Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌కు వైసీపీ నుంచి విముక్తి కల్పిస్తానని ప్రతినబూని వారాహి యాత్ర ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించాడు జనసేనాని పవన్ కళ్యాణ్. అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇక వారాహి యాత్రతో సామాజిక సమీకరణకు, కులాల ఐక్యతకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఎవరికీ అంతుచిక్కని వ్యూహంతో ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు.
కులాల ఐక్యతకు పిలుపు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గడిచిన 65 ఏళ్లలో ఏపీని పాలించింది. రెడ్లు, కమ్మ నాయకులే. ఈ క్రమంలో ఈసారి కాపులను అధికారంలోకి ఎందుకు తీసుకురాకుడదన్న ప్రణాళికతో పవన్ కులాల ఐక్యతకు పిలుపు నిచ్చారు. పది రోజులపాటు సాగిన యాత్రకు అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు. పవన్ ఇచ్చే ప్రతీ పిలుపునకు జనం నుంచి అనూహ్య స్పందన వచ్చింది.
నాడు జగన్.. నేడు పవన్..
అయితే 2019లో కూడా స్పందన వచ్చిందని చాలా మంది అనుకోవచ్చు. కానీ నాటి స్పందన వేరు. నేటి స్పందన వేరు. నాడు పవన్‌ను ఒక సినిమా స్టార్‌గానే చాలా మంది చూశారు. అప్పటి పాలకులపై ఉన్న వ్యతిరేకత, అప్పటికే వైసీపీ ప్రతిపక్షంగా ఉండడం అన్నీ జగన్‌కు కలిసి వచ్చాయి. కానీ ప్రస్తుతం పవన్ నాడు జగన్ పోషించిన పాత్రనే పోషిస్తున్నారు. టీడీపీని గద్దె దించేందకు జగన్ ఎలాంటి వ్యూహాలు రూపొందించారో.. అంతకు మించిన వ్యూహాలతో పవన్ రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నారు.
వెనుకబడిన కులాలను ఏకం చేసేలా..
ఏపీలో వెనుకబడిన కులాల ప్రజలను ఏకతాటిపైకి తెచ్చేలా జనసేనాని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. తొలి విడత వారాహియాత్రతోనే అది స్పష్టంగా కనిపించింది. ఎప్పుడూ రెండు కులాల చేతిలోనే అధికారం ఎందకు ఉండాలన్న పవన్ ప్రశ్న ప్రజలను ఆలోచింపజేస్తోంది. వెనుకబడినవారు ఎప్పటికీ వెనుకబడిపోవాలా అన్న భావన చాలామంది మందిలో మెదలుతోంది.
అధికార పక్షానికి అంతుచిక్కని పవన్ తీరు..
పవన్ వారాహి యాత్రతోనే ఏపీలో అధికార పార్టీలో వణుకు మొదలైంది. ప్రతీ రోజు సభకు వస్తున్న జనం వైసీపీ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మరోవైపు జనసేనాని ప్రశ్నలు వైసీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ ఏ వ్యూహంతో వెళ్తున్నారో తెలుసుకునేందుకు అధికార పార్టీ నేతలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. మొత్తంగా జనసేన దూకుడుతో ఇప్పుడు ఏపీలో అధికార, విపక్షా పార్టీలు ఆలోచనలో పడ్డాయి.