు పోటీకి సై అంటున్నారు. అయితే, అధిష్టానం వీరి పోటీకి ఎంత వరకు సుముఖతను వ్యక్తం చేస్తాయన్నది తెలియడం లేదు. అయినప్పటికీ వారి ప్రయత్నాలను ఆపడం లేదు. ఒకపక్క పార్టీ అధినేతను ఒప్పించే ప్రయత్నాలు చేసుకుంటూనే.. మరోపక్క జనాల్లోనూ తిరుగుతూ తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

    కీలక నియోజకవర్గాల్లో పోటీకి వారసులు..

    అధికార వైసీపీ నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి చూసుకుంటే ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో తండ్రి విజయం సాధించిన తర్వాత రామ్ మనోహర్ నాయుడు పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయిస్తున్నారు. తండ్రి నిర్వహించాల్సిన గడపగడపకు కార్యక్రమాన్ని రామ్ నిర్వహిస్తున్నారు. శుభకార్యాలని, పరామర్శలు అంటూ అందరికీ అందుబాటులో ఉంటున్నారు. ఇక నియోజకవర్గ పరిధిలోని యువతతోను టచ్ లో ఉంటున్నారు రామ్ మనోహర్ నాయుడు. అలాగే మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాసు కుమారుడు.. కృష్ణ చైతన్య కూడా ఈసారి పోటీ చేయాలని కోరుకుంటున్నారు. తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నరసన్నపేట నుంచి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే అధికార వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా తన వారసుడిని వచ్చే ఎన్నికల్లో బరిలో దించాలని భావిస్తున్నారు. ఇప్పటికే తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ ప్రజల్లో తిరుగుతున్నారు. తండ్రితో పాటు సభలు, సమావేశాలకు హాజరవుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురు నేతలు వారసుల రాజకీయ భవితవ్యంపై జోరుగా జిల్లాలో చర్చ సాగుతోంది. అలాగే ఇదే జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పలువురు వారసులు టికెట్లు ఆశిస్తున్నారు. ఈ జాబితాలో ముందు వరుసలో మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు కుమారుడు మల్లిక్ నాయుడు ఉన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బరిలోకి దిగాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే అధిష్టానం వద్ద కళా వెంకట్రావు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అలాగే రాజాం నియోజకవర్గంలో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి వారసురాలు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసే ఉద్దేశంతో యాక్టివ్ గా రాజకీయాలు చేస్తున్నారు ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ. అయితే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి కోండ్రు మురళి నుంచి ఆమెకు గట్టి పోటీ ఎదురవుతోంది. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కుమారుడు విశ్వనాధ్ సిద్ధమవుతున్నారు. విశ్వనాధ్ అన్నయ్య శివ కూడా ఉన్నారు. విశ్వనాథ్ కాకపోతే శివ అయినా పోటీ చేస్తారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

    బొత్స వారసుడు ఎంట్రీకి రంగం సిద్ధం..

    ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీనియర్ నాయకుడు, మూడు జిల్లాల్లో అనుచర గణం కలిగిన నేత బొత్స సత్యనారాయణ కూడా ఈసారి తన వారసుడిని బరిలో దించాలని భావిస్తున్నారు. కోవిడ్ సమయంలో సామాజిక కార్యక్రమాల ద్వారా బయటకు వచ్చారు బొత్స సత్యనారాయణ కుమారుడు డాక్టర్ సందీప్. విజయనగరం జిల్లాలో ఇప్పటికే ఒక ట్రస్టును ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఎంపీగా పార్లమెంటుకు వెళ్లాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గం నుంచి కుమారుడుని దించాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అలాగే విజయనగరం నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కోలగట్ల వీరభద్ర స్వామి కూడా తన వారసురాలని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లో వైస్ చైర్మన్ గా శ్రావణి కొనసాగుతున్నారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తూ తన పొలిటికల్ రూట్ క్లియర్ చేసుకుంటున్నారు శ్రావణి. అలాగే అశోక్ గజపతిరాజు కుమార్తె అధితి గజపతి రాజు కూడా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే బొబ్బిలి అసెంబ్లీ స్థానం నుంచి ఈసారి సుజయ కృష్ణ రంగారావు పోటీ నుంచి తప్పుకుని తమ్ముడు బేబీ నాయనను బరిలో దించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. సుజయ కృష్ణ రాజకీయ వారసుడిగా సోదరుడు ఎక్కడ బరిలో దిగే అవకాశం కనిపిస్తుంది.

    విశాఖలోను ఆసక్తి చూపిస్తున్న వారసులు..

    ఇకపోతే ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ పలువురు రాజకీయ వారసులు ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నుంచే వారసులు సిద్ధమవుతుండడం గమనార్హం. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ నర్సీపట్నం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారు. అలాగే పెందుర్తి నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు ఎప్పటి నుంచో గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి నియోజకవర్గంలో కార్యక్రమాలన్నీ అప్పలనాయుడే నిర్వహిస్తున్నారు. అయితే ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వైసీపీ నుంచి పోటీ చేయాలనుకుంటున్న వారసులు లేకపోవడం గమనార్హం.

    అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?

    వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోటీ చేసే అభ్యర్థులంతా గెలవాలన్న లక్ష్యంతోనే పార్టీలు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వారసులకు టికెట్లు కేటాయించి ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులను ఆయా పార్టీలు తెచ్చుకుంటాయా అన్నది పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో వారసులను బరిలోకి దించవద్దని, ముఖ్యనేతలే బరిలో ఉండాలని వైసిపి ఇప్పటికే స్పష్టం చేసిందని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఇదే విధానాన్ని దాదాపు అనుసరించే అవకాశం ఉంది. ప్రత్యర్థి పార్టీ నుంచి సీనియర్ నేత బరిలో దిగి.. ఈ పార్టీ నుంచి జూనియర్ బరిలో దిగితే విజయంపై ప్రభావం ఉంటుందని ఇరు పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. దీంతో వారసుల రాజకీయ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందా..? లేదా..? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.