
YS Jagan: ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. కొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఇందుకు వేదిక కానున్నాయి.ఈ నెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 17న అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సర్క్యులర్ జారీచేసింది. ఈ నెల 27 వరకూ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే విశాఖ రాజధాని విషయంలో జగన్ సమావేశాల్లో కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం రాజధానులపై సుప్రీం కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. ఈ నెల 28కి కేసు విచారణ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ చేసే ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులపై మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహణలో భాగంగా మూడు రాజధానులనేది ఉత్తమాటేనని.. విశాఖే తమ ఏకైక రాజధాని అని.. పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరడంతో పెద్ద దుమారమే రేగింది. అటు సీఎం జగన్ సైతం తాను విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్టు స్పష్టం చేశారు. కానీ ఎప్పుడు అన్నది మాత్రం వెల్లడించలేదు. అటు సుప్రీంకోర్టులో కేసు విచారణలో జాప్యం జరుగుతుండడం, ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎలాగైన విశాఖ నుంచే పాలనను ప్రారంభించాలని జగన్ డిసైడ్ అయ్యారు.
ఈ నెల 28, 29 తేదీల్లో విశాఖలో జీ 20 సన్నాహక సదస్సు జరగనుంది. ఆ తరువాత విశాఖలోనే ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయం ప్రారంభించి..అక్కడ నుంచే పాలన కొనసాగించేలా నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 14 డా బీఆర్ అంబేద్కర్ జన్మదినం నాడు విజయవాడలో 125 అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అదే రోజు విశాఖ నుంచి సీఎం జగన్ క్యాంపు కార్యాలయం ప్రారంభించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం.సుప్రీంకోర్టులో కేసు విషయంలోనూ ఈ నెల 28న విచారణ వేళ కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఒక వేళ విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభమైతే అమరావతిలో శని, ఆదివారాల్లో జగన్ ఉండనున్నారు. నాలుగు రోజులు విశాఖలో గడపనున్నారు. ఒక రోజు పల్లె నిద్ర చేయనున్నారు. తాము ఆశిస్తున్నట్టు సుప్రీం కోర్టులో అనుకూలమైన తీర్పు వస్తే మాత్రం జూన్ నుంచి పూర్తిస్థాయిలో విశాఖ నుంచి పాలన ప్రారంభించే చాన్స్ ఉంది. విద్యాసంవత్సరం ప్రారంభం, ఉద్యోగుల తరలింపు, విశాఖలో భవనాల అన్వేషణకు కావాల్సినంత సమయం ఉండడంతో.. ఈలోగా సీఎం క్యాంపు ఆఫీసు ప్రారంభానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కార్యాలయం ప్రారంభం ఎప్పుడన్నది క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.