వారాంతపు ముచ్చట్లు :
ప్రధాన రాజకీయపార్టీల స్థితిగతులు ఎలావున్నాయి?
భారత జాతీయ కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారయ్యింది. 2019 ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయటం ఆ తర్వాత ఇంతవరకు పార్టీకి అధ్యక్షుడే లేడు. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతుంది. పార్టీలో ఆంతరంగిక ప్రజాస్వామ్యం లేదు. 1998 లో సోనియా గాంధీ అధ్యక్షురాలయిన తర్వాత సంస్థాగత ఎన్నికలకు చరమగీతం పాడింది. ఆ తర్వాత ఇంతవరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కి ఎన్నికలు జరగలేదు. కేవలం నామినేటెడ్ నియామకాలే. వాటిల్లోనయినా కొత్త రక్తాన్ని ఎక్కించటానికి ప్రయత్నం చేసిందా అంటే అదీలేదు. తనకు తందానా తానా అనే భజనపరులను నియమించుకొని పార్టీని నడిపిస్తుంది. ఆ మధ్యల్లో శశి థరూర్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ లో అంతరంగిక ఎన్నికలు కావాలని మాట్లాడినా ఆ తర్వాత అది సణుగుడు కే పరిమతమయ్యింది. సంజయ్ ఝా లాంటి వాళ్ళు అదే విషయం ఓ పత్రికలో ఇంటర్వ్యూ ఇస్తే ఆయన్ను ఏకంగా పార్టీ అధికార ప్రతినిధి గా తొలగించారు. రాహుల్ గాంధీ ఎన్నికల తర్వాత కాడి కింద పడేస్తే లేదు లేదు నువ్వే వుండాలని బతిమిలాడటం చూస్తుంటే ఎటువంటి పార్టీ ఎలా అయిపోయిందని బాధేస్తుంది. దానికి కాంగ్రెస్ పార్టీ అనే పేరు తీసేసి నెహ్రూ కుటుంబ పార్టీ అని పెడితే అప్పుడు ఈ కుటుంబ విదేయులందరూ ఎటువంటి సంకోచం లేకుండా సోనియా గాంధీ కి, రాహుల్ గాంధీ కి, ప్రియాంక గాంధీ కి వీలుంటే ప్రియాంక గాంధీ సంతానానికి భజన చేస్తూ గడపొచ్చు. కాంగ్రెస్ అభిమానులు ఈ బానిస మనస్తత్వానికి అలవాటుపడటం బాధాకరం. ఇప్పటికైనా కాంగ్రెస్ బతికి బట్టకట్టాలంటే పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించి కిందినుంచి క్యాడర్ ని వుత్తేజపరిచేటట్లు చేయొచ్చు. ఆ మాట చెప్పినందుకు కరుడుగట్టిన కాంగ్రెస్ వాది సంజయ్ ఝా ని పదవినుంచి తీసేశారు. ఈ ఒక్కసారికి నెహ్రూ కుటుంబం తప్పుకొని వేరే వాళ్లకు అవకాశం ఇవ్వమని సూచించటం పార్టీ వ్యతిరేక కార్యక్రమ మెట్లా అవుతుందో సోనియా గాంధీ చెప్పాలి. అంటే వుంటే మేమే వుండాలి లేకపోతే పార్టీ తుడుచుపెట్టుకు పోయినా పర్వాలేదనే సోనియా గాంధీ మనస్తత్వం కాంగ్రెస్ పార్టీ ని నాశనం చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఎదగకపోవటానికి ఒకవిధంగా సోనియా గాంధీ నే ప్రధాన అడ్డంకి. కాబట్టి పార్టీని సంస్థాగతంగా సంస్కరించకుండా బిజెపి ని ఎదుర్కోవటం అసాధ్యం. కాంగ్రెస్ ఈ బలహీనతే బిజెపి కి లబ్ది చేకూరుస్తుంది.
సిపిఎం
భారత రాజకీయాల్లో వామపక్ష సిద్ధాంతానికి ఎప్పుడూ స్థానం వుంది. అయితే ప్రజలను ఆ దిశగా నడిపించే విధానం , స్థాయి ఇప్పుడున్న వామపక్ష పార్టీలకు కొరవడ్డాయి. సోషలిస్టు పార్టీలు కుటుంబ పార్టీలుగా మారటంతో హిందీ ప్రాంతాల్లో ప్రతిష్ట కోల్పోయాయి. కమ్యూనిస్టులు ప్రజాస్వామ్య పార్టీలుగా మారకపోవటం, దేశీయ భావాలను విస్మరించటం ప్రజలకు దూరంగా జరిగాయి. ఉదాహరణకు భారత-చైనా ఘర్షణలో దేశం తరఫున మాట్లాడక పోవటం ప్రజలు హర్షించరు. అలాగే భారతీయ సమాజం లో కుల ప్రాధాన్యతని గుర్తించటానికి చానాళ్లు నిరాకరించారు. ముఖ్యంగా సిపిఎం ఈ విషయంలో పూర్తి ఫ్యూడల్ ఆలోచనలతో వుందని చెప్పాలి. తర్వాత దశలో అలా గుర్తించక పోవటం తప్పేనని , అణగారిన కులాలకి ప్రాతినిధ్యం , ప్రోత్సాహం ఇవ్వాలని తీర్మానించుకున్నారు. మరి వాళ్ళు చేసిన తీర్మానాలకే పార్టీలో దిక్కులేదు. 