Kantara 2: 2022లో సంచలన చిత్రంగా అవతరించింది కాంతార. ఈ కన్నడ చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ దశాబ్దకాలంలో ఇంత భారీగా లాభాలు పంచిన చిత్రం మరొకటి లేదు. హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించారు. ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని కర్ణాటకలో గల ఒక తెగ ప్రజల సంస్కృతి ఆధారంగా చెప్పే ప్రయత్నం చేశారు.
రా అండ్ రస్టిక్ సబ్జెక్టు గా తెరకెక్కిన కాంతార ప్రేక్షకాదరణ పొందింది. హిందీలో ఈ చిత్రం ఆదరణ దక్కించుకోవడం విశేషంగా మారింది. కాంతార మూవీతో రిషబ్ శెట్టి పేరు ఇండియా వైడ్ వినిపించింది. కాంతార చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన అల్లు అరవింద్ మంచి లాభాలు రాబట్టారు. అలాగే రిషబ్ శెట్టి తన బ్యానర్ లో మూవీ చేయాలని కోరాడు.
ఇదిలా ఉంటే కాంతార 2 ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయని తెలుస్తుంది. స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న కాంతార 2 ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుందట. ఆగస్టు 27 నుండి షూటింగ్ మొదలుకానుందట. అయితే ఇది కాంతార సీక్వెల్ కాదట. ప్రీక్వెల్ అట. కాంతార కథ మొదలు కావడానికి ముందు ఏం జరిగిందో చెప్పనున్నారట.
కాంతార మూవీ ఒక రాజు ఇచ్చిన మాటతో మొదలవుతుంది. ప్రశాంతత లేని రాజుకు ఒక రాయి ఆనందం కలిగిస్తుంది. ఆ రాయి కావాలంటే ఊరి ప్రజలకు భూమి దానం చేయాలని దేవుడు చెప్తాడు. ఊరి జనానికి మాటిచ్చిన రాజు భూమి దానం చేస్తాడు. రాజు వారసుడు మాత్రం అది ఒప్పుకోడు. భూమిని దక్కించుకోవాలని చూస్తాడు. మరి రాజు ఊరి ప్రజలకు మాట ఇవ్వడానికి ముందు ఏం జరిగిందో కాంతార 2లో చెప్పనున్నారట.