Pawan Kalyan Visit Visakhapatnam: జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. ప్రజా సమస్యలే ఎజెండాగా ముందుకెళ్లాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి గాను అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేపట్టే యాత్రను నాయకులు పర్యవేక్షిస్తున్నారు. పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు విశాఖపట్నం చేరుకుని పవన్ కల్యాణ్ పర్యటన కార్యక్రమాలను చూస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో విశాఖ నుంచి పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఇందుకు గాను పార్టీ శ్రేణులు, కార్యకర్తలను సమీకరించే పనిని నాగబాబు తీసుకున్నారు. తమ్ముడి పర్యటనను దగ్గరుండి సమీక్షిస్తున్నారు. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ చేపట్టే పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

మూడు రోజుల పర్యటనకు గాను పవన్ కల్యాణ్ విశాఖపట్నం నుంచి బయలుదేరి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. పార్టీ నేతలు, మహిళలు అధిక సంఖ్యలో సమీకరించేందుకు ఏర్పాట్లు చురుకుగా చేస్తున్నారు. వైసీపీ, టీడీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకుని అధికారం చేపట్టాలని జనసేన భావిస్తోంది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర పర్యటనను విజయవంతం చేసి నేతల్లో ఆత్మవిశ్వాసం పెంచాలని చూస్తోంది. జనసేన పార్టీ జనంలో కలిసి ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకు ఆరాటపడుతోంది. ఇందుకు గాను పవన్ కల్యాణ్ పటిష్ట ప్రణాళిక తయారు చేస్తున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి అధికారం చేపట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు.
విశాఖపట్నం నుంచే ప్రచారం సాగించాలని నిర్ణయించుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని జనసేన ప్రజల్లోకి వెళ్తోంది. రాష్ట్రంలో అధికారం కోసం అహర్నిశలు శ్రమిస్తోంది. జనసేన పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని అధినేత భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ నేతలు సొంత ఖర్చులతో రోడ్లు మరమ్మతులు చేపట్టి వైసీపీ తీరును నిరసించారు.

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో వైసీపీని కట్టడి చేసి అధికారం చేజిక్కించుకోవాలని పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకుని లబ్ధిపొందాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రజా సమస్యలే ఎజెండాగా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. మెగా కుటుంబం కూడా పవన్ కల్యాణ్ కు అండగా నిలుస్తోంది. నాగబాబు ఇప్పటికే చురుకుగా వ్యవహరిస్తుండగా పెద్దన్న చిరంజీవి కూడా ఎన్నికల సమయంలో జనసేన కోసం ప్రచారం చేస్తారని చెబుతున్నారు. దీంతో జనసేన పార్టీ రాష్ట్రంలో ప్రభావం చూపుతుందని ప్రజల్లో ఒక భావన వస్తోంది. అభివృద్ధి కార్యక్రమాల ఊసే లేకుండా వైసీపీ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టి తమకు అనుకూలంగా మలుచుకోవాలని జనసేన ఆలోచనలు చేస్తోంది. దీనికి గాను పటిష్ట ప్రణాళికతో వెళ్లాలని యోచిస్తోంది.
వైజాగ్ ఎయిర్ పోర్టు నుంచి పవన్ కల్యాణ్ నాడ్ ఫ్లై ఓవర్, తాటిచెట్లపాలెం, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, సిరిపురం సర్కిల్, పార్క్ హోటల్, ఎన్టీఆర్ విగ్రహం, నొవోటెల్ హోటల్ ప్రాంతాలను సందర్శిస్తూ పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగనుంది. ఇక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని నేతలకు సూచిస్తున్నారు. ఈ మేరకు నాగబాబు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలను ఎక్కువగా తీసుకొచ్చేలా నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు.