Actress Sudha: చాలా మంది నటుల వ్యక్తిగత జీవితాలు ఇబ్బందులు, వేదనలు, బాధలతో కూడుకొని ఉంటాయి. సిల్వర్ స్క్రీన్ పై వాళ్ళ వైభవం చూసి మనం… వాళ్ళకేంటి లగ్జరీ లైఫ్ అనుకుంటాము. కానీ వారి గుండెలోతుల్లోకి చూస్తే ఊహించని విషాదాలు తారసపడతాయి. వెండితెర అమ్మ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సుధ తన జీవితంలోని విషాదాలు బయటపెట్టారు. బాల్యం నుండి ప్రస్తుతం వరకు ఆమె కథ ఎన్ని మలుపులు తిరిగిందో చెప్పుకొచ్చింది. సుధ మాట్లాడుతూ… నేను ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టాను. పెద్ద బంగ్లా, ఇంట్లో పనివాళ్ళతో ఏ లోటు లేకుండా చిన్నతనం గడిచింది . 20 తులాల బంగారం ఒంటిమీద ధరించి ఇంట్లో తిరిగేదాన్ని.
నాకు నలుగురు అన్నదమ్ములు. నేను ఒక్కదాన్నే అమ్మాయిని. అందుకే నాన్న అమృతం అని అర్థం వచ్చేలా సుధ అని పేరు పెట్టారు. చిన్న తమ్ముడు పుట్టాక ఆస్తి అంతా కరిగిపోయింది. మా నాన్నకు క్యాన్సర్ సోకింది. బంగ్లాలో బ్రతికినవాళ్ళం రోడ్డున పడ్డాము. అమ్మ తన తాళిబొట్టు అమ్మి మాకు అన్నం పెట్టింది. అమ్మ థియేటర్ ఆర్టిస్ట్… దాంతో నన్ను నటన వైపు నడిపించింది. నటిగా సెటిల్ అయ్యాక డబ్బు, హోదా అన్నీ వచ్చాయి. అప్పుడు బంధువులు, సన్నిహితులు దగ్గరకు రావడం మొదలుపెట్టారు.
అమ్మ మరణించాక నాన్న బాధ్యతలు నేనే చూసుకున్నాను. ఆయన మరణించే వరకూ నా వద్దే ఉన్నారు. భర్తతో విడాకులు తీసుకున్నాను. అలాంటి సమయంలో కూడా నలుగురు అన్నదమ్ములు ఎలా ఉన్నావని పలకరించలేదు. ఢిల్లీలో హోటల్ బిజినెస్ మొదలుపెట్టి ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నాను. ఆ బిజినెస్ లో నష్టాలు రావడంతో ఒక్క సంతకంతో వందల కోట్లు పోయాయి. నమ్మిన వాళ్లు కొందరు మోసం చేశారు. ఇంకా అప్పులు మిగిలాయి. వాటిని ఇటీవల చెల్లించి బయటపడ్డాను.
నా కొడుకు విదేశీ అమ్మాయిని వివాహం చేసుకొని అక్కడే సెటిల్ అయ్యారు. అతనితో నాకు మాటల్లేవు. ఎలా ఉన్నావని ఒక్కసారి కూడా ఫోన్ చేసి అడగడు… అంటూ సుధ తన మనసులోని బాధ వెళ్లగక్కారు. వెండితెరపై సుధను చూసిన వారెవరూ ఆమెకు ఇన్ని సమస్యలు ఉన్నాయని అనుకోరు. తమిళ కుటుంబంలో పుట్టినప్పటికీ సుధ తెలుగు చక్కగా మాట్లాడతారు. నటుడు అల్లు రామలింగయ్య సుధకు తెలుగు నేర్చుకో అని సలహా ఇచ్చారట. తెలుగుపై ఆమెకున్న పట్టు టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా మార్చేసింది.