రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. ఆయనకు బాధ్యతలు అప్పగించడంతో ఆ కేడర్లో ఎక్కడలేని జోష్ వచ్చింది. అయితే.. అధికారం సాధించడానికి సొంత పార్టీలో జోష్ పెరిగితే సరిపోదు. ప్రజల్లోనూ నమ్మకం ఏర్పడాలి. వారి విశ్వాసం చూరగొనాలి. అప్పుడే.. ఓట్లు రాలుతాయి. అయితే.. ఇది అనుకున్నంత తేలికాదు. అడ్డంకులన్నీ ఎదుర్కొని, పార్టీని ఫైనల్ కు తీసుకెళ్లి, కప్పు కొట్టాలంటే ప్రధానంగా మూడు అడ్డంకులను రేవంత్ అధిగమించాల్సి ఉంది.
ఇందులో మొదటిది అధికార పార్టీని ఢీకొట్టడం. కేసీఆర్ తో, కేటీఆర్ తో మాటలతో ఢీకొట్టడంతో రేవంత్ ధీటుగానే ఉంటారు. అందులో సందేహం లేదు. కానీ.. ఒక పార్టీ బలాన్ని నిర్దేశించేవి మాటలు కాదు ఓట్లు. ఎన్నికల్లో గెలుపే.. రాజకీయ పార్టీ స్థాయిని వెల్లడిస్తుంది. అందువల్ల అధికార పార్టీని డామినేట్ చేయడానికి ఖచ్చితంగా ఎన్నికల్లో సత్తా చాటాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు చూస్తే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక మినహా.. సమీప భవిష్యత్ లో ఎన్నికలు లేవు. మరి, హుజూరాబాద్ లో కాంగ్రెస్ గెలుపుకు ఉన్న అవకాశం ఎంత అంటే.. స్పష్టమైన సమాధానం చెప్పలేని పరిస్థితి. కాబట్టి.. టీఆర్ ఎస్ ను ఎదుర్కొనేందుకు రేవంత్ మరింతగా కృషి చేయాల్సి ఉంటుంది.
ఇక, రెండోది రెండో స్థానం తమదేనని మళ్లీ చాటుకోవడం. దుబ్బాక ఉప ఎన్నిక ముందు వరకూ కాంగ్రెస్ ఎంత డీలా పడిపోయినా.. ప్రధాన ప్రతిపక్షం హోదాలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగానే కొనసాగింది. అయితే.. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపుతో పరిస్థితి మారిపోయింది. జీహెచ్ ఎంసీ ఫలితాల హోరుతో కాషాయ పార్టీ జోరు అమాంతం పెరిగిపోయింది. టీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటున్నారు బీజేపీ నేతలు. ఈ పరిస్థితిని మార్చడం రేవంత్ కు అనివార్యం. ఇలా జరగాలంటే.. పార్టీలో నుంచి బయటకు వలసలు లేకుండా చూడాలి. పాత నేతలను తిరిగి గూటికి చేర్చాలి. ఈ విషయంలో కొంత సక్సెస్ అయ్యారుగానీ.. ఇంకా చాలా ఉంది.
మూడోది.. అత్యంత ప్రధానమైనది సొంత పార్టీలోని ప్రత్యర్థులను ఎదుర్కోవడం. రేవంత్ కు పీసీసీ ఇవ్వడాన్ని ఎంత మంది సీనియర్లు వ్యతిరేకించారో అందరికీ తెలిసిందే. ఒకరిద్దరు బాహాటంగా బయటపడితే.. మిగిలినవారు లోపల రగిలిపోయారు. ఇప్పటికీ.. పరిస్థితి పూర్తిగా సద్దుమణిగినట్టుగా లేదు. కౌశిక్ రెడ్డి పార్టీలోనే ఉంటూ.. గులాబీ దళానికి సద్దులు మోసిన వైనం చూసి అందరూ నివ్వెరపోయారు. ఇలాంటి వారు ఇంకా ఉన్నారనేది డౌట్. అలాంటి వారికి చెక్ పెట్టడం అన్నింటికన్నా ముఖ్యమైనది.
ఇవన్నీ సెట్ చేసుకుని ముందుకు సాగితే తప్ప.. కాంగ్రెస్ పార్టీ విజయ తీరాలకు చేరడం సాధ్యం కాదు. మరి, రేవంత్ రెడ్డి ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తారు? హస్తం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారా? ఆయనకు పార్టీలోని నేతలు సహకరిస్తారా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.