Pawan Kalyan: సుదీర్ఘ సముద్ర తీరం ఏపీ సొంతం. దేశంలో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండోది. కానీ మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఏ ప్రభుత్వం, పార్టీ బాధ్యత తీసుకోలేదు. వారికి శాశ్వత ప్రయోజనాలకు పెద్దపీట వేయలేదు. అందుకే పొట్ట చేతపట్టుకొని మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. దీనిని గుర్తించిన పవన్ మత్స్యకారులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఉత్తరాంధ్రలో మత్స్యకారులు కీలకం. 33 నియోజకవర్గాలకుగాను సగానికి పైగా నియోజకవర్గాల్లో గంగపుత్రులు కీలక భూమిక. . వారి ఓట్లపైనే పార్టీల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. అయితే మత్స్యకార యువతలో పవన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. దానిని ఓటు బ్యాంక్ గా మలుచుకునేందుకు పవన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పవన్ పర్యటనలు, ప్రసంగాలు, చర్యలు అధికార పార్టీని కలవరపెడుతున్నాయి. ఇప్పుడు తీర ప్రాంతాలపై ఫోకస్ పెట్టడంతో ముచ్చెమటలు పడుతున్నాయి. ఆది నుంచి మత్స్యకార సామాజికవర్గంపై పవన్ దృష్టిపెట్టారు. ఇప్పుడు శ్రీకాకుళంలో తలపెట్టిన యువశక్తి కార్యక్రమంలో మత్స్యకారుల జీవన స్థితిగతులు, జనసేన అధికారంలోకి వస్తే వారి కోసం చేపట్టబోయే కార్యక్రమాలను పవన్ ప్రకటించనున్నారు.

కేవలం మత్స్యకారులను దృష్టిలో పెట్టుకొనే పవన్ యువశక్తి కార్యక్రమాన్ని రణస్థలంలో ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మత్స్యకార గ్రామాల్లో యువత జనసేనకు హార్ట్ కోర్ ఫ్యాన్స్ గా మారిపోయారు. యువశక్తి సన్నాహక ఏర్పాట్లల్లో కూడా మెజార్టీ వర్గం మత్స్యకార యువతే కావడం విశేషం. ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల నుంచి మత్స్యకార యువత యువశక్తి కార్యక్రమానికి తరలివచ్చే అవకాశముంది. గత కొద్దిరోజులుగా కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న నాదేండ్ల మనోహర్ కూడా మత్స్యకార గ్రామాల్లో పర్యటిస్తున్నారు. యువశక్తి సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీటికి యువత నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. అటు పవన్ నుంచి కింది స్థాయి జనసేన నేతల ప్రయత్నాలు చూస్తుంటే మత్స్యకారులను బలమైన ఓటు బ్యాంక్ గా మలుచుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మత్స్యకారుల వలస నియంత్రణ, ఉపాధి మార్గాలపై అవసరమైన సలహాలు, సూచనలు కోరేందుకు వంద మంది యువ ప్రతినిధులతో యువశక్తి కార్యక్రమంలో మాట్లాడించనున్నారు. కార్యక్రమం హీట్ పెంచనుందన్న నేపథ్యంలో అధికార పార్టీ కూడా కట్టడికి, నష్ట నివారణకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వరుసగా మత్స్యకార గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పవన్ ను నమ్మొద్దని.. యువశక్తి కార్యక్రమానికి వెళ్లొద్దని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల, విశాఖ జిల్లాలోని భీమిలి నియోజకవర్గాల్లోని మత్స్యకార గ్రామాల్లో అధికార వైసీపీ నాయకులు మకాం వేశారు. జనసేన యువశక్తి కార్యక్రమానికి మత్స్యకారులు వెళ్లకుండా నియంత్రించే పనిలో పడ్డారు.
అయితే అధికార పార్టీ నేతల ప్రతయ్నాలు, బెదిరింపులకు మత్స్యకారులు వెరవడం లేదు. శతాబ్దాలు దాటుతున్నా మత్స్యకారుల బతుకుల్లో పురోగతి లేదు. సాహస వృత్తిగా నిత్యం అలలతో యుద్ధం చేస్తున్న వారికి స్వాంతన చేకూరడం లేదు. ప్రమాదపుటంచున బతుకు కోసం ఆరాటపడే క్రమంలో రాకాసి అలలకు బలి అవుతున్నా పాలకులకు కనువిప్పు కలగడం లేదు. స్థానికంగా వేట గిట్టుబాటుకాక.. పొట్ట చేతపట్టుకొని ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నా వారిని చేయి పట్టుకొని నియంత్రించేందుకు ప్రయత్నించడం లేదు. స్థానికంగా ఉపాధి మెరుగుపరిచేందుకు కనీస చర్యలు చేపట్టడం లేదు. వారు నమ్మి అడుగులేసిన రాజకీయ పార్టీలు వారిని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వినియోగించుకుంటున్నాయి. సంక్షేమ పథకాలను ఎరగా చూపి శాశ్వత ప్రాజెక్టులు, పథకాలను పక్కనపడేస్తున్నాయి. వారిని దారుణంగా వంచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు, మత్స్యకార యువత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై నమ్మకం పెట్టుకున్నాయి. పవన్ అయితేనే తమకు న్యాయం చేయగలరని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
గత కొద్దిరోజులుగా మత్స్యకారుల జీవన విధానం, వారి వెనుకబాటుతనంపై జనసేన ప్రత్యేక అధ్యయనం చేస్తూ వస్తోంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందితే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయో సమగ్ర ప్రణాళిక రూపొందించింది.అటు పార్టీ కీలక నాయకులు ఎప్పటికప్పుడు మత్స్యకార ప్రాంతాల్లో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. తాగా ఉత్తరాంధ్రలో నిర్వహిస్తున్న యువశక్తి కార్యక్రమంలో మత్స్యకారుల సమస్యలను ఒక అజెండాగా తీసుకొని చర్చించనున్నారు. మత్స్యకార యువత నుంచి అభిప్రాయాలు సేకరించి జనసేన అధికారంలోకివస్తే చేపట్టబోయే కార్యక్రమాలను యువశక్తి వేదికగా ప్రకటించనున్నారు.