Homeఅంతర్జాతీయంPawan Kalyan Varahi Yatra: పవన్ వారాహి యాత్ర అప్పటి నుంచే.. రూట్ మ్యాప్ సిద్ధం

Pawan Kalyan Varahi Yatra: పవన్ వారాహి యాత్ర అప్పటి నుంచే.. రూట్ మ్యాప్ సిద్ధం

Pawan Kalyan Varahi Yatra
Pawan Kalyan Varahi Yatra

Pawan Kalyan Varahi Yatra: వచ్చే ఎన్నికలకు పవన్ ఒక వ్యూహం ప్రకారం ఎదుర్కొవడానికి సిద్ధపడుతున్నారు. ప్రజల నాడిని గుర్తించి వారి మధ్యలోకి వెళ్లాలని భావిస్తున్నారు. అందుకే తన వారాహి ప్రచార యాత్రను కూడా వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ అంతులేని విజయం వెనుక ఉద్యోగ, ఉపాధ్యాయుల పాత్ర ఉంది. ఆ రెండు వర్గాలు వైసీపీకి ఏకపక్షంగా మద్దతు తెలిపారు. జగన్ వస్తే తమ సమస్యలు తీరుతాయని..అన్నివర్గాల మాదిరిగా తమకు ఇతోధికంగా సాయమందిస్తారని భావించి మద్దతుగా నిలిచారు. ఈ విషయం పోస్టల్ బ్యాలెట్ల ద్వారా నిరూపితమైంది. అయితే ఇప్పుడు ఈ రెండు వర్గాలు జగన్ సర్కారుకూ దూరమయ్యాయి. అలా చెప్పడం కంటే బద్ధ శత్రువులుగా మారిపోయాయని చెప్పడమే కరెక్ట్. అందుకే ఈ రెండు వర్గాల అసంతృప్తి బయటపడే చాన్స్ ఒకటి వచ్చింది. అదే ఎమ్మెల్సీ ఎన్నికలు. ఆ ఎన్నికల తరువాతే పవన్ తన రాజకీయ భవిష్యత్ ను ప్రకటించే చాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది.

ఏపీలో మొత్తం 13 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు కాగా 3 పట్టభద్రులు స్థానాలు, 2 ఉపాధ్యాయ స్థానాలు ఉన్నాయి. మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇందులో స్థానిక సంస్థల స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుంది. కానీ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం పోటాపోటీ నెలకొంది. అయితే వాటిలో కూడా విజయం సాధించేందుకు వైసీపీ సర్కారు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రలోభాలకు సైతం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఎక్కడికక్కడే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Pawan Kalyan Varahi Yatra
Pawan Kalyan Varahi Yatra

అయితే అందరి దృష్టి ఇప్పుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలపైనే ఉంది. ప్రకాశం- నెల్లూరు-చిత్తూరు జిల్లాలకు సంబంధించి ఓ ఎమ్మెల్సీ స్థానం కాగా.. రెండోది కడప-అనంతపురం-కర్నూలు జిల్లాలకు సంబంధించింది. ఈ ఎన్నికల ద్వారా రాయలసీమలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా లేదా అన్న సంగతి తెలుస్తుంది. ఈ ఎన్నికల్ని అధికార పార్టీ కీలకంగా భావిస్తోందట. ఈ ఎన్నికల్లో పాజిటివ్‌ ఫలితాలు వస్తే.. అది వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కూడా ప్లస్‌ అవుతుందని భావిస్తోందట. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలను రచిస్తోంది. విజయానికి ఏ మార్గం ఉన్నా వదలడం లేదు. అదే సమయంలో ఉపాధ్యాయుల్లో కూడా ఒక రకమైన కసి పెరిగింది. ఇప్పుడు కానీ ప్రతిఘటన చూపకుంటే అసలుకే మోసం వస్తుందని గ్రహించి ఆ వర్గం ఏకతాటిపైకి రావడం అధికార పార్టీని కలవరపరుస్తోంది.

అటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అధికార పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. మొత్తం మూడు పట్ట భద్రుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకోనున్నారు. ప్రధానంగా నిరుద్యోగ సమస్య ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని విపక్షాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసే విషయంలో ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్‌ అయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అటు ప్రజా వ్యతిరేక పాలనపై యువతలో నిరాశ ఉందని భావిస్తున్నాయి. నిరుద్యోగ యువత, విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపై విపక్షాలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ అధికారంతో ఎమ్మెల్సీ స్థానాలను గెలవాలని అధికార పక్షం పావులు కదుపుతోంది.

అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ తోనే పవన్ తన వారాహి యాత్ర షెడ్యూల్ ను పొడిగించుకున్నట్టు తెలుస్తోంది. రెండు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను అనుసరించి వారాహి యాత్రకు సిద్ధపడుతున్నారు. అధికార పక్షానికి ప్రతికూల ఫలితాలు వస్తే ఒకలా.. అనుకూల ఫలితాలు వస్తే మరోలా యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. ఫలితాలు వచ్చిన కొద్దిరోజులకే వారాహి వాహనం రోడ్డెక్కే అవకాశం ఉంది. యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకొని పవన్ అన్ని సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. సో మార్చి 16 తరువాత పవన్ చర్యలు వేగవంతం కానున్నాయన్న మాట.

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular