YCP Survey: వైసీపీ మరో సర్వేలో ముందంజలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఇతర పార్టీలకు అందనంత దూరంలో ఉంది. ఇటీవల వరుస సర్వేలతో ఆ పార్టీ దుమ్ము దులుపుతోంది. అయితే ఈసారి సర్వే కాస్తా భిన్నం. ఎమ్మెల్యేల నేర చరిత్ర విషయంలో చేసిన సర్వే ఇది. ఇందులో వైసీపీ జాతీయ స్థాయిలో ఆరో శాతంలో ఉంది. అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్డ్ అనే సంస్థ ఎమ్మెల్యేల నేర చరిత్రపై అధ్యయనం చేసి సర్వే వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేల నేర చరిత్రపై చేసిన సర్వేను వెల్లడించింది. ఇందులో వైసీపీ ముందంజలో ఉండడం విశేషం.
ఏపీలో అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి 23, జనసేన ఒకరు చొప్పున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ రెండు పార్టీల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీ గూటికి చేరారు. అంటే వైసీపీ బలం 156కు చేరుకుందన్న మాట. అయితే తాజా సర్వేలో వైసీపీలో ఉన్న సగం మంది ఎమ్మెల్యేలపై బలమైన ఉన్నట్టు తేలింది. ఇందులో హత్యాయత్నం కేసులు సైతం నమోదైనట్టు వెల్లడైంది. వారు సమర్పించిన అఫిడవిట్లు ఆధారంగా చేసుకొని సదరు సంస్థ సర్వేలో తేల్చింది. అంటే 151 మంది ఎమ్మెల్యేల్లో సగం మందికి పైగా కేసులు ఉన్నట్టు వారే స్వయంగా ఒప్పుకున్నారు. అయితే ఈ సర్వేలో జాతీయ స్థాయిలో వైసీపీ ఆరో స్థానంలో నిలవడం విశేషం.
కాగా టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఇందులో సగం మందిపై కేసులు ఉన్నట్టు తెలింది. దీంతో వైసీపీ సరసన టీడీపీ చేరినట్టయ్యింది. అయితే సంఖ్యా బలం తక్కువగా ఉన్న దృష్ట్యా జాతీయ స్థాయిలో మాత్రం టీడీపీ 26 వ స్థానంలో నిలిచిపోయింది. ఇది ఆ పార్టీకి ఉపశమనం కలిగించే విషయం. జనసేనకు ఒకే ఒక సభ్యుడు ఉన్నా.. ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో కేసులేవీ లేకపోవడంతో జనసేన పేరు బయటకు రాలేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే గెలుపు అంటూ ఇటీవల రెండు సర్వేలు వెల్లడించాయి. దీంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఇప్పుడు నేరచరిత, కేసులు ఎక్కువగా నమోదైన పార్టీగా వైసీపీ తెలుగు రాష్ట్రాల్లో ముందువరుసలో ఉన్నట్టు తేలింది. ఇప్పుడు వైసీపీ శ్రేణులు ఎలా రియాక్టవుతారో చూడాలి.