మహారాష్ట్ర గవర్నర్ వ్యవహారంపై మరో దుమారం!

గతంలో రాజ్ భవన్ లను కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మార్చుకున్నారంటూ విమర్శలు గుప్పించిన బీజేపీ ప్రస్తుతం అదే వరవడిన అనుసరిస్తుంది. తమ పార్టీకి చెందిన వారిని గవర్నర్లుగా చేసి, వారితో బీజేపీయేతర ప్రభుత్వాలను అస్థిరం కావించడం కోసం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు చెలరేగుతున్నాయి. గత నెలలోనే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర వహించిన రాజ్ భవన్ ఇప్పుడు మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని అస్థిరం కావించడం కోసం ప్రయత్నం చేస్తున్నదా అనే అనుమానాలు […]

Written By: Neelambaram, Updated On : April 21, 2020 4:12 pm
Follow us on

గతంలో రాజ్ భవన్ లను కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మార్చుకున్నారంటూ విమర్శలు గుప్పించిన బీజేపీ ప్రస్తుతం అదే వరవడిన అనుసరిస్తుంది. తమ పార్టీకి చెందిన వారిని గవర్నర్లుగా చేసి, వారితో బీజేపీయేతర ప్రభుత్వాలను అస్థిరం కావించడం కోసం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు చెలరేగుతున్నాయి.

గత నెలలోనే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర వహించిన రాజ్ భవన్ ఇప్పుడు మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని అస్థిరం కావించడం కోసం ప్రయత్నం చేస్తున్నదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

థాకరే ను శాసన మండలికి నామినేట్ చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై 10 రోజులు దాటినా గవర్నర్ మౌనం వహిస్తూ ఉండడం, తాను ఎంపిక చేసుకున్న వారితో న్యాయ సలహాలు తీసుకొంటూ జాప్యం చేస్తుండడంతో శివసేన నేతలలో అసహనం వ్యక్తం అవుతున్నది.

గత నవంబర్ 27న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన థాకరే ఏ సభలోను సభ్యుడు కారు. ఆరు నెలల లోపుగా ఏదో ఒక సభకు ఎన్నిక కావలసి ఉన్నది. అయితే కరోనా కారణంగా శాసనమండలి ఎన్నికలు వాయిదా పడడంతో మండలికి ఎన్నిక కావడం సాధ్యం కాలేదు. దానితో ఈ నెల 27 లోగా ఆయన మండలి సభ్యుడు కావలసి ఉంది.

అందుకనే నామినేషన్ కోటా నుండి ఆయనను నామినేట్ చేయించాలని మంత్రివర్గం గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ కి ఈ నెల 9న సిఫార్సు చేస్తూ ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకు గవర్నర్ ఈ విషయంలో చర్య తీసుకోవడంలో జాప్యం చేస్తుండడం పలు అనుమానాలకు దారితీస్తుంది.

గత నవంబర్ లో తెల్లవారు జామున రాష్త్రపతి పాలన రద్దు కాగానే మెజారిటీ విషయం పరిగణలోకి తీసుకోకుండా ఉదయాన్నే దేవేంద్ర ఫడ్నవిస్ ను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం హడావుడిగా చేయించిన గవర్నర్ ఇప్పుడు ఈ విధంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తుంది.

గతంలో ఉత్తరాఖండ్ లో బీజేపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన గవర్నర్ బీజేపీ నేతల వత్తిడుల మేరకే ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. పైగా, గతంలో ఈ విధంగా నామినేషన్ కాబడిన ముఖ్యమంత్రులు, మంత్రుల జాబితాను అడ్వకేట్ జనరల్ ద్వారా రాజ్ భవన్ కు పంపారు.

ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయకుండా గవర్నర్‌ను ఆపుతోంది ఎవరు? అని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ సోమవారం సూటిగా ప్రశ్నించారు. కోషియారీ బీజేపీకి చెందిన వ్యక్తి అన్నది అందరికీ తెలిసిన విషయమే అని, కానీ రాజకీయాల్లో మునిగిపోయే సమయం మాత్రం ఇది కాదని రౌత్ చురకలంటించారు.

థాకరే ప్రముఖ రాజకీయ నాయకుడుగానే కాకుండా ప్రజాసేవలో పేరొందిన వారని, ప్రముఖ వన్యజీవుల ఫోటోగ్రాఫర్ అని, ఆయన నామినెట్ కావడానికి అన్ని హర్హలు గలవారని శివసేన నేతలు గుర్తు చేస్తున్నారు.