1964 లో పార్టీ ఏర్పడిన తర్వాత ఇంతవరకూ ఒక్క దళిత వ్యక్తిని పార్టీ పోలిట్ బ్యూరో లోకి తీసుకోకపోవటాన్ని ఏ కోణంలో చూడాలి? ఒకవైపు దళితులకు స్థానం లేకపోవటం రెండోవైపు అగ్రకులాలే పార్టీ పోలిట్ బ్యూరో లో ఆధిపత్యం వహించటాన్ని ఫ్యూడల్ ఆలోచనలుగానే చూడాల్సి వుంటుంది. అదీగాక పోలిట్ బ్యూరో పూర్తిగా వయో వృద్ధులతో నిండిపోయింది. పోలిట్ బ్యూరో సగటు వయస్సు 69 సంవత్సరాలంటేనే దాని పరిస్థితి ఏంటో అర్ధమవుతుంది. కాంగ్రెస్ పార్టీ కుటుంబం చేతిలో బందీ అయితే సిపిఎం యధాతధ వాదుల చేతిలో బందీ అయ్యింది. పశ్చిమ బెంగాల్ లో ఒక్కసారి అధః పాతాళానికి వెళ్ళిన తర్వాత కూడా సంస్థాగత సంస్కరణలకు పూనుకోలేదంటేనే నాయకత్వం సాహసోపేత నిర్ణయాలు , సంస్కరణలు తీసుకునే స్థాయి, ధైర్యం లేదని అర్ధమవుతుంది. మరి ఈ తరుణంలో సిపిఎం తిరిగి పునరుజ్జీవం పొందే అవకాశాలు కనబడటం లేదు. అంకిత భావం తో పనిచేసే క్యాడర్ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీకి వుండటం గమనార్హం. నాయకత్వ లోపం ఈ క్యాడర్ సంపదని వాడుకోలేకపోతుంది. పార్టీ నిర్మాణాన్ని ఇప్పటి ఆలోచనలకు అనుగుణంగా మార్చుకుంటేనే తిరిగి ప్రజల విశ్వాసం పొందగలదు. దానితోపాటు పూర్తి ప్రజాస్వామ్య పార్టీగా మార్పుచెందాల్సి వుంది. పార్టీ ఎదుగుదలకు వామపక్ష సిద్ధాంతం అడ్డంకి కాదు, పార్టీ కేంద్ర నాయకత్వ ఆలోచనా ధోరణే అడ్డంకి.
బిజెపి
ఉన్నవాటిల్లో జాతీయ స్థాయిలో ప్రభావాన్ని చూపించగల పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపి ఒక్కటే. ఒక్క దక్షిణాది తప్పిస్తే మిగతా ప్రాంతాల్లో బలంగా వేళ్ళూనుకోవటమే కాకుండా నిర్మాణపరంగా పార్టీని భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా మలుచుకుంటూ వస్తుంది. ఉదాహరణకు దానికున్న 700 జిల్లా కమిటీలకు ఇటీవల అధ్యక్షుల్ని నియమించే పనిలో వున్నారు. అందులో కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. దానిప్రకారం 50 సంవత్సరాల లోపు వాళ్ళనే నియమించాలని కోరారు. ఇది సాహసోపేత నిర్ణయమే. ఎందుకంటే ఎప్పటినుంచో పాతుకుపోయిన వాళ్ళను తీసి కొత్త వాళ్ళను అదీ యువతను నియమించటం ఆహ్వానించదగ్గ పరిణామం. అంటే వచ్చే పది, పదిహేను సంవత్సరాలకు కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటున్నారన్నమాట. వీళ్ళను చూసైనా ప్రతిపక్ష పార్టీలు బుద్ధి తెచ్చుకోవచ్చు కదా. బిజెపి దీనితోపాటు సామాజిక కోణంలో పార్టీలోకి వెనకబడిన కులాల వాళ్ళను, దళితుల్ని పెద్ద ఎత్తున చేర్చుకుంటుంది. ఓ విధంగా అందరికి ప్రాతినిధ్యం వహించే పార్టీగా పరిణతి చెందింది. ఒక్క ముస్లింలు మాత్రమే తక్కువ స్థాయిలో పార్టీ వున్నారు. ‘సబ్ కా విశ్వాస్ ‘ పార్టీగా మారాలంటే వాళ్ళ ప్రాతినిధ్యం కూడా పెంచుకోవాల్సిన అవసరం వుంది. ఏది ఏమైనా మిగతా పార్టీలతో పోలిస్తే చాలా ముందు చూపుతో పార్టీ నిర్మాణాన్ని పటిష్టపరుచుకోగలుగుతుంది. ప్రస్తుతం అందరి దృష్టి కొత్త అధ్యక్షుడు నియమించబోయే పార్లమెంటరీ బోర్డు పై పడింది. వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, అనంతకుమార్ ల స్థానంలో ఎవరిని నియమించబోతున్నరనేది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మొత్తం మీద చూస్తే ఒక్క బిజెపి తప్పిస్తే మిగతా పార్టీల పరిస్థితి అధ్వానంగా వుంది. కాంగ్రెస్ పార్టీకే ఇప్పటికీ బిజెపి కి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఎదిగే అవకాశం వుంది. కానీ గాంధీ కుటుంబ ఆత్మహత్యాసదృశక విధానాల వలన ఆ అవకాశాన్ని జారవిడుచు కుంటుందనిపిస్తుంది. అదే జరిగితే 2024 ఎన్నికల్లో బిజెపి కి ఎదురు ఉండకపోవచ్చు. ఇది ఈరోజుకి అంచనా. రాజకీయాల్లో ఏరోజు ఏంజరుగుతుందో ఎవరూ చెప్పలేరు.