Pawan Kalyan Varahi Yatra Success: పవన్ వారాహి రెండో విడత విజయోత్సవ యాత్ర ముగిసింది. ఉభయ గోదావరి జిల్లాలను పవన్ చుట్టేశారు. వైసీపీ సర్కారుపై తనదైన రీతిలో విమర్శనాస్త్రాలు సంధించారు.వ్యవస్థలో లోపాల తీరుపై తనదైన రేంజ్ లో విరుచుకుపడ్డారు. దీనికి వైసీపీ నుంచి గట్టి రియాక్షనే వచ్చింది. అయితే పవన్ స్థాయితో పోల్చుకుంటే అది తేలిపోయింది. మంత్రుల నుంచి నామినేటెడ్ పదవుల్లో ఉన్న నేతల వరకూ అంతా రియాక్టయ్యారు. కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. చివరకు సినిమా రంగం నుంచి పోసాని కృష్ణమురళి, తమ్మారెడ్డి భరద్వాజలాంటి వాళ్లతో సైతం మాట్లాడించారు. అయితే ఇక్కడే ఒక అసలు విషయం బయటపడింది. పవన్ పై మాట్లాడింది రాష్ట్ర స్థాయి నాయకులే.. జిల్లా స్థాయిలో నేతలు పొడిపొడిగా మాట్లాడి మమ అనిపించేశారు. అయితే వారు స్పందించకపోవడానికి కారణం భయమే అన్నట్టు తెలుస్తోంది.
వారాహి యాత్రతో గోదావరి జిల్లాల్లో పవన్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఆది నుంచి జనసేనకు అత్యంత సానుకూలమైన ప్రాంతం ఇదే. గత ఎన్నికల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో గౌరవప్రదమైన ఓట్లు సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో ఓటమితో పవన్ పై విపరీతమైన సానుభూతి కనిపిస్తోంది. ఇతర పార్టీలతో పొత్తులు ఉన్నా.. లేకపోయినా గోదావరి జిల్లాల్లో జనసేన తనదైన ముద్ర వేసుకోవడం ఖాయం. సామాజిక సమీకరణలు, సినీ గ్లామర్, పవన్ కు ఉన్న క్లీన్ ఇమేజ్ తో గోదావరి జిల్లాల ప్రజలు స్వచ్ఛందంగానే పవన్ పై మొగ్గుచూపిస్తున్నారు. అందుకే వారాహి యాత్రలో వైసీపీ సర్కారుపై పవన్ విరుచుకుపడుతున్నా అధికార పార్టీ లోకల్ నాయకులు స్పందించకపోవడానికి భవిష్యత్ భయమే కారణమని తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో చాలా మంది ఎమ్మెల్యేలను జగన్ పక్కన పెడతారన్న ప్రచారం ఉంది. ఈ జాబితాలో కొందరు మంత్రులు, తాజా మాజీ మంత్రులు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అధినేత చూస్తే అలా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు జనసేన వైపు మొగ్గుచూపుతున్నారు. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారు. పవన్ పై విమర్శలు చేస్తే రాజకీయ ఇబ్బందులు ఏరికోరి తెచ్చుకుంటామన్న భయం వారిని వెంటాడుతోంది. అందుకే ఎక్కువ మంది నాయకులు పవన్ విమర్శలపై స్పందించడానికి ముందుకు రావడం లేదు. అయితే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న ఆదేశాలతో కొంతమంది తూతూమంత్రంగా విలేఖర్ల సమావేశాలు పెట్టి పవన్ ను విమర్శిస్తున్నారు.
ఇన్నాళ్లూ రెండు పార్టీల హవా నడిచేది. కానీ ఈసారి జనసేన ప్రత్యామ్నాయంగా నిలుస్తుండడంతో చాలా మంది ముందుకొచ్చే అవకాశముంది. ఒకటి మాత్రం వాస్తవం. వివిధ కారణాలతో వైసీపీని బలపరచి పదవులు పొందిన నాయకులు సైతం ఇప్పుడు పునరాలోచనలో పడుతున్నారు. పదవి ఉన్నా పవర్ చూపలేని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకుడు పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేయడానికి ప్రత్యామ్నాయంగా జనసేన ఉందన్న నమ్మకమే కారణమని తెలుస్తోంది. మున్ముందు గోదావరి జిల్లాల్లో వైసీపీలో ఉండి అవకాశాలు లేనివారు.. పదవులు దక్కినా పవర్ దక్కని వారు పవన్ కు బాహటంగానే మద్దతు తెలిపే అవకాశాలున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.