ఏపీలో కరోనా విజృంభిస్తున్న వేళ అధికార పార్టీ నేతలు రాజకీయాలు చేస్తుండటంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైరవుతోన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలకు భరోసా కల్పించాల్సిందిపోయే ఏపీలో మాత్రం రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు మానుకోకపోతే ప్రజలు తిరగబడటం ఖాయమన్నారు. చిల్లర రాజకీయాలు మానుకొని ప్రజలను సాయం చేయాలని బుధవారం ఆయన ఓ ప్రకటనలో హితవు పలికారు.
కరోనాతో అగ్రరాజ్యాలు సైతం బెంబెలెత్తిపోతున్నాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అవుతోందన్నారు. ఈ పరిణామాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రతీఒక్కరిపై ప్రభావం చూపనుందన్నారు. దీని వల్ల దేశంలో లక్షలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయి, ఊరుకాని ఊరిలో ఉంటూ ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు. రైతులు పంటను అమ్ముకోలేక పోతున్నారని అన్నారు. దీంతో పంటను చెత్తకుప్పల్లో పోస్తున్నారని అన్నారు.
కరోనా ఆంధ్రప్రదేశ్‌ను సైతం వదలడం లేదన్నారు. గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతుండంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలోనూ అధికార పార్టీ నాయకులు రాజకీయాలకు పాల్పడుతుండటం హేయమన్నారు. అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన సమయంలో రాజకీయాలకు పాల్పడుతుంటంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత రెండు మూడురోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు ఇందులో భాగమేనని అన్నారు. ఆయనపై జరుగుతున్న వ్యక్తిగత దాడిని ప్రజాస్వామ్యవాదులు ఖండిచాలని కోరారు. దేశం, రాష్ట్రం నుంచి కరోనాను తరిమేంత వరకు రాజకీయాలను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ‘చిల్లర రాజకీయాలకు దూరంగా ఉందాం.. ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, అవసరాలు, ఆకలిదప్పులు తీర్చడంపై మన శక్తియుక్తుల్ని కేంద్రీకరిద్దామని’ జనసేనాని పిలుపునిచ్చారు. పవన్ యాక్షన్ పై వైసీపీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే..!