
Rythu Bandhu Scheme: తెలంగాణలో టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి రావడానికి అనేక సంక్షేమ పథకాలు అనుకూలించాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మరోసారి కేసీఆర్‌కు అధికారం కట్టబెట్టాయి. అయితె గెలిచిన తర్వాత హామీల్లో చాలావాటిని అమలు చేయలేదనుకోండి.. అయితే టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడానికి అనుకూలించిన పథకాల్లో రైతుబంధు ఒకటి. జాతీయ రాజకీయాల కోసం ఇటీవలే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన గులాబీ బాస్.. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా రైతుబంధు అమలు చేస్తామని చెబుతున్నారు. ‘అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో ముందుకెళ్తామని ప్రకటించారు. అయితే రైతు ఎజెండాతో కేంద్రంలో బీజేపీని గద్దె దించి తాను అధికారంలోకి రావాలనుకుంటున్న కేసీఆర్.. తాజాగా తనకు కలిసి వచ్చే రైతుబంధు పథకానికి రాం రాం చెప్పాలనుకుంటున్నారట.
యాసంగిలో 11 ఎకరాల వారికే జమ..
తెలంగాణలో రైతుబంధు కింద రెండు పంటలకు ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడిసాయం అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ యాసంగిలో 11 ఎకరాలలోపు వారికి మాత్రమే పెట్టుబడి సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం. డిసెంబర్ మూడో వారం నుంచే యాసంగి సీజన్ పెట్టుబడి డబ్బులను ఖాతాలో జమ చేసిన సర్కార్… 11 ఎకరాలు మించి ఉన్నవారికీ రైతుబంధు డబ్బులు చెల్లించలేదు. దీంతో రైతుబంధు డబ్బులు తమ ఖాతాలో ఎందుకు జమ కాలేదని అర్హులైన రైతులు ఆందోళన చెందుతూ వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులను కలిసి ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో రైతుబంధుపై కొత్త చర్చ తెరపైకి వచ్చింది.
‘రైతుబంధు’ ఎత్తివేత?
నిజానికి.. రైతుబంధు అమలుకు నిధులు సమస్య ఎదురవుతోంది. ప్రతిసారి అనుకున్న సమయానికి నిధులను విడుదల ఆలస్యం అవుతూవస్తోంది. ఇప్పటికే ఉద్యోగుల జీతాలు, పెండింగ్ బిల్లుల చెల్లింపుల అంశం సర్కార్‌కు తలనొప్పిగా మారగా.. రైతుబంధు అమలు ప్రభుత్వానికి చికాకు తెప్పిస్తోంది. 68 లక్షల మంది రైతులకు ఈ రైతుబంధు అమలు చేయాలంటే అంత ఈజీ కాదు. పెద్ద మొత్తంలో నిధులు అప్పులు చేయాల్సి వస్తోంది. అందుకే రైతుబంధు రద్దు చేసి దానికి సమానంగా కొత్త పథకం ప్రవేశపెట్టాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
భూస్వాములకు ఇవ్వడంపై విమర్శలు..
ఇప్పటికే రైతుబంధుపై విమర్శలు ఉన్నాయి. ఇది భూస్వాములకు ఉపయోగపడేదే తప్ప సన్నకారు రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని… పేద రైతులకు పెట్టుబడి సాయం కింద సర్కార్ ఇచ్చే రైతుబంధు డబ్బులు ఏమూలకు సరిపోవడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. వ్యవసాయం చేయకుండా పడావు పడిన భూములకు కూడా రైతుబంధు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయం చేసే వారికీ మాత్రమే రైతుబంధు అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నారు. కొంతమది పదెకరాల లోపు భూమి ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఇప్పటి వరకు అందరికీ పెట్టుబడి సాయం అందించి ఇప్పుడు కొంతమందికి ఇస్తే మిగతా వారి నుంచి వ్యతిరేకత వస్తుందని కేసీఆర్ ఆలోకచిస్తున్నారు.

రైతు పెన్షన్‌కు కసరత్తు..
2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను రైతుబంధు గట్టెక్కించింది. ప్రస్తుతం ఈ పథకం సర్కార్‌కు గుదిబండగా మారడంతో ఈ పథకం స్థానంలో కొత్త స్కీం అమలు చేయాలని గులాబీ బాస్ యోచిస్తున్నారు. రైతుబంధు ఎత్తేసి.. రైతులకు పెన్షన్ స్కీం అమలు చేయాలని చూస్తున్నారు. ఈ పథకం ప్రవేశపెట్టేందుకు కసరత్తు పూర్తి చేశారని.. పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టడమో లేదంటే, ఎన్నికలకు వెళ్లే ముందు అమలు చేయడమో చేస్తారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ భూమి కలిగి పట్టా పాస్‌బుక్ ఉన్న ప్రతీ రైతుకూ పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఎంతమందికి ఇవ్వాలి? ఎన్ని నిధులు కేటాయించాలి? ఎంత అప్పు చేయాల్సి వస్తుంది? వయోపరిమితి విధించాలా..? అనే అంశాలను కేసీఆర్ ఉన్నాతాధికారులతో చర్చలు జరుపుతున్నారని ప్రగతి భవన్ వర్గాల సమాచారం.
68 లక్షల మందికి ఇస్తున్న రైతుబంధు నిధులతో పోలిస్తే రైతు పెన్షన్ స్కీం ద్వారా నిధులు తక్కువ మొత్తంలో అవసరమవుతాయని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఈ పథకం తీసుకురావాలని యోచిస్తున్నారన్న సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.