PM Modi- AP Politics: ఏపీలో బీజేపీకి బలం అంతంతమాత్రం. కానీ.. ఆ పార్టీ రాజకీయంగా చక్రం తిప్పుతోంది. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. అసలు బీజేపీకి ప్రత్యర్థులమని చెప్పుకునే పార్టీ లేదు..అలాగని మేమే మిత్రులమనే చెప్పే పొజిషన్ లేదు. అన్ని పార్టీలతోనూ బీజేపీ స్నేహం చేస్తోంది. అవసరమనుకున్నప్పుడు ఆహ్వానిస్తోంది. మిత్రుడిగా చెంతకు చేర్చుకుంటోంది. అలాగని మిత్రుడని ప్రకటించడం లేదు. అలాగని వ్యతిరేకించడమూ లేదు. స్థూలంగా చెప్పలంటే పొలిటికల్ గేమ్ ఆడుతోంది. వైకుంఠ పాళిలో ఎదురొచ్చిన వారిని కబళించాలని చూస్తోంది. నేర్పరితనంతో తప్పించుకొని ప్రజా మద్దతు ఉన్నవారికే చేరదీయాలని భావిస్తోంది. అయితే బీజేపీ ఆడుతున్న ఆటలో అందరూ పాత్రదారులే. ఎవరి పాత్రవారు పోషిస్తున్నారు. చివరకు ఎవరు మిగులుతారో చూడాలి మరీ.

అయితే ఇప్పుడు ఏపీలో ప్రధాని మోదీకి మిత్రుడెవరు? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్ ..వీరిలో ఎవరు మోదీకి స్నేహితుడు? అన్నదానికి సమాధానం లేదు. పోని రాజకీయ ప్రత్యర్థి ఎవరు? అంటే కూడా ఆన్సర్ లేదు. ఎవరి నోటి నుంచి రాదు కూడా. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్ లో కేంద్రాన్ని దూరం చేసుకునే సాహసం ఏ పార్టీ కూడా చేయడం లేదు. గత ఎన్నికల తరువాత జనసేన, బీజేపీ మధ్య స్నేహం కుదిరింది. కలిసి నడవాలని నిర్ణయించుకున్నాయి. ఏపీలో వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలని భావించాయి. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలన్ని నిర్ణయానికి వచ్చాయి. అయితే ఎందుకో ఉమ్మడిగా వెళ్లలేకపోయాయి.అయితే మూడున్నరేళ్ల బీజేపీ, జనసేన ప్రయాణంలో విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా, అమరావతి, పోలవరం వంటి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని పవన్ విభేదించడంతో మిత్రుడు కాస్తా ప్రత్యర్థి అవుతారని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే వైసీపీ పై పోరాటానికి కేంద్రం రూట్ మ్యాప్ ఇవ్వడంలో జాప్యం చేసిందని ప్రకటించడంతో పవన్ ప్రధాని మోదీకి దూరమవుతున్నాడన్న డిసైడ్ కు అంతా వచ్చారు. కానీ విశాఖలో ప్రధాని మోదీని కలిసిన తరువాత పవన్ లో వచ్చిన మార్పుతో మళ్లీ మిత్రుడన్న భావన కలిగింది.
పోనీ చంద్రబాబు ప్రధాని మోదీకి మిత్రుడంటే అదీ కాదు. ఎందుకంటే మూడున్నరేళ్లుగా బీజేపీతో కలవాలని బాబు చేయని ప్రయత్నం లేదు. తన అనుచరులను రాజ్యసభ పదవులతో బీజేపీకి సాగనంపినా వర్కవుట్ కాలేదు. అగ్రనేతలు కనికరించలేదు. అసలు జీవితంలో టీడీపీతో కలవమని రాష్ట్ర నాయకులు చెబుతుంటే.. అమిత్ షా మాత్రం డోర్లుమూసుకుపోయాయని అన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అలాగని చంద్రబాబును ప్రత్యర్థిగా చూస్తున్నారంటే అదీ లేదు. అధికార కార్యక్రమాలకు ఆహ్వానాలు పంపిస్తున్నారు. చంద్రబాబు ద్వారా తెలంగాణలో బీజేపీకి వర్కవుట్ అయ్యే విధంగా వినియోగించాలని ప్లాన్ చేస్తున్నారు. పోనీ చంద్రబాబు ప్రధాని మోదీని ప్రత్యర్థిగా చూస్తున్నారంటే అటువంటిదేమీ లేదు. ఇప్పటికే అలా భావించి చేతులు కాల్చుకున్నారు. అందుకే ప్రత్యేక హెోదా, విశాఖ స్టీల్ ప్లాంట్:, అమరావతి రాజధాని మార్పు, పోలవరం వంటి విషయాల్లో జగన్ ను ఆడి పోసుకుంటున్నారే తప్ప.. ప్రధాని మోదీని పల్లెత్తు మాట అనలేకపోతున్నారు.

చివరకు జగన్ మిత్రుడంటే అదీ లేదు. అలాగని ప్రత్యర్థిగా చూడలేకపోతున్నారు. పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణకు అన్ని విధాలా ఆంక్షలు విధించి జగన్ సర్కారుకు మాత్రం మోదీ అభయమిస్తున్నారు. మొన్నటికి మొన్న విశాఖ వచ్చి..15 వేల కోట్ల రూపాయల పనులను ప్రారంభించి జగన్ వెనుక నేను ఉన్నాను అని సంకేతాలిచ్చారు. అదే విశాఖలో బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. జాతీయ స్థాయిలో మేము చూసుకుంటాం. రాష్ట్రస్థాయిలో మాత్రం మీరు జగన్ సర్కారుతో కొట్లాడండి అంటూ పురమాయించారు. అక్కడితో ఆగకుండా పవన్ తో భేటీ అయ్యారు. వైసీపీ సర్కారుపై పవన్ చేసిన ఫిర్యాదులను స్వీకరించారు. జగన్ సర్కారుపై పోరాటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అటు రాష్ట్ర బీజేపీ నాయకులు అడపదడపా జగన్ ను విమర్శిస్తారు. వైసీపీ నాయకులు కేంద్ర విధానాలను ప్రశ్నిస్తారు. అయితే ఏపీ పొలిటికల్ సిట్యువేషన్ ను పరిశీలిస్తే మాత్రం ప్రధాని మోదీకి మిత్రుడు ఎవర్నది చెప్పలేకపోతున్నారు. ప్రత్యర్థి ఎవరన్నది పసిగట్ట లేకపోతున్నారు.