
Pawan Kalyan: అంతులేని జనాదరణ.. బయటకు వస్తే వేలాది మంది జనం. ఇది జనసేనాని పవన్ ఇమేజ్. కానీ ఎన్నికల్లో ఓటమి. రెండు నియోజకవర్గాల్లో పోటీచేసినా నిరాదరణ. వీటన్నింటినీ గుణపాఠాలుగా నేర్చుకొని 2024 ఎన్నికలకు పవన్ సిద్ధపడుతున్నారు. పార్టీ పదో ఆవిర్భావ సభలో అన్ని అంశాలపై స్పష్టతనివ్వనున్నారు. ఈ నెల 14న మచిలీపట్నంలో ఆవిర్భావ సభ జరగనుంది. అందులో భాగంగా సన్నాహాకంగా పార్టీ కార్యాలయంలో బీసీలతో పవన్ సమావేశమయ్యారు. తాను ఓడిపోవడానికి గల కారణాలను వివరించారు. బీసీల విషయంలో జరుగుతున్న దగాపై కూడా కామెంట్స్ చేశారు. కాగా మచిలీపట్నంలోని 36 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. దీనికి పొట్టి శ్రీరాములు ప్రాంగణంగా పేరు పెట్టారు. దీనికి సంబంధించి పోస్టర్ ను సైతం ఆవిష్కరించారు.

తాను ఏదో ఒక కులానికి చెందిన నాయకుడిని పవన్ స్పష్టం చేశారు. తమపై కాపుల పార్టీగా ముద్ర వేస్తున్నారని.. అటువంటప్పుడు కాపులు బలంగా ఉన్న ప్రాంతాల్లో తాము ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. గోదావరి జిల్లాల్లో కాపులు, శెట్టిబలిజల మధ్య ఐక్యతకు కృష్టిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో బీసీలే తనకు అండగా నిలిచారని చెప్పారు. అందుకే బీసీల్లో ఐక్యత, రాజ్యాధికారం కోసం చివరి వరకూ పోరాడుతానని పవన్ స్పష్టం చేశారు.
అయితే ప్రధానంగా ఈ సభలో వైసీపీని టార్గెట్ చేసే అవకాశముంది. వైసీపీ విముక్త ఏపీకి కృషిచేస్తానని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు సర్వశక్తులూ ఒడ్డనున్నారు. అందులో భాగంగా తన నిర్ణయాలను సభా వేదికగా ప్రకటించనున్నారు. దీనికి అనుసరించాల్సిన వ్యూహాలను కూడా శ్రేణులకు వివరించనున్నారు. పొత్తు, ఇతరత్రా విషయాల్లో స్పష్టతనివ్వనున్నారు. గతంలో జరిగిన తప్పిదాలపై సైతం ప్రస్తావించి సరిదిద్దుకోవాల్సిన అంశాలను ప్రస్తావించనున్నారు.
సన్నాహాక సమావేశంలో బీసీలనుద్దేశించి పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదని.. బ్యాక్ బోన్ క్యాస్ట్ గా అభివర్ణించారు. రెండు కోట్ల మంది బీసీల్లో మూడున్నర లక్షల మంది బీసీలకు రూ.10 వేలు చొప్పున కొనేస్తున్నారని చెప్పారు. బీసీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని ఆకాంక్షించారు. బీసీలకు రాజ్యాధికారం కోసం తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బీసీలకు పెద్దపీట వేస్తామని.. వెనుకబడిన తరగతుల్లో అనైక్యత ఉందని.. అదే రాజకీయ పక్షాలకు బలంగా మారిందన్నారు. బీసీల సాధికారిత అమలుచేసి చూపిస్తామని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సేవలందించేందుకు బీసీలు పనికిరారా అని పవన్ ప్రశ్నించారు. 36 మంది సభ్యుల్లో ముగ్గురు బీసీలు మాత్రమే ఉండడం సాధికారితా అని నిలదీశారు. తాము అధికారంలోకి వస్తే టీటీడీని సమూల ప్రక్షాళన చేస్తామని చెప్పారు.