Heavy Rains: మానవుడి చేష్టల వల్ల ప్రకృతి గతి తప్పింది. అభివృద్ధి పేరుతో చేస్తున్న వినాశనం వల్ల రుతు చక్రం తీరు మార్చుకుంది. ఫలితంగా ఎండాకాలంలో వానలు, వానాకాలంలో ఎండలు, చలి కాలంలో మాడు పగలగొట్టే ఎండలు.. ఇలా వాతావరణం సమూల మార్పులకు గురికావడం వల్ల ప్రపంచమంతా అస్తవ్యస్తమవుతున్నది. లండన్ లో తెమ్స్ నది ఎండిపోయింది. బ్రెజిల్ ఆహార సంక్షోభంతో విలవిలలాడుతోంది. పాకిస్తాన్ వరదలకు కకావికలం అవుతున్నది. ఎక్కడి దాకో ఎందుకు.. మన తెలంగాణలోనే ఈ ఏడాది సుమారు 140% వరకు ఎక్కువ వర్షపాతం నమోదయింది. ఇప్పటికీ రోజు విడిచి రోజు వర్షం కురుస్తూనే ఉంది. ఫలితంగా ఆరుతడి పంటలన్నీ నాశనం అయిపోయాయి. కూరగాయ పంటలన్నీ కకావికలం అయిపోయాయి. దేశానికి అన్నం పెడుతుంది అని గప్పాలు కొట్టే రాష్ట్రంలో పొరుగు ప్రాంతాల నుంచి కూరగాయలు వస్తే తప్ప కూర వండుకోలేని పరిస్థితి.

ఆక్రమణలతో చిక్కిపోయిన జలవనరులు
విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఇల్లు చెరువులు అవుతున్నాయి. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ వంటి ప్రాంతాల్లో చెరువుల్లోనే ఇళ్ళు నిర్మించడంతో నీరు వెళ్లేదారి లేక నీట మునుగు తున్నాయి. ఉదాహరణకి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పెద్ద చెరువు విస్తీర్ణం సుమారు 96 ఎకరాలు. గత ఎనిమిదేళ్లలో ఈ చెరువు కు సంబంధించిన 40 ఎకరాలు కబ్జాకు గురైంది. ఆ భూమిలో నివాసాలు వెలిశాయి. వరద నీరు చెరువులోకి వెళ్లేందుకు గతంలో సుమారు అరు మీటర్ల వెడల్పున తవ్విన కాలువలు రెండు మీటర్లకు కుంచించుకుపోయాయి. నీరు వెళ్లే దారిలో నిర్మాణాలు చేపడితే, పల్లమెరిగిన నీరు నివాస ప్రాంతాలను ముంచెత్తుతోంది. ఇటీవల మహబూబ్నగర్ పట్టణంలో బుధవారం రాత్రి ఒక మోస్తరు వర్షం కురిసింది. ఫలితంగా బీకే రెడ్డి కాలనీ, రామయ్య బౌలీ, శేషాద్రి నగర్, మేకల బండ, శివ శక్తి నగర్, గణేష్ నగర్, తెలంగాణ చౌరస్తా, న్యూ టౌన్ ప్రాంతాలతో పాటు జాతీయ రహదారిని వరద ముంచెత్తింది. కొన్నిచోట్ల ఇళ్లన్నీ చెరువులయ్యాయి. ఒక్క మహబూబ్నగర్ అర్బన్ మండలంలో చెరువులు, కుంటలు కలిపి 39, రూరల్ మండలంలో 101 ఉండగా.. వీటిల్లో సగానికి పైగా ఆక్రమణకు గురయ్యాయి. ఈ 8 సంవత్సరాల లో కానీ విని ఎరుగని స్థాయిలో ఆక్రమణల పర్వం కొనసాగింది. ఇక ఇదే పట్టణంలోని సర్వే నెంబర్ 67లో 96. 11 ఎకరాలలో పెద్ద చెరువు విస్తరించి ఉంది. దీనికి శిఖంలో ఇళ్ళు, వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థల భవనాలు నిర్మించడంతో 56 ఎకరాలకు కుంచించుకు పోయింది. గత ఏడాది భారీ వర్షాల సమయంలో అధికారులు సర్వే చేసి చెరువు పూర్తిస్థాయి నీటిమట్టం 64 ఆక్రమణలు ఉన్నాయని గుర్తించారు. చెరువు లోతట్టు ప్రాంతాన్ని సూచించేలా 35 దిమ్మలను ఏర్పాటు చేశారు. బఫర్ జోన్ లో మరో 70కి పైగా నిర్మాణాలు ఉండగా.. వాటి యజమానులకు నోటీసులు ఇచ్చారు. కానీ వాటిని తొలగించకుండా అధికార పార్టీ నాయకులు ఆడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ చెరువు సుందరీకరణ కోసం చుట్టూ కట్ట నిర్మాణం, పూడిక తీత పనులు చేపట్టారు. ఆక్రమణలు తొలగించకుండా మిగిలిన విస్తీర్ణానికే పరిమితమయ్యారు. ఇక ఈ పనుల కోసం చెరువుని ఖాళీ చేసి వాన నీటిని కాలువల ద్వారా మళ్ళించడంతో కాలనీ పూర్తిగా మరుగుతున్నాయి.

మిగతా చెరువులది అదే పరిస్థితి
మొన్న కొత్వాల్ గూడ లో దేశంలోనే అతిపెద్ద అక్వేరియం నిర్మాణానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కానీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం గండిపేట చెరువు పరిధిలో 111 జీవోను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిందో.. అక్కడ భూ ఆక్రమణలు పెరిగిపోయాయి. ఇందులో అధికంగా టిఆర్ఎస్ నాయకులు ఉండటం గమనార్హం. ఈ చెరువు పరిధిలో విస్తారంగా భూమి ఉండడంతో దానిని అధికార టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ పాలించిన ఈ 8 ఏళ్ళల్లో ఒక్క హైదరాబాద్ లోనే సుమారు 8 వరకు చెరువులు ఆక్రమణకు గురయ్యాయని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తన నివేదికలో వెలువరించింది. ఆక్రమణల సందర్భంగా ఒకప్పుడు మాదాపూర్ అయ్యప్ప సొసైటీ నీటమునిగితే బాబోయ్ అనుకున్న నగర జనాలు.. నేడు మరిన్నీ మునకలు చూస్తున్నారు. నాలాల ఆక్రమణలు తొలగిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా అతి క్షేత్రస్థాయిలో ఆశించిన మేర సాగడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే వర్షాలు కురిస్తే మరింత జల విలయం తప్పదు.