AP Elections 2024: రాష్ట్రవ్యాప్తంగా జనసేన అభ్యర్థులు ఖరారయ్యారు. ఓ మూడు స్థానాలకు మినహాయించి అన్నిచోట్ల అభ్యర్థులను ఖరారు చేశారు పవన్ కళ్యాణ్. వారికి బీఫారాలు సైతం అందించారు. దీంతో జనసేన అభ్యర్థులు దాదాపు కొలిక్కి వచ్చినట్లు అయింది. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ స్థానాలను కేటాయించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కాకినాడ, మచిలీపట్నం సీట్లను జనసేనకు కేటాయించారు. కాకినాడ నుంచి టీ టైం వ్యవస్థాపకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్లను ప్రకటించారు. అసెంబ్లీ సీట్లకు సంబంధించి పాలకొండ, అవనిగడ్డ, విశాఖ దక్షిణంలో అభ్యర్థుల ప్రకటనను పెండింగ్ లో పెట్టారు.
పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్,నెల్లిమర్ల నుంచి లోకం మాధవి,అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, నిడదవోలు నుంచి కందుల దుర్గేష్, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, ఎలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్, పి.గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ, రాజోలు నుంచి దేవ వరప్రసాద్, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, ఉంగటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు, పోలవరం నుంచి చిర్రి బాలరాజు, తిరుపతి నుంచి ఆరని శ్రీనివాసులు, రైల్వే కోడూరు నుంచి డాక్టర్ యనమల భాస్కరరావు అభ్యర్థిత్వాలను పవన్ ఖరారు చేశారు.
పాలకొండ, అవనిగడ్డ, విశాఖ సౌత్ నుంచి అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇందులో పాలకొండ ఎస్టి రిజర్వుడు నియోజకవర్గం. గత నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించలేదు. గతంలో పాలకొండ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. 2009లో కొత్తూరు ఎస్టీ నియోజకవర్గం కనుమరుగయ్యింది. నియోజకవర్గాల పునర్విభజనలో పాలకొండ ఎస్సీ నుండి ఎస్టీలకు మారింది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి మినతి గోమాంగో గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి కళావతి విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఆమె వైసీపీ అభ్యర్థి. దీంతో సరైన అభ్యర్థి కోసం పవన్ అన్వేషిస్తున్నారు. విశాఖ దక్షిణం సీటును వంశీకృష్ణ శ్రీనివాస్ ఆశిస్తున్నారు. ఆయనతో పాటు చాలామంది ఆశావహులు ఉన్నారు. దీంతో సరైన అభ్యర్థిని ఎంపిక చేయాలని పవన్ చూస్తున్నారు. అవనిగడ్డలో సైతం గతంలో టిడిపి పెద్దగా పట్టు సాధించలేదు. దీంతో అక్కడ కూడా సరైన అభ్యర్థిని పోటీలో పెట్టి విజయం సాధించేలా పవన్ ప్లాన్ చేస్తున్నారు.