టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీనియర్ల నుంచి సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. మొదటి నుంచి ఆయన నియామకాన్ని తప్పుబట్టిన సీనియర్లు ఆయన వ్యవహార శైలిపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తనదైన శైలిలో దూసుకు వెళ్తున్నారు. పార్టీని బలోపేతం చేసే క్రమంలో ఆయన అలుపెరని విధంగా శ్రమిస్తున్నారు. సీనియర్ల మాటలు బేఖాతరు చేస్తూ పార్టీలో జవసత్వాలు నింపే పనిలో పడ్డారు. ప్రభుత్వంపై విరుచుకుపడుతూ పార్టీ ఉనికిని తెలియజేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీలో రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడలు చేస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా జగ్గారెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో సీనియర్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేసే పనిలో భాగంగా ఇవన్నీ పట్టించుకుంటే వీలు కాదని రేవంత్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఇక దళిత, గిరిజన దండోరా సభల ద్వారా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఇంద్రవెల్లి నుంచి గజ్వేల్ సభల వరకు సీనియర్లను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకున్నారనే అక్కసు వారిలో నెలకొంది. దీంతో వారు సభలకు రావడం మానేశారు. రేవంత్ రెడ్డి తీరుపై సీనియర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సీనియర్లకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని వారి వాదన. దీంతో పార్టీలో ఏం జరుగుతుందనే విషయం కార్యకర్తల్లో కూడా అనుమానంగానే ఉంటోంది.
గాంధీభవన్ లో జరగిన అఖిలపక్ష సమావేశానికి ఎవరెవరు వస్తున్నారనే సమాచారం కూడా సీనియర్లకు తెలియకపోవడంతో వారిలో అసంతృప్తికి కారణమైందని తెలుస్తోంది. దీంతో వారు పార్టీకి దూరంగా ఉండడమే మేలని భావిస్తున్నట్లు సమాచారం. ఇన్నాళ్లు చేసిన సేవలకు తగిన గుర్తింపు మాత్రం దక్కడం లేదని వారి ఆవేదన. ఈ క్రమంలో అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికే సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాకూర్ కూడా రేవంత్ నిర్ణయాలకు వంత పాడుతున్నట్లు సమాచారం. దీంతో సీనియర్లలో సహజంగానే ఆగ్రహం వస్తున్నట్లు చెబుతున్నారు.