
వచ్చే ఏడాది మార్చిలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మరి, ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది అన్నప్పుడు ఎవరి లెక్కలు వారు వేస్తున్నారు. కాంగ్రెస్ అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. ఎలాగైనా కూలదోయాలని విపక్షాలు కృషి చేస్తున్నాయి. అయితే.. ఈ సారి కూడా పొత్తులు ఎక్కువగా ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది.
2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని విజయం సాధించింది. 117 స్థానాలున్న పంజాబ్ లో కెప్టెన్ అమరిందర్ సింగ్ నేతృత్వంలోని హస్తం పార్టీ.. 77 స్థానాల్లో సత్తా చాటింది. అదేవిధంగా. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అనూహ్యంగా 20 సీట్లు దక్కించుకుంది. అంతేకాదు.. ప్రధాన ప్రతిపక్షం హోదాను కూడా సాధించింది. జంటగా బరిలోకి దిగిన అకాలీదళ్ – బీజేపీ కూటమి ఘోరంగా ఓడిపోయింది. అకాలీదళ్ 15 స్థానాలు గెలుచుకోగా.. కమలం కేవలం మూడు సీట్లతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. మొత్తం 13 సీట్లలో ఎనిమిది స్థానాల్లో జెండా ఎగరేసింది. అకాలీదళ్ రెండు, బీజేపీ రెండు, ఆప్ ఒక స్థానంలో గెలిచాయి.
వచ్చే ఏడాది జరగబోతున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని చూస్తున్న పార్టీలు.. ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ సారి కీలకమైన పరిణామం ఏమంటే.. బీజేపీ – అకాలీదళ్ విడిగా పోటీ చేయడం. ఇది దాదాపు ఖాయమైనట్టే. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న అకాలీదళ్.. కమలంతో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది.
దీంతో.. పాత స్నేహితుడు బీఎస్పీ వైపు అకాలీదళ్ చూస్తోంది. 1996లో ఈ రెండు పార్టీలో కలిసి పోటీచేసి ఘన విజయం సాధించాయి. ఆ తర్వాత కాలంలో అకాలీదళ్ బీజేపీతో చెలిమి చేయడంతో.. బీఎస్పీ దూరమైంది. పంజాబ్ లో దాదాపు 30 శాతం మేర దళితులు ఉన్నారు. ఈ సారి ఈ రెండు పార్టీలూ పోటీచేయడం ద్వారా మరోసారి విజయం సాధించాలని చూస్తున్నాయి.
వ్యవసాయ చట్టాలపై అత్యధిక వ్యతిరేకత వచ్చింది పంజాబ్ నుంచే. కాబట్టి.. బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మరి, ఎవరితోనైనా దోస్తీ కడితే పరిస్థితిలో మార్పు రావొచ్చేమో? అటు కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకోవడం కూడా సవాలేనని అంటున్నారు. సొంత పార్టీలోనే వైరి వర్గాలు ఏర్పడ్డాయి. సిద్దూతో అమరిందర్ కు పొసగడం లేదు. ఇది ఎన్నికల నాటికి ఏవైపు మళ్లుతుందో చెప్పలేని పరిస్థితి. మొత్తానికి పంజాబ్ ఎన్నికలకు ఈ సారి మరింత రసవత్తరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.