Medaram Jatara 2022: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన శ్రీ మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రెండేళ్లకొకసారి వచ్చే వన దేవతల జాతరకు ఇసుకెస్తే రాళనంత జనం వస్తుంటారు. ఒక్క తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి వనదేవతలైన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుంటారు. మేడారంలో వనదేవతలు గద్దెల రూపంలో దర్శనమిస్తుంటారు. సమ్మక్కను కుంకుమ భరణి రూపంలో తీసుకొచ్చి కోయ గిరిజనులు గద్దెలపై ప్రతిష్టిస్తారు. ఆనాడు జాతర వైభవంగా సాగుతుంది. అడుగుతీసి అడుగు వేయలేనంత జనం కనిపిస్తుంటారు. ఇది దేశంలో జరిగే మరో కుంభమేళాను తలపిస్తుంటుంది.
ఈ నేపథ్యంలోనే మేడారం వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ మేడారం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే 3,845 భస్తులను నడపాలని నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి మేడారానికి బస్సులను నడపనున్నారు.
జాతర కోసం 12,150 మంది సిబ్బందిని కేటాయిస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. ఈ సిబ్బందికి మెరుగైన వసతితో పాటు మంచి ఆహారం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు వెబ్‌సైట్, యాప్ ద్వారా మేడారానికి ఆర్టీసీ ద్వారా వెళ్లేందుకు టికెట్లను బుక్ చేసుకోవచ్చని సజ్జనార్ ఇటీవల వెల్లడించారు.
Also Read: ఏపీలో ‘చలో విజయవాడ’ టెన్షన్.. మోహరించిన ఉద్యోగులు, పోలీసులు.. ఏం జరుగనుంది?
తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మేడారానికి ప్రత్యేక బస్సుల విషయంలో ట్వీట్ చేశారు. ఆర్టీసీ బస్సులు మేడారంలోని అమ్మవార్ల గద్దెల దగ్గరకు వెళ్తాయని ఆయన తెలిపారు. ప్రైవేటు వాహనాలను గద్దెలకు కనీసం ఐదు కిలో మీటర్ల దూరంలో నిలుపుతారు. అక్కడినుంచి నడుచుకుంటూ లేదా ఆటోల ద్వారా గద్దెల దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. అదే ఆర్టీసీ బస్సుల్లో వెళ్తే ఈ ఇబ్బందులు ఉండకుండా నేరుగా గద్దెల వరకు వెళ్లొచ్చు. ఇంకా మేడారం వెళ్లే భక్తులు 30 మంది ఉంటే వారి వద్దకే బస్సులు పంపిస్తామని ఆర్టీసీ ఎండీ తెలిపారు. ఇతర వివరాల కొరకు మీ సమీప డిపో మేనేజర్‌ను సంప్రదించాలని కోరారు. లేనియెడల ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-30102829, 68153333 సంప్రదించాలని ట్వీట్ రూపంలో పేర్కొన్నారు.
Also Read: ఉప్పెనలా వచ్చిన ఉద్యోగులు..చేతులెత్తేసిన పోలీసులు