Sajjala: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో పరిస్థితులు మారుతున్నాయి. ఎవరి ఆధిపత్యం కోసం వారే తాపత్రయపడుతున్నారు. ప్రభుత్వ ఉద్దేశాలు మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో అప్రదిష్ట మూటగట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. ప్రతి దాన్ని ఆయన సమక్షంలోనే ప్రకటించడం విచిత్రంగా అనిపిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన వైఖరితో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోంది.
సజ్జల తీరు పార్టీకి తలనొప్పిగా మారుతోంది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల పార్టీలో కీలకంగా వ్యవహరించే అన్ని పనుల్లో ఆయన తన వైఖరి ప్రదర్శిస్తూ ప్రభుత్వాన్ని డైలమాలో పడగొడుతున్నారు. దీంతో ఆయన వ్యక్తిగత ఉద్దేశాలను పార్టీ సిద్ధాంతాలుగా ప్రచారం చేస్తూ తరచుగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలు తిప్పికొడుతూ వారిని ఇష్టారాజ్యంగా తిడుతూ తన నోటికి పనిచెబుతున్నారు.
తనదైన శైలిలో అనేక సమస్యలను పరిష్కరిస్తున్నానని చెబుతూ ప్రభుత్వానికి మచ్చ తెస్తున్నారు. ఈ నేపథ్యంలో సజ్జల వైఖరిపై రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సైతం కౌంటర్ ఇస్తున్నారు. సలహాదారు అంటే ఆయన పోస్టు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి కానీ ప్రజలకు కాదని తేల్చి చెప్పారు. ఉద్యోగులకు నిబంధనలు ఎలా వర్తిస్తాయో ఆయనకు కూడా వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం వైసీపీ నేతల్లోనే గుసగుసలు మొదలయ్యాయి. సజ్జల ఆధిపత్యం పై అందరిలో అనుమానాలు నెలకొన్నాయి. ఆయనకు పరిమితులు ఉండవా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విషయాలను సైతం ఆయన చెప్పడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని పలువురు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు అయితే ఆయన వైఖరిపై ఎప్పుడు చెబుతూనే ఉన్నాయి. వైసీపీలో ఎవరు లేరా ఆయనే సుప్రీమా అని ప్రశ్నించారు.