కడప బుగ్గవంక ప్రాజెక్టు విషయంలో నిర్వాసితుల ఇళ్లను జేసీబీతో దౌర్జన్యంగా కూలగొట్టడం ప్రారంబించిన వ్యవహారంలో ఇంజినీర్ రఘునాథ్ రెడ్డిని నిర్వాసితులు తరిమికొట్టిన వీడియో సంచలనం కలిగిస్తోంది. సీఎం సొంత జిల్లాలో జేసీబీ రూల్ ను అక్కడి ప్రజలు తిరగబడడం ఎవరూ ఊహించలేదు. ప్రభుత్వం కేసులు పెడుతూ బెదిరిస్తూనే ఉంది. అయినా ప్రజల్లో వ్యతిరేకత తగ్గడం లేదు. ఇంజనీర్ రఘునాథ్ రెడ్డిని తరిమికొట్టడం అంటే చిన్న విషయం కాదు. వారిలో సహనం నశించిందని అర్థం చేసుకోవాలి.
బుగ్గవంక ప్రాజెక్టు విషయంలో చాలా రో జుల నుంచి నిర్వాసితులకు అన్యాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బుగ్గవంక అప్రోజ్ రోడ్డులో ఏళ్ల తరబడి పేదలు నివాసం ఉంటున్నారు. నిజానికి అది వారి స్థలమేమి కాదు. కానీ నాయకుల అండతో అక్కడ ఇళ్లు కట్టుకున్నారు. వసతులు కల్పించుకున్నారు. అనూహ్యంగా ప్రస్తుతం బుగ్గవంక ప్రాజెక్టును సుందరీకరించే పనిలో భాగంగా వారిని ఖాళీ చేయమని బెదిరిస్తున్నారు.
నిర్వాసితులు ప్రభుత్వ స్థలంలోనే ఉంటున్నారు. దీంతో వారికి నష్టపరిహారం ఇవ్వడం వీలు కాదని చెబుతున్నారు. అందరూ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని నోటీసులు సైతం ఇచ్చారు. హఠాత్తుగా జేసీబీలతో కూల్చివేతకు వచ్చారు. దీంతో వారు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ముందు ఆందోళనలు కూడా చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రజలు సమస్య పరిష్కారం కోసం తిరగబడ్డారు.
ప్రభుత్వం ఇంజనీర్ పై దాడి చేసిన వారిపై కేసులు పెట్టినా భయపడేది లేదని తెలుస్తోంది. ఇది ఆరంభం మాత్రమేనని ప్రజలు భావిస్తున్నారు. అధికారంతో జేసీబీతో దూసుకెళ్తే తిరగబడకుండా ఎవరూ ఉండరని తెలుస్తోంది. భయం కూడా ఓ స్థాయి వరకే ఉంటుందని చెబుతున్నారు. ఈ ఘటనతో ప్రజల కో పం నిరూపితమైందని అంటున్నారు. ప్రభుత్వ వర్గాలకు ఇదో హెచ్చరికగా భావించవచ్చు.