Homeజాతీయ వార్తలుPresident Draupadi Murmu: కౌన్సిలర్ టూ ప్రెసిడెంట్ క్యాండిడేట్...ద్రౌపది ముర్ము ప్రస్థానంలో విశేషాలెన్నో..

President Draupadi Murmu: కౌన్సిలర్ టూ ప్రెసిడెంట్ క్యాండిడేట్…ద్రౌపది ముర్ము ప్రస్థానంలో విశేషాలెన్నో..

President Draupadi Murmu: ఆమె.. ఆర్ట్స్‌ పట్టభద్రురాలు! ఆపై సాగునీటి శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌..! కొంతకాలం స్వచ్ఛందంగా బోధనా రంగంలో.. అనంతరం రాజకీయాల్లోకి..! నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నిక.. అటునుంచి ఎమ్మెల్యే.. మంత్రి.. గవర్నర్‌..! ఇప్పుడు ఏకంగా అధికార కూటమి రాష్ట్రపతి అభ్యర్థి. 64 ఏళ్ల ద్రౌపది ముర్ము ఆసక్తికర ప్రస్థానం ఇది. అత్యంత పేద కుటుంబంలో పుట్టిన ఆమె 25 ఏళ్లలో.. రాజకీయాల్లో కిందిస్థాయి పదవి అయిన కౌన్సిలర్‌ నుంచి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి పోటీ పడే స్థాయికి ఎదిగారు. మయూర్‌భంజ్‌ జిల్లాలో జననంవెనుకబడిన ఒడిస్సా రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన మయూర్‌భంజ్‌ జిల్లా బైడపోసి గ్రామంలో 1958 జూన్‌ 20న గిరిజన కుటుంబంలో జన్మించారు ద్రౌపది ముర్ము. వీరిది గిరిజన వర్గంలోని సంథాల్‌ తెగ. పేదరికపు అడ్డంకులను అధిగమిస్తూ విద్యాభ్యాసం సాగించారు. భువనేశ్వర్‌లోని రమాదేవి మహిళా కళాశాలలో డిగ్రీ చదివారు. ఆర్ట్స్‌ విద్యార్థి అయిన ముర్ము.. సాగునీటి-విద్యుత్తు శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేశారు. రాయ్‌రంగాపూర్‌లోని శ్రీ అరబిందో సమీకృత విద్యా కేంద్రంలో స్వచ్ఛందంగా ఉపాధ్యాయురాలిగా పనిచేశారు.

Draupadi Murmu
Draupadi Murmu

1997లో కౌన్సిలర్‌..
మూడేళ్లకు మంత్రిరాజకీయ రంగప్రవేశం తర్వాత ద్రౌపది ముర్ము బీజేపీ తరఫున 1997లో రాయ్‌రంగ్‌పూర్‌ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో రాయ్‌రంగ్‌పూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిజూ జనతాదళ్‌ (బీజేడీ), బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో 2000-2004 మధ్య వాణిజ్య, రవాణా, మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఒడిస్సాలో ఉత్తమ పనితీరు కనబరిచే ఎమ్మెల్యేలకు అందించే నీలకంఠ అవార్డును 2007లో అందుకున్నారు. 2004లో రెండోసారి ఎన్నికయ్యారు. పార్టీపరంగా బీజేపీ ఒడిస్సా ఎస్టీ మోర్చా ఉపాఽధ్యక్షురాలు, అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 2010, 2013లో రెండుసార్లు మయూర్‌భంజ్‌ పశ్చిమ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2013లో ముర్మును బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా నియమించారు. మయూర్‌భంజ్‌ పశ్చిమ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నప్పుడే.. 2015 మే 18న జార్ఖండ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2021 జూన్‌ 12 వరకు ఆ పదవిలో కొనసాగారు. జార్ఖండ్‌ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా ద్రౌపది ముర్ము చరిత్రకెక్కారు.

Draupadi Murmu
Draupadi Murmu

గెలిస్తే ఎన్నో ఘనతలు..
స్వాతంత్య్రం తర్వాత పుట్టిన తొలి అధ్యక్షురాలుద్రౌపది ముర్ము.. రాష్ట్రపతిగా ఎన్నికైతే పలు ఘనతలు ఆమె ఖాతాలో చేరనున్నాయి. తొలి గిరిజన, తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగానే కాక.. స్వాతంత్య్రం తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతి ఈమెనే కానున్నారు. ఇప్పటివరకు భారత రాష్ట్రపతిగా ఎన్నికైన వారంతా 1947కు ముందు జన్మించినవారే. రాజకీయ జీవితం ఉజ్జ్వలంగానే సాగినా.. వ్యక్తిగత జీవితం మాత్రం విషాదభరితం. ముర్ము భర్త శ్యాంచరణ్‌ ముర్ము. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అయితే, భర్త, ఇద్దరు కుమారులు గతంలోనే చనిపోయారు. కుమార్తె ఇతిశ్రీ. కూతురుకు వివాహమైంది. కాగా, జూన్‌ 20 ద్రౌపది ముర్ము జన్మదినం. 64వ జన్మదినోత్సవం మరుసటి రోజే.. ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ బీజేపీ అధిష్ఠానం తీపి కబురు చెప్పింది.

Draupadi Murmu
Draupadi Murmu

సేమ్ సీన్…
సేమ్ సీన్ బీజేపీ రిపీట్ చేసింది. గత రాష్ట్రపతి ఎన్నికలు గుర్తున్నాయి కదూ.. అప్పట్లో ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ ఉండి… బయట నుంచి చాలా రాజకీయ పక్షాలు మద్దతిచ్చాయి. కానీ అభ్యర్థి ఎవరనేది చివరి నిమిషం వరకూ పెద్దన్న బీజేపీ ప్రకటించలేదు. కొద్దిరోజులు నాన్చి.. ఎన్నికలు సమీప దూరానికి వచ్చేసరికి రామ్ నాథ్ కోవింద్ ను అనూహ్యంగా తెరపైకి తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కేవలం కమలనాథులకు సుపరిచితమైన కోవింద్ పేరు దక్షిణాది రాష్ట్రాల వారికి మాత్రం అప్పటివరకూ తెలియదు. బిహార్ గవర్నర్ గా ఉన్న కోవింద్ ను ఏకంగా రాష్ట్రపతి పీఠం పై కూర్చోబెట్టే వరకూ బీజేపీ పెద్దలు చాలా గోప్యత పాటించారు. తాజా రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిపై భార‌తీయ జ‌న‌తా పార్టీ బోలెడంత స‌స్పెన్స్ ను మెయింటెయిన్ చేస్తూ వచ్చింది. రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. చివరకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఖరారై పోయారని ప్రచారం సాగింది. ఈ స‌స్పెన్స్ను తెరదించుతూ బీజేపీ అధిష్టానం ద్రౌపది ముర్ము పేరును అనూహ్యంగా ప్రకటించింది. దేశ వ్యాప్త చర్చకు దారితీసింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version