
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని పార్లమెంటు నుంచి వేటు వేసింది బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. తనపై వేటు వేసినప్పటికీ పోరాటంలో తగ్గేదే లేదంటున్నారు రాహుల్ గాంధీ. దేశం కోసం పోరాటం సాగిస్తున్న తాను.. ఎంతటి మూల్యానికైనా సిద్ధమేనని మరోసారి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ చేసిన తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉత్తేజితులను చేస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన రాహుల్ గాంధీ.. భారత్ కోసమే తన పోరాటమని, ఈ క్రమంలో ఎంతటి మూల్యం చెల్లించడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. పరువు నష్టం కేసులో దోషిగా తేలిన రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు. దీనిపై తొలిసారి స్పందించిన రాహుల్ గాంధీ.. ‘ భారత్ గళాన్ని వినిపించేందుకే తాను పోరాటం చేస్తున్నానని.. ఈ క్రమంలో ఎంత మూల్యం చెల్లించడానికి అయినా సిద్ధమేనని’ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.
దోషిగా నిర్ధారించిన సూరత్ కోర్టు..
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు విధిస్తున్నట్లు లోక్ సభ సెక్రటేరియట్ శుక్రవారం ప్రకటించింది. తీర్పు వెలువడిన మార్చి 23 నుంచి ఇది అమలులోకి వస్తుందని తెలిపింది. అంతకు ముందు అనర్హత వేటుకు సంబంధించి ఎటువంటి ప్రకటన లేకపోవడంతో శుక్రవారం ఉదయం రాహుల్ గాంధీ పార్లమెంటుకు హాజరయ్యారు. తొలుత పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశానికి హాజరైన ఆయన.. ఆ తరువాత లోక్ సభ ప్రారంభం కాగానే అందులోనూ పాల్గొన్నారు. ఆ తరువాతే పరిణామాలు జోరుగా మారాయి.
కీలక సమావేశాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ..
రాహుల్ గాంధీని ఎంపీగా అనర్హుడిగా ప్రకటించిన నేపథ్యంలో తదుపరి వ్యూహాన్ని రచించేందుకు కాంగ్రెస్ అధిష్టానం పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం భేటీ అయింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి.. పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, జనరల్ సెక్రటరీలు ప్రియాంక గాంధీ, కేసి వేణుగోపాల్, జై రామ్ రమేష్, రాజీవ్ శుక్ల, తారీఖ్ అన్వర్లతోపాటు సీనియర్ నేతలు పి చిదంబరం, ఆనంద్ శర్మ, అంబికా సోనీ, ముకుల్ వాష్నిక్, సల్మాన్ ఖుర్షీద్, పవన్ కుమార్ బన్సల్, కొందరు సీనియర్ నేతలు హాజరయ్యారు. అయితే ఈ భేటీకి రాహుల్ గాంధీ రాలేదని సమాచారం.
కేసు పూర్వపరాలు..
రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యుడుగా అనర్హత వేటు పడడానికి గల కారణాలపై సర్వత్ర చర్చ నడుస్తోంది. మోడీ ఇంటి పేరును కించపరిచేలా 2019లో కర్ణాటకలో జరిగిన ఓ సమావేశంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో పరువు నష్టం కేసు దాఖలు అయింది. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు ఈ కేసులో రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్ తన పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది.