Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణంరాజు ప్రతినబూనారు. కాస్కో జగన్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. కొద్ది రోజుల్లో పాతాళానికి తొక్కేస్తానంటూ హెచ్చరికలు పంపారు. అయితే రాజుగారు ఈ తరహా శపధం పూనడం ఇదే తొలిసారి. మొన్నటి వరకు సెటైరికల్ గా మాట్లాడిన ఆయన.. ఇప్పుడు జగన్ పై ఒంటికాలితో లేస్తున్నారు. నిన్నటి వరకు నేను ఆ మూడు పార్టీల్లో.. ఏదో ఒక పార్టీ నుంచి నరసాపురం ఎంపీగా పోటీ చేస్తానని అలవోకగా చెప్పుకొచ్చారు. కానీ తాను ఒకటి తలిస్తే.. బిజెపి ఒకటి తలచింది. నరసాపురం ఎంపీ స్థానాన్ని రఘురామకృష్ణం రాజుకు కాకుండా భూపతి రాజు శ్రీనివాస వర్మకు అప్పగించింది. అయితే తనకు బిజెపి ఎంపీ టికెట్ దక్కక పోవడానికి జగన్ ప్రధాన కారణం అని రఘురామ భావిస్తున్నారు. సోము వీర్రాజు ద్వారా అడ్డుకట్ట వేశారని ఆరోపిస్తున్నారు. తనకు పార్టీలతో సంబంధం లేదని.. పార్టీలు అన్యాయం చేసినా ప్రజలు ఉన్నారని.. అందుకే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఏపీలో ఆరు లోక్ సభ స్థానాల్లో బిజెపి తన అభ్యర్థులను ప్రకటించింది. కానీ నరసాపురం ఎంపీ స్థానాన్ని భూపతి రాజు శ్రీనివాస వర్మకు కేటాయించింది. దీంతో రఘురామకృష్ణంరాజు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తనకు టిక్కెట్ దక్కకపోవడంతో, దీని వెనుక జగన్ కుట్ర ఉందన్న రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రఘురామరాజు మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టిక్కెట్ దక్కక పోవడంతో చాలామంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తనకు టికెట్ రాకుండా జగన్ అడ్డుకుంటున్నారని ముందుగానే పిల్ల సజ్జల వెబ్సైట్లు, వీడియో ఛానల్ లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే గతంలో తనను చంపాలని చూశారని.. అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టించారని.. ఎన్నో రకాల ప్రయత్నాలు విఫలమయ్యాయని రఘురామరాజు స్పష్టం చేశారు. తనకు టిక్కెట్ రాకుండా జగన్ విజయం సాధించారని.. తన అపజయాన్ని అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాను మూడు అడుగులు వెనక్కి వేస్తున్నానని.. రానున్న రోజుల్లో ప్రజాబలం, ప్రజల అండతో, ప్రతి వ్యక్తితో ముందడుగు వేయించి జగన్ ను పాతాళానికి తొక్కి వేయకపోతే తన పేరు రఘురామకృష్ణం రాజు కాదని శపథం చేశారు. తనకు టికెట్ రాకుండా చేయడంలో సక్సెస్ అయ్యారని.. సోము వీర్రాజు ద్వారా జగన్ అనుకున్నది సాధించగలిగారని.. పార్టీలు అన్యాయం చేసినా.. ప్రజలు అన్యాయం చేయరు అనే విశ్వాసంతోనే ఉన్నట్టు తెలిపారు. మరో మూడు వారాల్లో ఎన్ని అడుగులు ముందుకు వేస్తావో చూసుకో జగన్.. కాస్కో జగన్ అంటూ రఘురామ హెచ్చరికలు పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.