Srikakulam Politics: ఏ ముహూర్తాన మంత్రివర్గ విస్తరణ చేపట్టారో తెలియదు కానీ.. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా వైసీపీలో విభేదాలు వెలుగులోకి వస్తున్నాయి. ముదిరిపాకన పడుతున్నాయి. నెల్లూరులో తాజా మాజీ అనిల్ కుమార్ యాదవ్, మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డిల మధ్య రచ్చ నడుస్తోంది. స్వయంగా జగన్ ఇద్దరు నేతలను పిలిచి అక్షింతలు వేసినా వారు తీరు మారలేదు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో విభేదాల పర్వం వెలుగులోకి వచ్చింది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ధర్మాన క్రిష్ణదాస్ ను కేబినెట్ నుంచి తొలగించి.. ఆయన తమ్ముడు ధర్మాన ప్రసాదరావుకు పదవి ఇచ్చారు. సోదరుడు నిర్వర్తించిన రెవెన్యూ శాఖనే కేటాయించారు. అయితే మంత్రి పదవి ఆశించిన స్పీకర్ తమ్మినేని సీతారాం తనను కాదని ధర్మాన ప్రసాదరావుకు పదవి ఇవ్వడంపై కుతకుత ఉడికిపోతున్నారు. తాను నోరు తెరిచి తనకు ఒక్కసారి మంత్రిగా అవకాశం ఇవ్వాలని కోరినా అధినేత పట్టించుకోకపోవడంపై ఆగ్రహంతో ఉన్నారు.
అందుకే ధర్మాన ప్రసాదరావు జిల్లాకు విచ్చేసే సమయంలో జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు హాజరైనా.. స్పీకర్ తమ్మినేని నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు హాజరుకాకుండా కట్టడి చేశారు. కనీసం మాటవరసకైనా కుటుంబసభ్యులను సైతం కార్యక్రమానికి పంపలేదు. మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా మాట వరసకైనా స్పీకర్ తమ్మినేని ప్రస్తావన తేలేదు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా కనీసం గౌరవం ఇవ్వలేదు. ఒకవైపు తమ్మినేనికి మంత్రి పదవి ఇవ్వకపోవడం, ధర్మాన ప్రసాదరావుకు లభించడంతో తమ్మినేని యాంటీ వర్గం ఇప్పుడు యాక్టివ్ అయ్యింది. ఇన్నాళ్లకు సమర్థుడికి పదవి దక్కిందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరీ తమ్మినేనిపై హాట్ కామెంట్లు మొదలు పెట్టారు. అంతటితో ఆగకుండా వచ్చే ఎన్నికల్లో తమ్మినేని ఓటమి ఖాయమని కూడా ప్రచారం సాగిస్తున్నారు. దీంతో దీనిపై తమ్మినేని తెగ బాధపడుతున్నారు. యాంటీవర్గం యాక్టివ్ వెనుక మంత్రి ధర్మాన హస్తం ఉందని ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ అధినేత జగన్ కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. అయితే వీటిని మంత్రి ధర్మాన ప్రసాదరావు పట్టించుకోవడం లేదు. మూడేళ్లు తనను ఆడుకున్నారు. ఈ రెండేళ్లు తాను ఆడుకుంటానని అనచరుల వద్ద చెబుతున్నారు.
Also Read: Prashant Kishor: పీకే వ్యూహాలు కాంగ్రెస్ ను గట్టెక్కిస్తాయా?
సోదరుల మధ్య దూరం..
తాజా పరిణామాలు ధర్మాన సోదరుల మధ్య మరింత దూరం పెంచాయి. పదవి పోయేసరికి క్రిష్ణదాస్ సైలెంట్ అయిపోయారు. కనీసం మీడియాకు సైతం కనిపించకుండా వెళ్లిపోయారు. రేపో మాపో తన పదవిపోయి తమ్ముడికి వస్తుందని చెప్పిన క్రిష్టదాస్ తరువాత కనిపించకుండా పోయారు. సోదరుడు మంత్రి అయి జిల్లాకు వచ్చిన సమయంలో సైతం ఆయన కానీ.. ఆయన కుటుంబసభ్యులు కానీ వేదిక పంచుకోలేదు. చివరకు క్రిష్ణదాస్ ప్రాతినిధ్యం వహించిన నరసన్నపేట నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులకు సైతం ధర్మాన ప్రసాదరావు స్వాగత సభలో పరాభవం ఎదురైంది. సామాన్య కార్యకర్తలతో పాటు వేదిక కిందే వారంతా కూర్చున్నారు. కనీసం వేదికపైకి పిలిచిన దాఖలాలు లేకపోవడంతో సోదరులిద్దరి మధ్య విభేదాలకు తాము అవమానం ఎదుర్కొవాల్సి వస్తోందని వాపోతున్నారు.
గత కొన్నాళ్లుగా ధర్మాన సోదరులిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మూడేళ్ల పదవీకాలంలో క్రిష్ణదాస్ తన కంటే సీనియర్ అయిన తమ్ముడ్ని లెక్క చేయలేదు. పైగా రాజకీయంగా పడని, పొసగని తమ్మినేనితో చనువుగా ఉండేవారు. జిల్లా కేంద్రానికి ఎమ్మెల్యేగా ఉన్న ధర్మాన ప్రసాదరావుకు తెలియకుండా సమావేశాలు, సమీక్షలు పెట్టేవారు. తనది రాజ్యాంగబద్ధ పదవి అని స్పీకర్ తమ్మినేని.. తాను డిప్యూటీ సీఎంనని క్రిష్ణదాస్ ఆధిపత్యం ప్రదర్శించేవారు. వారితో ధర్మాన ప్రసాదరావు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి వరించడంతో రివేంజ్ ప్రారంభమైంది. రెవెన్యూ శాఖలో అవినీతి కోరలు చాచిందన్న వ్యాఖ్యలు చేయడం ద్వారా సోదరుడు క్రిష్ణదాస్ ను ఢిఫెన్స్ లో పడేయగా.. తమ్మినేని యాంటీ వర్గానికి ప్రోత్సహించడ ద్వారా ఇబ్బందులు పెట్టాలని ప్రసాదరావు భావిస్తున్నారు. సో మంత్రివర్గ విస్తరణ పుణ్యమా అని సిక్కోలు వైసీపీలో సిగపాట్లు ప్రారంభం కావడంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read:Kodali Nani: కొడాలి నాని సైలెంట్.. గుడివాడకే పరిమితమైన వైసీపీ ఫైర్ బ్రాండ్
Recommended Videos: