లాకప్ డెత్‌లు, ఎన్‌కౌంటర్లు కొత్తేమీ కాదు. 1970ల చివర్లో, 1980ల్లో కూడా నక్సలైట్లు, గ్యాంగ్ స్టర్లతో తలపడినప్పుడు గతంలో చాలా ఎన్‌కౌంటర్లు జరిగాయి.
కానీ, ఇప్పుడు వికాస్ దుబే ఎన్‌కౌంటర్ కానీ హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ అత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్ కానీ వాటన్నిటికీ పూర్తిగా భిన్నమైనది. దుబే గ్యాంగ్ స్టర్ అయినప్పటికీ రాజకీయాలతో బాగా సంబంధాలున్నవాడు.
‘దుబే రాజకీయంగా శక్తిమంతుడే అయినప్పటికీ తనను నడిపించేవారి రాజకీయ మనుగడ ప్రయోజనాల కోసం తాత్కాలికంగా మౌనంగా మారిన గ్యాంగ్‌స్టర్. కానీ, హైదరాబాద్ కేసు నిందితులు అలా కాదు, వారు దుర్బలమైన వర్గాల నుంచి వచ్చారు. నిరుద్యోగ, నిరుపేద నేపథ్యం వారిది. కాబట్టి వారిని అంతం చేసినా సమాజం నుంచి పెద్దగా నిరసన స్వరాలు వినిపించవని అనేకమంది వాదన.
ఇలాంటి ఘటనలో ఆ మనుషులెవరన్నది కాదు పోలీసులెలా ప్రవర్తించారన్నది చూడాలని, న్యాయసూత్రాల అమలుకు రాజ్యాంగ నిబంధనలు ఉన్నా లేనట్లే వ్యవహరిస్తున్నాయి ప్రభుత్వాలు. అగ్రవర్ణాలు అంటరానితనం పాటించడాన్ని మంచి పనిగానే భావిస్తారు. ఏ రాజ్యాంగ సూత్రాలపై ఆధారపడి ఈ దేశాన్ని నిర్మించుకున్నామో దాన్నే విస్మరిస్తామా?’ అని సామాజిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
‘హైదరాబాద్‌లో దిశ అత్యాచార ఘటన నిందితుల విషయానికొస్తే.. ఎవరిని చంపారనే విషయంలో ఎవరికీ సమాధానాలు అవసరం లేదు. వారికి ఈ సమాజంలో గుర్తింపు లేదు. వారు పూర్తిగా అనామకులు. పైకి పంపించేయడానికి తగినవారు. వారిలో ఏ ఒక్కరి పేరైనా మీకు గుర్తుందా? కానీ, పదేళ్ల తరువాత కూడా వికాస్ దుబే పేరు గుర్తుంటుంది. దుబే ఎవరిని చంపాడో మీకు తెలుసు.. అక్కడే తేడా వస్తుంది. ప్రజలు వ్యవస్థపై నమ్మకం కోల్పోవడానికి సంబంధించిన సమస్య కాదిది.. ఇది పూర్తిగా భిన్నమైన సంకేతాన్నిస్తుంది.
”హింసాత్మక స్థితిని ఇది సూచిస్తుంది. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులకు చంపడానికి అన్ని అధికారాలిచ్చేశారు.. అందుకే యోగి ప్రభుత్వాన్ని ఎన్‌కౌంటర్ గవర్నమెంట్ అంటారు. ఉత్తరప్రదేశ్ లోని హింసా చక్రం చాలా భయానకమైనది. పోలీసులకు పూర్తిగా కట్లు వదిలేశారు.. చంపమని సూచిస్తే చాలు చంపేస్తారు వారు. ఒక్కోసారి వారు కూడా చనిపోతున్నారు. యూపీ పోలీసులు ప్రాణాలు తీయడంతో పాటు ఒక్కోసారి బలి పశువులూ అవుతుంటారు. న్యాయం జరగడంలో ఆలస్యమవుతున్న కారణంగానే ఇలాంటి తక్షణ న్యాయాలకు ప్రజల మద్దతు ఉంటోందనడం కరెక్టు కాదు. నిందితులు ఎవరైనా సరే, సరైన దర్యాప్తు, విచారణ జరగాని ప్రజలు వాదిస్తున్నారు.