
Keerthy Suresh: 2018లో విడుదలైన మహానటి బ్లాక్ బస్టర్ కొట్టింది. దర్శకుడు నాగ్ అశ్విన్ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. చెప్పాలంటే విడుదలకు ముందు ఈ సినిమా మీద చెప్పుకోదగ్గ అంచనాలు లేవు. సావిత్రి బయోపిక్ కావడంతో జనాలకు ఆసక్తి అయితే ఏర్పడింది. అదే సమయంలో ఆ గొప్ప నటి సావిత్రి పాత్రకు న్యాయం చేసే సినిమా అవుతుందా? బాగా తీయగలరా చేయగలరా? అనే సందేహాలు ఏర్పడ్డాయి. నాగ్ అశ్విన్ గురించి కూడా తెలిసింది తక్కువే. అప్పటికి ఆయన చేసింది ఒక్క చిత్రమే. నాని హీరోగా తెరకెక్కించిన ఎవడే సుబ్రమణ్యం ఓ మోస్తరు రిజల్ట్ అందుకుంది.
ఇక సావిత్రి పాత్ర చేసే హీరోయిన్ ఎవరనే చర్చ నడిచింది. ఆమె పాత్ర చేసి మెప్పించగల సత్తా ఉన్న నటి ఎవరని ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూశారు. కీర్తి సురేష్ చేస్తున్నారనగానే పెదవి విరిచారు. కీర్తి సురేష్ వంటి యంగ్ హీరోయిన్ కి ఇది ఛాలెంజ్. ఆమె అనుభవం, స్కిల్స్ చాలవు. సినిమాలో ఆమె పాత్ర తేలిపోతుందన్న ఊహాగానాలు వినిపించాయి. వాటిని పటాపంచలు చేస్తూ కీర్తి సురేష్ అద్భుతం చేసింది.
కొన్ని సన్నివేశాల్లో నిజంగా సావిత్రి వచ్చి నటించారా అన్నంత సహజంగా కీర్తి ఒదిగిపోయి చేశారు. అసలు కీర్తి వల్ల కాదన్న అభిప్రాయం నుండి… ఆమె తప్ప మరొకరు చేయలేరు అన్నంతగా నటించి మెప్పించారు. మహానటి విజయంలో కీర్తి సురేష్ కీలకమైంది. తెలుగు, తమిళ భాషల్లో మహానటి చిత్రం భారీ సక్సెస్ అందుకుంది. కీర్తి సురేష్ ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఏకంగా నేషనల్ అవార్డు వరించింది. కీర్తి సురేష్ దశ మార్చేసిన మూవీ అది.

అయితే సావిత్రి పాత్ర చేయడం వలన నేను ట్రోల్స్ కి గురయ్యానంటూ కీర్తి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సావిత్రమ్మకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో నన్ను ట్రోల్ చేశారు. నా వల్ల కాదని అవమానించారు. సవాళ్లు, విమర్శలు ఎదురైనా ఆ పాత్రలో నటించి మెప్పించానని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. ఆమె లేటెస్ట్ మూవీ దసరా విడుదలకు సిద్ధం కాగా.. ప్రెస్ మీట్లో పాల్గొన్న కీర్తి సురేష్ ఈ కామెంట్స్ చేశారు. నాని హీరోగా నటించిన దసరా మార్చి 30న విడుదల కానుంది.