Pawan Kalyan Telangana Tour: వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏపీలో రాజకీయా పరిణామాలను వేగంగా మారుస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు. 7 నుంచి 14 అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లలో పోటీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని ప్రకటించారు. మొదటి ప్రాధాన్యతగా ఏపీపై దృష్టిపెట్టిన జనసేనాని తర్వాత తెలంగాణలోనూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇటీవలే చంద్రబాబునాయుడుతో భేటీ అయిన పవన్.. ఏపీ రాజకీయాల్లో అందరినీ షాక్‌కు గురిచేశారు. తాజాగా తెలంగాణ రాజకీయాలపై కూడా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.

త్వరలో తెలంగాణ పర్యటన..
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమై ఏపీ రాజకీయాల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన జనసేనాని, ఇప్పుడు తన దృష్టిని తెలంగాణవైపు మళ్లించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో జనసే పార్టీ పోటీ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జనసేన పార్టీ తెలంగాణ విభాగం గురువారం ఈ విషయమై చర్చించింది.
కొండగట్టు నుంచే యాత్ర..
తెలంగాణలోని కొండగట్టు నుంచి ప్రారంభం కానున్న యాత్ర, పార్టీ కార్యాచరణ అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో ఈ యాత్రకు ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పార్టీ నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు. సమావేశంలో జనసేన తెలంగాణ ఇన్‌చార్జి శంకర్‌గౌడ్, పార్టీ నాయకులు శ్రీరామ్ తాళ్లూరి, రాధారం రాజలింగం తదితరులు పాల్గొన్నారు.
జనసేన పోటీపై పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ..
ఇదిలా ఉంటే జనసేన రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయనుందన్న అంశం రాజకీయాల సర్కిల్స్‌లో ఆసక్తికరంగా మారింది. 2019 ఎన్నికల్లో జనసేన కేవలం ఏపీకి మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే ఈసారి తెలంగాణలోనూ జనసేన బరిలోకి దిగుతుందని పవన్ క్యాడర్‌కు దిశా నిర్ధాశం చేశారు. అయితే తెలంగాణలో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? లేక బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్‌ఎస్‌తో దోస్తీ కడతారా.. లేక టీడీపీతో కలిసి ముందుకు వెళ్లారా అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ పర్యటన సందర్భంగా ఈ అంశంపై జనసేనాని క్లారిటీ ఇవ్వొచ్చని పార్టీ నాయకులు భావిస్తున్నారు.

గ్రేటర్‌పై దృష్టి..
జన సేనాని తెలంగాణలో యాత్ర కొండగట్టు నుంచి ప్రారంభిచినా.. ఎన్నికల్లో పోటీ మాత్రం గ్రేటర్ పరిధిలోనే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో ఆంధ్రా సెటిలర్స్ దాదాపు 40 శాతం మంది ఉన్నారు. పవన్ ఫ్యాన్స్ కూడా తెలంగాణలో ఇతర జిల్లాలతో పోలిస్తే గ్రేటర్ పరిధిలోనే ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో గ్రేటర్ పరిధిలోని ఆంధ్రాసెటిలర్స్ ఎక్కువగా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఎంపీ సీట్ల విషయానికి వస్తే ఖమ్మం, నిజామాబాద్, మహబూబన్ నగర్ స్థానాలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. గిరిజనులు అధికంగా ఉండే ఆదిలాబాద్ ఎంపీ స్థానంపై కూడా పోటీ చేసే అవకాశాన్ని పార్టీ తెలంగాణ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల బరిలో జనసేన నిలవడం ఖాయమైన నేపథ్యంలో తెలంగాణ రాజకీయ పరిణామాలు కూడా పవన్ పర్యటనతో వేగంగా మారుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.