YS Sharmila – Jagan : షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ ప్రచారంతో తాడేపల్లి తల్లడిల్లుతోందా? ఆమె చేరికతో జగన్ కు రెక్కలు ఊడి పడినట్లేనా? జగనన్న బాణం తనవైపు దూసుకొస్తుందన్న భయం వెంటాడుతుందా? అందుకే బుజ్జగింపునకు అన్న ప్రయత్నిస్తున్నారా? ఆ పనిని బాబాయికి అప్పగించారా? షర్మిల వద్దకు వెళ్లిన ఆయనకు షాక్ తగిలిందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. షర్మిల కాంగ్రెస్ వైపు వెళ్లకుండా నియంత్రించేందుకు బలమైన ప్రయత్నం జరుగుతోందని ప్రచారం జరుగుతోంది.
షర్మిల కాంగ్రెస్ లో చేరిక దాదాపు ఖాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఏపీ పగ్గాలు అందుకునేందుకు దాదాపు అంగీకరించారని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఏపీలో వైసీపీకి ఇబ్బందులు తప్పవని విశ్లేషణలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో జగన్.. తన చెల్లి షర్మిల వద్దకు రాయభారానికి పంపినట్లు తెలుస్తోంది. వైసీపీ సీనియర్ నేత, బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డిని రంగంలోకి దించినట్లు సమాచారం. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే కుటుంబంలో చిచ్చురేగుతుందని.. అది ఎవరికీ మంచిది కాదని షర్మిలకు సుబ్బారెడ్డి నచ్చచెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. కానీ అందుకు షర్మిల అంగీకరించలేదని సమాచారం. నేనెందుకు వెనక్కి తగ్గాలని ఆమె ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఒకానొక దశలో వైవీ సుబ్బారెడ్డి పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
‘ఇన్నాళ్లు తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని.. ఎప్పుడైనా పలకరించారా? ’ అని బాబాయ్ సుబ్బారెడ్డి పై షర్మిల ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టాక్ నడుస్తోంది. నాకు అన్యాయం జరిగినప్పుడు.. నేను రోడ్డున పడినప్పుడు మీరెందుకు పట్టించుకోలేదని నిలదీసినట్లు సమాచారం. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా ముఖం చూడలేదు కానీ.. ఏపీకి వస్తానంటే రాయభారానికి వచ్చారా? ఏనాడైనా నా తరుపున మాట్లాడారా? అంటూ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పట్టించుకోని మీరు.. ఇప్పుడు జగన్ కు ఇబ్బంది అవుతుందని నా దగ్గరికి వచ్చారా? ఇదేనా న్యాయం? నేను ఎంచుకున్న మార్గంలో ముందుకు వెళ్తా.. నన్ను వదిలేయండి అంటూ షర్మిల కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. అసలు నేను తీసుకున్న నిర్ణయం తర్వాత మీరు వచ్చి ఇలా కలవకూడదని.. తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆమె మండిపడినట్లు తెలుస్తోంది. మనమంతా ఒకే కుటుంబం కదా అని వైవీ సుబ్బారెడ్డి వారించే ప్రయత్నం చేసినా షర్మిల వినలేదని సమాచారం. నన్ను రోడ్డు మీద వదిలేసినప్పుడు కుటుంబంలో నేను ఒక్కరిని అన్న విషయం మీకు గుర్తు లేదా అంటూ ప్రశ్నించడంతో వైవీ సుబ్బారెడ్డి బిత్తర పోయినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే జగన్ రాజీ ప్రయత్నం బెడిసి కొట్టినట్లు సమాచారం. ఈ మేరకు ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం సాగుతోంది.