
Rahul Gandhi : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్ సభ ఎంపీ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పడింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ కార్యాలయం కొద్దిసేపటి క్రిందట నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి పేరు వ్యవహారంలో గతంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో పరువు నష్టం దావా కేసు వేశారు. ఈ కేసులో రాహుల్ గాంధీని సూరత్ న్యాయస్థానం దోషిగా తేల్చిన నేపథ్యంలో లోక్ సభ సెక్రటేరియట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1) (ఈ), ప్రజా ప్రతినిధుల చట్టం 1951 లోని సెక్షన్ 8 ఆధారంగా రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేసినట్లు వివరించింది.
రెండేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు..
మోడీ ఇంటి పేరు వ్యవహారంలో సూరత్ న్యాయస్థానం రాహుల్ గాంధీకి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. జైలు శిక్ష ఎదుర్కొంటున్న పార్లమెంటు సభ్యుడు పై రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1) (ఈ), ప్రజా ప్రతినిధులు చట్టం 1951 లోని సెక్షన్ 8 కింద అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది. దీన్ని అనుసరించి లోక్ సభ సెక్రటేరియట్ చర్యను తీసుకుంది.
మండిపడుతున్న కాంగ్రెస్ శ్రేణులు..
రాహుల్ గాంధీ పై తీసుకొన్న చర్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. పక్షుల కోట్ల రూపాయలు మీద ఆర్థిక మోసాలకు పాల్పడిన గౌతం అదానీ గురించి ప్రశ్నించినందుకే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. అదానీ కుంభకోణాన్ని కాంగ్రెస్ పార్టీ బయట పెట్టిన తర్వాత పార్లమెంటుకు మొఖం చూపించే పరిస్థితి ప్రధాని మోడీకి గాని, బిజెపి నాయకులు గానీ లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. అందుకే ఇలా రాజకీయంగా కక్ష సాధింపు చర్యలను తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ అంశం దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసింది. రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్షాలన్నీ దీనిపై గొంతెత్తుతున్నాయి.
గొంతు కలిపిన కేసీఆర్..
రాహుల్ గాంధీ వ్యవహారంపై అన్ని పార్టీల నాయకులు బిజెపికి వ్యతిరేకంగా గొంతు ఎత్తుతున్నారు. ఈ విషయంలో తమ మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలను ఆయా పార్టీలు పక్కన పెడుతున్నాయి. ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ విస్మరించి ఏకం కావాల్సిన అవసరం ఏర్పడిందంటూ భారత్ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారంటే దాని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ తోపాటు ఆమ్ ఆద్మీ, సిపిఐ, సిపిఎం, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), జనతాదళ్ (సెక్యులర్), .. ఇలా ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా ఈ విషయంలో ఏకతాటిపైకి వచ్చి స్పందిస్తున్నాయి. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడాన్ని తప్పుపడుతున్నాయి. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణిస్తున్నాయి. గాంధీ పార్లమెంటు సభ్యత్వం పై అనర్హత వేటు వేయడం మోదీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్టగా పేర్కొంది బిఆర్ఎస్ పార్టీ. పార్టీల మధ్య ఉండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బిజెపి దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులు అందరూ ముక్తకంఠంతో ఖండించాలంటూ పార్టీ పిలుపునిచ్చింది. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం తనకు పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదని జెడిఎస్ నాయకుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యానించారు. దేశాన్ని నాశనం చేయాలనుకునే వారు బీజేపీ లోనే ఉంటారని, దేశాన్ని రక్షించాలనుకునే వారు బీజేపీని వేడాలంటూ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. అనర్హత వేటును ఉపసంహరించుకోవాలంటూ డీఎంకే అధినేత, నాడు ముఖ్యమంత్రి ఏం కే స్టాలిన్ డిమాండ్ చేశారు.
పెద్ద ఎత్తున నిరసనలు
బిజెపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని అనేక చోట్ల కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు తెలియజేసాయి. బిజెపి దురహంకారానికి, ప్రజాస్వామ్య పతనానికి ఈ చర్య నాందిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి.