Kantara Movie: ఏ ముహూర్తాన ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ తెరకెక్కించాడో గాని కన్నడ సినీ స్వరూపమే మారిపోయింది. మిగతా ఉడ్ లకు సవాల్ విసిరే సినిమాలు ఆ ప్రాంతం నుంచి వస్తున్నాయి. మొన్నటిదాకా కేజిఎఫ్ 2, విక్రాంత్ రోణా గురించి మాట్లాడుకున్న సినీ ప్రేమికులు ఇప్పుడు రిషబ్ శెట్టి కాంతారా గురించి చర్చించుకుంటున్నారు. ఇంతకీ కాంతారాలో ఏముంది? అది తెలుగు సినిమా హీరోలకు ఏం చెబుతోంది? ఒక చిన్నపాటి సినిమాగా విడుదలైన ఆ చిత్రం ఇప్పుడు ఎందుకు ఐఎండిబి ర్యాంకుల్లో కేజిఎఫ్, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలను తలదన్ని కాలర్ ఎగరేసి నిలబడుతోంది?

ప్రేక్షకుల మెప్పు పొందాలి
ఏ సినిమా గురించి ఎవరేం రాస్తున్నా, ఎంత స్థాయిలో భుజాలు చరుచుకుంటున్నా సరే.. హీరాది హీరోలు, స్టారాధిస్టారులు, పాన్ ఇండియా సూపర్ హీరోలు.. విభ్రాంతిగా.. మరీముఖ్యంగా వర్తమానంలో కళ్ళు అప్పగించి చూస్తున్న సినిమా కాంతారా. ప్రత్యేకించి ఈ సినిమాను కన్నడ కస్తూరి తన ఫ్రైడ్ అని గర్వంగా చెప్పుకుంటున్నది. మరీ మరీ ప్రత్యేకించి మంగళూరులోని తులు ప్రాంతం ప్రేమతో కన్నీళ్లు పెట్టుకుంటున్నది. కే జి ఎఫ్ తర్వాత ఆ స్థాయిలో కర్ణాటక ప్రాంతంలో థియేటర్ల వద్ద ప్రేక్షకుల జాతర కొనసాగుతోంది. అఫ్కోర్స్ ఇప్పుడు కాంతారా తెలుగులో, మలయాళం లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసి మంచి పని చేశారు. లేకుంటే ఈ కథకు ఎన్ని వక్ర భాష్యాలు చెప్పేవారో! హీరోయిక్ లిబర్టీ పేరుతో మరింత భ్రష్టు పట్టించేవారో? మొన్న విడుదలైన మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మిగతా భాషల్లో అడ్డంగా ఫెయిల్ అయినా సరే.. తమిళంలో మాత్రం ఇండస్ట్రీ హిట్ గా దూసుకుపోతోంది. ఇప్పటిదాకా అధిక వసూలు రాబట్టిన విక్రమ్ సినిమాను దాటే ప్రయత్నంలో ఉంది. ఎందుకంటే ఆ సినిమా తమిళ హృదయాలను గెలుచుకుంది. మరి అదే తెలుగు సినిమా విషయానికొస్తే.
ఇదీ మా సినిమా తెలుగు జనం ప్రైడ్ గా ఫీల్ అయింది ఒకటైనా ఉందా? ఒక ప్రాంతం లేదా ఒక సమాజం లేదా ఒక సమూహం ఆర్తిగా గుండెకు హత్తుకున్న సినిమా ఏదైనా ఉందా? ఎంతసేపు ఆ అరువు కథలు, 60 ఏళ్లు దాటినా అక్కరకు రాని బిల్డప్పులు, ప్రేక్షకులు కాండ్రించి ముఖం మీద ఉమ్ముతున్నా సరే.. అవే చెత్త కథలు.. తెలుగు సమాజం ఇంతగా ఇచ్చింది కదా.. కోటాను కోటీశ్వరులను చేసింది కదా.. మీ కలాల నుంచి, బుర్రల నుంచి, మీ ఎర్ర తోలు అని చెప్పుకునే చర్మ సౌందర్యం నుంచి.. గొప్పగా చెప్పుకునే రివర్స్ కాంట్రిబ్యూషన్ ఈ సొసైటీకి ఒకటైనా దక్కిందా? కాంతారా లో ఉన్న రంది, యావ, ప్రాంతానికి చెందిన ఆట, మనుషుల్ని కట్టిపడేసే సంస్కృతి, అక్కడి అలవాట్లు, బతుకు వెతలు, సంబరంగా జరుపుకునే పండుగలు.. ఒక్కటైనా ఒక ఎమోషనల్ కథలో ఇమిడ్చే ప్రయత్నం జరిగిందా? ఈ ప్రశ్నలకు ఒకటే సమాధానం లేదు. సినీ పెద్దల నుంచి దీనికి సమాధానం రాదు.
