KCR Temple: ఉదయం లేస్తే తెలంగాణ బాపు కేసీఆర్ అంటూ భారత రాష్ట్ర సమితి నాయకుల నుంచి నమస్తే తెలంగాణ పేపర్ వరకు చేయని ప్రచారం అంటూ ఉండదు.. అంతకుముందు జరిగిన ఉద్యమాన్ని.. అమరవీరులను కూడా పక్కనపెట్టి కేసీఆర్ కే ఫస్ట్ ప్రియారిటి ఇస్తుంటారు. అదేంటని ఎవరూ ప్రశ్నించారు. ఒకవేళ ప్రశ్నిస్తే వారు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతుంటారు.. ఈ చర్చను ఇక్కడ పక్కన పెడితే త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ పార్టీలు కదనరంగంలో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఈసారి ఎవరూ తగ్గడం లేదు . భారత రాష్ట్ర సమితి దీటుగా ప్రతిపక్ష పార్టీలు ప్రచార సభలు నిర్వహిస్తున్నాయి. స్థూలంగా చెప్పాలంటే 2018 నాటి పరిస్థితయితే కనిపించడం లేదు. ఇది మర్చిపోకముందే కెసిఆర్ కు, ఆయన గులాబీ బ్యాచ్ కు మింగుడు పడని వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.. సహజంగానే ఇది ఎన్నికల ముందు అధికార పార్టీకి ఇబ్బంది కలిగిస్తోంది.
ఇంతకీ ఏమైందంటే
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలానికి చెందిన గుండ రవీందర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు. కేసీఆర్ ప్రసంగాలు అంటే విపరీతంగా ఇష్టపడేవాడు.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష కోసం చేపట్టిన ప్రతి నిరసనలోనూ అతడు పాల్గొనేవాడు. సకలజనుల సమ్మె నుంచి వంటా వార్పు వరకు అన్నింట్లోనూ అతడు సై అనేవాడు. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఎగిరి గంతేశాడు. భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల విజయం కోసం తనవంతు ప్రచారం చేశాడు. తెలంగాణ వచ్చింది కాబట్టి ప్రజల ఆకాంక్షలు మొత్తం నెరవేరుతాయని భావించాడు. తెలంగాణ వచ్చేందుకు కెసిఆర్ ప్రధాన కారణమని భావించి అతడు ఏకంగా ఒక గుడి కట్టాడు. అందులో కేసీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించాడు. కొద్దిరోజులపాటు ఆ గుడిలో పూజలు కూడా నిర్వహించాడు. కానీ ఏళ్లకు ఏళ్ళు గడుస్తున్నప్పటికీ తెలంగాణ ఏర్పాటు ఆకాంక్షలు నెరవేరకపోవడంతో అతడిలో నిరాశ అలముకుంది. గులాబీ పార్టీ ప్రజా ప్రతినిధులను కలిసి సమస్యలు వివరించినప్పటికీ వారు పట్టించుకోవడం మానేశారు. రవీందర్ లో కోపం తారాస్థాయికి చేరింది.
ఏకంగా అమ్మకానికి పెట్టాడు..
భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం తన ఆకాంక్షలను నెరవేర్చకపోవడంతో.. తన ఇంటి ఆవరణలో నిర్మించిన కేసీఆర్ పాలరాతి విగ్రహాన్ని, నిర్మించిన గుడిని అమ్మకానికి పెట్టాడు. ” తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడంతోపాటు ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి నింపడానికి నేను చాలా కృషి చేశాను. ఇందులో భాగంగానే తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్, కెసిఆర్ పాలరాతి విగ్రహాలను నా ఇంటి సమీపంలో గుడి నిర్మించి అందులో ఏర్పాటు చేశాను. దీనికోసం ఆర్థికంగా బాగానే ఖర్చు చేశాను.. భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నాకు పెద్దగా గుర్తింపు లభించలేదు.. పైగా ఆర్థిక భారం పెరిగిపోతున్న నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో కెసిఆర్ విగ్రహాన్ని, గుడిని అమ్మకానికి పెడుతున్నాను” అంటూ రవీందర్ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఇది మీడియాలో చక్కర్లు కొడుతోంది. మంచిర్యాలలో గులాబీ పార్టీ అభ్యర్థికి ఎదురు గాలి వీస్తున్న నేపథ్యంలో రవీందర్ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ మరింత ముప్పు కలిగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు రవీందర్ తో భారత రాష్ట్ర సమితి ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది.