PM Narendra Modi: పాకిస్తాన్.. మన దాయాది దేశమే అయినా.. మనకు పక్కలో బెల్లెంలా మారింది. స్వాతంత్య్రానికి పూర్వం అందరం కలిసే ఉన్నాము. 200 ఏళ్ల బ్రిటిష్ పాలనపై ఐక్యంగా పోరాడాము. స్వాతంత్య్ర సంగ్రామం నడిపించాం. శాంతి మార్గంలో స్వాతంత్య్రం తెచ్చుకున్నాం. అయితే స్వాతంత్య్రం అనంతరం ముస్లింలు ప్రత్యేక దేశంగా ఉండాలని భావించారు. ఈ క్రమంలోనే అప్పటి పెద్దలు పాకిస్తాన్ ఏర్పాటుకు అంగీకరించారు. ఇలా దేశంగా ఏర్పడిన పాకిస్తాన్ భారత్‌ను దెబ్బతీయాలని చూస్తోంది. అశాంతి, ఉగ్రదాడులు, అల్లర్లకు నిత్యం ప్రయత్నిస్తుంది. పాకిస్తాన్‌లో కలిసి పనిచేయడానికి అనేక మంది చర్చలు జరిపారు. ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) కూడా తొలిసారి ప్రధాని అయ్యాక పాకిస్తాన్ వెళ్లి అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలిసి వచ్చారు. శాంతి కోసం అనేక ప్రయత్నాలు చేశారు. ఈ విషయాలను మార్చి 16న లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో జరిగిన పాడ్‌కాస్ట్ సందర్భంగా వెల్లడించారు. భారతదేశం పాకిస్తాన్‌తో శాంతియుత సంబంధాల కోసం అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ, ప్రతిసారీ శత్రుత్వం మరియు నమ్మకద్రోహం మాత్రమే ఎదురైందని విచారం వ్యక్తం చేశారు. 2014లో తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాకిస్తాన్ అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించిన సంఘటనను ఆయన గుర్తు చేశారు. ఈ ఆహ్వానం ద్వారా రెండు దేశాల మధ్య కొత్త శకం ప్రారంభమవుతుందని ఆశించినప్పటికీ, అటువంటి శాంతి ప్రయత్నాలకు పాకిస్తాన్ నుంచి∙సానుకూల స్పందన రాలేదని తెలిపారు.
Also Read: ఒక్క మార్కు తక్కువొచ్చిందని ఇంత శిక్షా? కేంద్రమంత్రినే కదిలించిన బీహర్ విద్యార్థిని
శాంతి కోసమే ప్రయత్నం..
మోడీ మాట్లాడుతూ, ‘మేము శాంతి కోసం చేసిన ప్రతి గొప్ప ప్రయత్నం శత్రుత్వం మరియు విశ్వాసఘాతంతోనే ఎదురైంది. పాకిస్తాన్ నాయకత్వంలో విజ్ఞత ప్రవేశించి, శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని మేము హదయపూర్వకంగా ఆశిస్తున్నాము‘ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు భారతదేశం శాంతికి కట్టుబడి ఉన్నప్పటికీ, పాకిస్తాన్ నుండి ఆశించిన సహకారం లభించడం లేదన్న ఆయన దీర్ఘకాల వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి.
గతంలో కూడా మోడీ పలు సందర్భాల్లో పాకిస్తాన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని, కానీ దానికి తీవ్రవాదం లేని వాతావరణం అవసరమని స్పష్టం చేశారు. ఈ తాజా వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచాలంటే పాకిస్తాన్ తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో చిత్తశుద్ధి చూపాలని భారతదేశం ఆశిస్తున్న విషయాన్ని మరోసారి ఉద్ఘాటించాయి.
శాంతిని కోరుకుంటున్న పాకిస్తానీలు..
భారత్ శాంతి మార్గంలోనే కొనసాగుతుందని మోదీ స్పష్టం చేశారు.
పాకిస్తాన్‌లోని ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని, ఉగ్రవాద దాడులతో విసిగిపోయారని అన్నారు. కానీ ఆ దేశ నాయకత్వం మాత్రం శత్రుత్వ వైఖరిని వీడడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాకిస్తాన్‌తో శాంతి చర్చలకు ప్రాధాన్యమిచ్చానని, అందుకే సార్క్ దేశాధినేతలను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ నిర్ణయం అప్పట్లో చాలా మందిని ఆశ్చర్యపరిచిందని, అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన జ్ఞాపకాల్లో ఈ విషయాన్ని ప్రశంసనీయంగా పేర్కొన్నారని గుర్తు చేశారు. దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్‌తో దౌత్యపరమైన చర్యలకు భారత్ ప్రయత్నించిందని మోదీ అన్నారు. విదేశాంగ విధానంలో తన విధానాన్ని కొందరు ప్రశ్నించినప్పటికీ, శాంతి కోసం చేసిన ప్రయత్నాలు చరిత్రలో నిలిచిపోతాయని ఆయన చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వదిలిపెట్టి, శాంతి దిశగా అడుగులు వేయాలని భారత్ ఇప్పటికీ ఆశిస్తోందని ఆయన పునరుద్ఘాటించారు.
Also Read: అన్వేష్ vs సన్నీ యాదవ్..సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ అయినంతమాత్రాన కొమ్ములుంటాయా?