ఎందుకు ఈ అక్కరకు రాని బిల్డప్ లు
ఏ మలయాళం నుంచో, తమిళం నుంచో, కన్నడ నుంచో, హిందీ నుంచో కథలను ఎత్తుకొచ్చి దానికి మరింత మాస్ మసాలా యాడ్ చేసుకుని, భుజ కీర్తులు తగిలించుకొని ఒరిజినల్ సినిమా వాడు చూస్తే అక్కడే గుండె ఆగి చచ్చేలా మార్పులు చేసి.. నానా కంగాలి చేసేయడం తప్ప అచ్చమైన మన కథ కోసం ప్రయత్నించింది ఎక్కడ? ఏం తెలుగులో కథలు రాసేవారు లేరా? ఇండస్ట్రీ ఏమైనా దివాలా తీసిందా? రచయితలు ఏమైనా బావ దారిద్రంతో కొట్టుమిట్టాడుతున్నారా? గొప్ప గొప్ప కథలు రాస్తున్నాడు. దేశం మెచ్చే కథలు రాస్తున్నాడు. కథలు కూడా చందమామ తరహాలో చెప్తున్నాడని కదా మొన్న ఒక ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చింది. ఇలా ఎంత చెప్పుకున్నా మన తెలుగు సినిమా హీరోస్వామ్యం మీద నడుస్తుంది. హీరో చెప్పినట్టే సినిమా సాగుతుంది. అక్కడిదాకా ఎందుకు కొసాఖరికి హీరో చెప్పిన వాళ్లకే క్యాటరింగ్ దక్కుతుంది. వాళ్లు పెట్టిన భోజనమే యూనిట్ సభ్యుల నోట్లోకి వెళుతుంది. మిగతావాళ్లు ఉన్నారు అంటే ఉన్నారు. కర్మగాలి ఆ సినిమా ఫెయిల్ అయితే ఆ నెపం మొత్తం దర్శకుడు మీదే వేస్తారు. అంతే అంతకుమించి ఏమీ ఉండదు. ఎంతమంది ప్రతిభావంతమైన దర్శకులు గొప్ప గొప్ప హీరోల చేతిలో నలిగిపోయారో చెబితే చాంతాడంత అవుతుంది. వాస్తవానికి ఒక నటుడికి కసి ఉండాలి. ఒక మంచి పాత్ర కోసం తీవ్రంగా తపించాలి. వందల కోట్ల పారితోషికం తీసుకుంటున్న హీరోలు షర్టు నలగకుండా, క్రాఫ్ చెదరకుండా ఒక భిన్నమైన పాత్ర చేశారా? మొన్న అఖండ సినిమాలో బాలయ్య బాబు వేసిన అఘోర వేషాన్ని చూశారు కదా! దాన్ని పూర్తిగా నాగరికంగా మార్చారు. దాంట్లో లోపాలు లేవా అంటే ఉన్నాయి.

కానీ బోయపాటి ప్రయత్నం విజయవంతమైంది. ఇక అసురన్ ను నారప్పగా రీమేక్ చేసిన వెంకటేష్.. కొంతలో కొంత నయం అనిపించుకున్నాడు. వాస్తవానికి ఆ సినిమాను తెలుగీకరించడమే పెద్ద పొరపాటు. అసురన్ సినిమాలో ధనుష్ నటిస్తుంటే పాత్ర మన కళ్ళముందే కదలాడుతుంటుంది. మనలో ఒక కసి పెరుగుతుంది. అది నటన అంటే.. అది నటన కౌశలం అంటే. హీరోల్లో కంప్లీట్ ఒక భిన్నమైన పాత్రలని ధైర్యంగా చేసింది పుష్పలో బన్నీ, రంగస్థలంలో రామ్ చరణ్. ఏతా వాతా చెప్ప వచ్చేది ఏంటంటే మన దగ్గరా గొప్ప గొప్ప కథలు ఉన్నాయి. కానీ వారిని పట్టుకోవడం ఇండస్ట్రీ పెద్దలకు అసలు తెలియదు. మొన్నటిదాకా అసలు బయట ప్రపంచానికి అంతగా తెలియని కన్నడ సినిమా కూడా పెద్దపెద్ద ప్రయోగాలు చేస్తోంది. పాపం తెలుగు సినిమా ఇంకా ఎఫ్ త్రీ, ది వారియర్ అంటూ పనికిమాలిన చెత్తను ప్రేక్షకుల బుర్రలోకి ఎక్కిస్తోంది. కథలను, కథకుల్ని నిందించడం మానేసి కాంతారా వంటి సినిమాల్ని కలలు కనండి. వీలుంటే గ్రాఫిక్స్ లో కంబాల ఆడండి. భూత, యక్ష, సింధు గానాలను ఒక్కసారి పరీక్షించండి. వీలుంటే పరిశీలించండి. అబ్బే అవన్నీ మాకెందుకు మాకు జిన్నాలు, ది ఘెస్ట్ లు ఉన్నాయని విర్ర వీగితే.. తర్వాత చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రేక్షకులకు మొనాటని వచ్చేసింది. అన్నింటికంటే ముఖ్యంగా ఓటీటీ వారికి అందుబాటులోకి వచ్చేసింది. ప్రేక్షకులు ఎప్పుడో మారారు. మారాల్సింది హీరోలే.