
Karimnagar Electric Bike: వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆ యువకుడు ఇంటికి దూరంగా ఉన్న పొలం వద్దకు రోజు వెళ్లిరావడానికి పడుతున్న ఇబ్బందిని గుర్తించాడు. నాన్న కష్టాన్ని తీర్చాలనుకున్నాడు. పెరిగిన పెట్రోల్ ధరలతో బైక్‌పై వెళ్లడం భారంగా మారుతోందని గుర్తించాడు. తన తెలివినంతా పెట్టుబడిగా పెట్టాడు. తండ్రి పాత బైక్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చేశాడు. నాన్నకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఐదు అంటే ఐదు గంటలు చార్జింగ్(రూ.25 ఖర్చు)తో 180 కిలోమీటర్లు ప్రయాణించేలా రూపొందించాడు.
ఆటో మొబైల్ డిప్లొమా పూర్తి చేసి..
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లికి చెందిన కాసం అఖిల్‌రెడ్డి.. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఆటో మొబైల్ లో ఇంజినీరింగ్ పూర్తీ చేశాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన అఖిల్ తన తండ్రి ఇంటికి దూరంగా ఉన్న వ్యవసాయ పొలాలకి వెళ్లడానికి పెట్రోల్ రేట్లతో పడుతున్న ఇబ్బందులు చూసి తన తండ్రి బైక్‌ను ఎలక్ట్రిక్ బ్యాటరితో నడిచేలా మార్చాలని ఆలోచించాడు. తన తెలివితేటలకి పదునుపెట్టి తమ వద్దనున్న తండ్రి పాత హీరో హోండా మోటార్ బైక్‌ని ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాలని అనుకున్నాడు. తనకున్న డిప్లమా నాలెడ్జ్ తో లక్ష రూపాయలు వెచ్చించి 4.8 కిలోవాట్ కరెంట్ మోటార్, కంట్రోలర్, కన్వర్టర్‌ను అమర్చి స్పీడో మీటర్‌ను సైతం పెట్టి అనుసంధానం చేశాడు. సెంటర్ అఫ్ గ్రావిటీతో బైక్ తయ్యారు చెయ్యడంతో రోడ్డుపై నడిపేటప్పుడు డెబ్బై కిలోమీటర్ల వేగంతో వెళ్లినా బండి బ్యాలెన్స్ తప్పకుండ ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు.
కాలిపోకుండా..
ఇటీవల విద్యుత్ బైక్‌లు తరచూ వేడికి పేలిపోతుండడంతో తాను తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్‌ను గ్రామంలో ఉన్న ఓ గుట్ట సమీపంలో మూడు రోజులపాటు ఎండలో ఉంచాడు. ఎలాంటి సమస్యలు తలెత్తకపోవడంతో బ్యాటరీ నుంచి ఎక్కువ కరెంట్ వచ్చేలా మోటార్‌కి సమస్యలు రాకుండా ఎంíసీబీ(మీనియేచర్ సర్క్యూట్ బ్రేకర్ )ని అమర్చాడు.

18 నెలలుగా టెస్టింగ్..
పెట్రోల్ బైక్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చి 18 నెలలు గడిచింది. ఇప్పటి వరకు అనేక రకాలుగా టెస్టింగ్ చేస్తూ మార్చులు చేర్పులు చేస్తున్నాడు అఖిల్‌రెడ్డి. ఇంకా రెండేళ్లలో మరిన్ని టెస్టింగ్‌లు చేసి సామాన్యులకి తక్కువ ధరలో ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తానని చెబుతునానడు. తన తండ్రి బైక్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చేందుకు ఇప్పటి వరకు రూ.1.30 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపాడు. ఎక్కువ మొత్తంలో ఇలాంటి బైక్‌లు తయారు చేస్తే తక్కువ రేటుకే సామాన్యులకు అందించవచ్చని పేర్కొంటున్నాడు.
తానూ తయారు చేసిన బైక్‌లో రెండు ఆప్షన్లు ఉన్నాయన్నాడు అఖిల్. ఐదు గంటలు చార్జింగ్ పెడితే 180 కిలోమీటర్లు, 8 గంటలు చార్జింగ్ పెడితే 200 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలిపారు. దీనికి కేవలం 5 యూనిట్ల విద్యుత్(రూ.25) ఖర్చవుతుందని చెబుతున్నాడు.