YSR- KCR
YSR- KCR: వారిద్దరూ ముఖ్యమంత్రులు.. ఒకరు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా పనిచేసి సంక్షేమ పాలనతో కోట్ల మంది హృదయాల్లో స్థానం సంపాదించాడు. మరొకరు స్వరాష్ట్రం కోసం ఉద్యమించి, తెలంగాణ స్వప్నం సాకారం చేసి.. పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తునాడు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది వారెవరో.. ఎస్.. ఒకరు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి. మరొకరు ప్రస్తుత తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు. మలివిడత తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన మొదట్లో వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 2004లో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలోనే తెలంగాణ కోసం నాడు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాడు. కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చేరింది. ఈటల రాజేందర్, హరీశ్‌రావు మంత్రులు అయ్యారు.
టీడీపీ పాలనలో ఉప సభాపతిగా..
ఇక 2004కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది. రెండు పర్యాయాలు టీడీపీ తరఫున చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 1999లో గెలిచిన తర్వాత నాడు టీడీపీలో ఉన్న కేసీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వలేదు. మొదటి విడత ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నారు. రెండో విడత కేసీఆర్‌ను డిప్యూటీ స్పీకర్‌గా నియమించారు బాబు.
సభాపతి సీటులో కేసీఆర్.. విపక్ష నేతగా వైఎస్సార్..
ఈ క్రమంలో నాడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. సీఎల్పీ నేతగా వైఎస్సార్ ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ ఎనమల రామకృష్ణుడు అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ స్పీకర్ హోదాలో కేసీఆర్ సభకు అధ్యక్ష బాధ్యత వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతగా వైఎస్సార్ చర్చలో మాట్లాడారు. ఈ అరుదైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉద్యమం అణచివేత…
తర్వాత తెలంగాణ అంశాన్ని వైఎస్సార్ పక్కన పెట్టడంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. దీంతో వైఎస్సార్ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడం మొదలు పెట్టారు. ఒక దశలో టీఆర్‌ఎస్‌ను చీల్చే ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలో హరీశ్‌రావు, నాడు టీఆర్‌ఎస్‌లో ఉన్న విజయశాంతి కేసీఆర్‌ను వ్యతిరేకించి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను కలిశారు. రెండోసారి అధికారంలోకి రావడానికి తెలంగాణకు వెళ్లాలంటే వీసా కావాలట అని 2009 ఎన్నికల ప్రచారంలో రాయలసీమలో ప్రకటించారు. అయితే వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తెచ్చాయి.
నాటి పథకాలే నేటికీ శ్రీరామరక్ష..
ఇక నాడు వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలే.. నేడు ప్రభుత్వాలకు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదలకు ఇళ్లు, ఉచిత అంబులెన్స్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను ఎత్తివేసే సాహసం అటు ఆంధ్రాలో, ఇటు తెలంగాణలో ఎవరూ చేయడం లేదు. పథకాలు ఎత్తేస్తే పథనం ఖాయమని వారికి తెలుసు. ఎంతో ముందుచూపుతో వైఎస్సార్ ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఎందరో జీవితాల్లో వెలుగులు నింపాయి. అందుకే వైఎస్సార్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Rare video of ys rajasekhara reddy and kcr
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com