నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య ఆనందయ్య మందు పంపిణీ అస్త్రంగా మారింది. ఈ మందు పంపిణీతో అధికార వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి 120 కోట్లు సంపాదించే స్కెచ్ గీశారని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆన్ లైన్ లో ఆనందయ్య మందును అమ్మేస్తున్నారంటూ వెబ్ సైట్ సృష్టించింది వైసీపీ నేతలే అని ఆరోపించారు.
ఇక సోమిరెడ్డి ఆరోపణలపై వైసీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. సోమిరెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని.. దమ్ముంటే తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. ఆరోపణలకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తి విచారణకు కూడా తాను సిద్ధమన్నారు. తన తప్పుందని నిరూపిస్తే ఉరేసుకుంటానని స్పష్టం చేశారు.
మొదటి ఆనందయ్య మందుపై సర్వేపల్లిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరుపక్షాలు రచ్చకెక్కడంతో ఈ వివాదంపై ఆనందయ్య స్పందించారు. టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు. సోమిరెడ్డి వ్యాఖ్యలను ఆనందయ్య ఖండించారు. వెబ్ సైట్ కు, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. సోమిరెడ్డి దీన్ని చాలా ఎక్కువ చేసి చూపిస్తున్నారని అన్నారు. ఆయన అంతగా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. తనను రాజకీయాల్లోకి లాగొద్దని ఆనందయ్య విజ్ఞప్తి చేశారు.
మీకూ మీకూ ఉంటే నేరుగా చూసుకోండి.. నన్ను మాత్రం రాజకీయాల్లోకి లాగకండి అని ఆనందయ్య వ్యాఖ్యానించారు. సోమవారం నుంచి మందు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నానని ఆనందయ్య తెలిపారు.