
Pawan Kalyan – Chandrababu: ఏపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో జంపింగ్ జపాంగ్ లు ఊపందుకుంటున్నాయి. తాజాగా జనసేనలో చేరికల సంఖ్య పెరుగుతోంది. అయితే అవి టీడీపీ నుంచి కావడం గమనార్హం. టీడీపీ నుంచి గెలిచిన మాజీలు కొందరు జనసేనలో చేరేందుకు డిసైడ్ అయ్యారు. అదే సమయంలో వివిధ పార్టీల నుంచి జనసేనలో చేరుతారనుకున్నా నాయకులు అనూహ్యంగా సైకిలెక్కుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి నడుస్తాయన్న ప్రచారం ఉంది. బీజేపీని కలుపుకుపోయి జగన్ ను ఓడించాలని అటు పవన్, ఇటు చంద్రబాబు భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు జనసేన పదో ఆవిర్భావ సభలో చేరికలు చూస్తుంటే పొత్తులపై నీలినీడలు కమ్ముకంటున్నాయి.

ఈ నెల 14న జనసేన పదో ఆవిర్భావ సభ మచిలీపట్నంలో జరగనుంది. ఇప్పటికే పవన్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో బిజీబిజీగా గడుపుతున్నారు. బీసీలతో సమావేశమయ్యారు. ఇప్పుడు కాపు నేతలతో సమావేశం కానున్నారు. ప్లీనరీలో బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. అయితే టీడీపీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరనున్నారు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు పార్టీ మారేందుకు డిసైడ్ అయ్యారు. ఈయన 1994లో ఎమ్మెల్యేగా పనిచేశారు. అటు తరువాత టిక్కెట్ దక్కలేదు. 2014లో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. గత ఎన్నికల తరువాత బీజేపీలోకి వెళ్లారు. కానీ అక్కడ ఇమడలేక.. ఇప్పుడు జనసేనలో చేరేందుకు నిర్ణయించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు సైతం జనసేనలో చేరనున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014,2019 ఎన్నికల్లో పోటీచేసేందుకు చాన్స్ దక్కలేదు. వైసీపీలో చేరినా యాక్టివ్ గా లేరు. ఇప్పుడు జనసేనలో చేరడానికి సిద్డపడ్డారు.
Also Read: Pawan Kalyan: తాను ఓడిపోవడానికి అసలు కారణం అదే.. ఎట్టకేలకు బయటపెట్టిన పవన్ కళ్యాణ్
అయితే ఈ పరిణామాలు మాత్రం పలు అనుమానాలకు తావిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్లేందుకు మానసికంగా సిద్ధపడ్డాయన్న టాక్ నడిచింది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని మాత్రమే జనసేన పిలుపునచ్చింది. కానీ ఏ పార్టీకి ఓటు వేయాలన్న విషయంలో స్పష్టతనివ్వలేదు. అటు టీడీపీ, ఇటు బీజేపీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్నాయి. బీజేపీ మాత్రం పవన్ ఫొటోను వాడుకుంటుంది. తమ క్యాండిడేట్ ను ఉమ్మడి అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటోంది. టీడీపీ మాత్రం రెండో ప్రాధాన్యత ఓటు విషయంలో లెఫ్ట్ పార్టీలతో సయోధ్య పెట్టుకుంది. ఎక్కడా జనసేన ప్రస్తావన తేవడం లేదు.
బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తొలుత జనసేనలో చేరతారని అంతా భావించారు. కానీ ఆయన టీడీపీలో చేరారు. మరికొందరు బీజేపీ నేతలు టీడీపీకి టచ్ లో ఉన్నారన్న ప్రచారం ఉంది. అటు జనసేన సైతం ఒంటరిగానే ఎన్నికల హామీ ఇస్తోంది. బీసీ డిక్లరేషన్ ప్రకటించడానికి సిద్ధమవుతున్న పవన్ తాము అధికారంలోకి వస్తే టీటీడీ ట్రస్ట్ బోర్డులో బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. అయితే వీటన్నింటిపై ఈ నెల 14న జరిగే ఆవిర్భావ సభలో పవన్ స్పష్టతనిస్తారని సమాచారం.
Also Read: Shock to YCP: ఉత్తరాంధ్ర.. రాయలసీమ లో వైసిపికి షాక్ తాజాగా శ్రీ ఆత్మ సాక్షి సర్వే లో వెల్లడి