Munugode By Election- TRS Leaders: తెలంగాణలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ప్రీఫైనల్‌గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు మూడు ప్రధాన పార్టీలు స్వరశక్తులు ఒడ్డుతున్నాయి. ఇక్కడ గెలవడం ద్వారా తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రాభవం తగ్గలేదని నిరూపించుకోవాలని గులాబీ నేతలు చూస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్ పనైపోయిందని, ప్రత్యామ్నాయం తామే అని మునుగోడు గెలుపు ద్వారా చాటాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇక తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుని కాంగ్రెస్ తెలంగాణలో పుంజుకుంటోందని సంకేతం ఇవ్వాలనుకుటున్నారు ఆ పార్టీ నేతలు. ఈ క్రమంలో కలిసి వచ్చే ప్రతీ అంశాన్ని వాడుకుంటున్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఉన్న టీఆర్‌ఎస్ నేతలంతా శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబును చూసి ఇన్ స్పయిర్ అవుతున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ దత్తత తీసుకుంటున్నామని చెబుతారు. ‘మాకు టీఆర్‌ఎస్ చాలా ఇచ్చింది.. టీఆర్‌ఎస్‌కు ఎంతో కొంత ఇవ్వాలంటే.. మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటాం’ అని చెబుతున్నారు.

కేటీఆర్‌తో షురూ..
దత్తత మంత్రం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌కు వచ్చిన కేటీఆర్.. నియోజకవర్గం మొత్తం దత్తత తీసుకుంటానని మూడు నెలలకోసారి వచ్చి దగ్గరుండి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇదేదో బాగుందనుకున్న మంత్రులు.. కూడా అదే బాట పట్టారు. రాష్ట్రంలోని మంత్రులందరినీ మునుగోడులో మోహరించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు తమకు అప్పగించిన చోట్ల మెజార్టీ తీసుకు రావడానికి మంత్రులు కూడా దత్తత మంత్రాన్నే జపిస్తున్నారు.

ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిస్తే దత్తత తీసకుుంటామని హామీ ఇస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఎర్రబెల్లి కూడా చండూర్ మున్సిపాలిటీ దత్తత తీసుకుంటానన్నారు. మరో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కేటీఆర్.. నెక్ట్స్ సీఎం అవుతారని.. కాబోయే సీఎం నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నారని.. అభివృద్ధి అవకాశాన్ని వదులుకోవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
KCR