Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్‌లోని ప్రశాంతమైన పెహల్గామ్, ఒక్కసారిగా రక్తపు మడుగుగా మారింది. అందాల ‘మినీ స్విస్’గా పిలవబడే ఈ ప్రాంతంలో ఆరుగురు ఉగ్రవాదులు అత్యాధునిక ఆయుధాలతో దాడి చేసి, దాదాపు 500 మంది టూరిస్టుల సమక్షంలో పురుషులను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో చాలామంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, అనేకమంది గాయపడ్డారు. కుటుంబ సభ్యుల ముందే జరిగిన ఈ హత్యాకాండ దేశాన్ని ఉలిక్కిపాటు చేసింది.
Also Read: పహల్గామ్ ఉగ్రదాడి.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మోదీ అత్యవసర సమావేశం.. సంచలన నిర్ణయం
అమాయకులపై కిరాతక దాడి
కాశ్మీర్ పోలీస్, ఆర్మీ దుస్తుల్లో మోటార్‌సైకిళ్లపై వచ్చిన ఉగ్రవాదులు, గుర్రపు సవారీ చేస్తున్నవారిని, ఫొటోలు తీస్తున్నవారిని, కుటుంబాలతో సమయం గడుపుతున్నవారిని లక్ష్యంగా చేసుకున్నారు. పేర్లు, గుర్తింపు కార్డులు అడిగి, కొందరిని బట్టలు విప్పించి కాల్చి చంపారు. భార్యలు, పిల్లల ముందే పురుషులను కిరాతకంగా హతమార్చారు. కర్నాటకకు చెందిన మంజునాథరావ్, హైదరాబాద్‌కు చెందిన ఐబీ అధికారి మనీష్ రంజన్, హర్యానాకు చెందిన నేవీ అధికారి వినయ్ నర్వాల్, కాన్పూర్‌కు చెందిన శుభం ద్వివేది వంటి వారు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
అంతర్జాతీయ నాయకుల నుంచి సంఘీభావం
ఈ దాడి ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దాడి బాధ్యులను కఠినంగా శిక్షించాలని పిలుపునిచ్చారు. భారత్‌లో పర్యటిస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ చర్యను ‘పిరికిపంద’ చర్యగా ఖండించారు.
దేశ నాయకుల ఖండన..
ప్రధాని మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించి, దాడి బాధ్యులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాశ్మీర్‌లో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, వైసీపీ నేత జగన్, కేసీఆర్, కేటీఆర్‌లు దాడిని తీవ్రంగా ఖండించి, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
దేశవ్యాప్త నిరసనలు, బంద్‌కు పిలుపు
ఈ దాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. జమ్మూ కాశ్మీర్‌లో జేకేఎన్‌సీ పార్టీ బంద్‌కు పిలుపునిచ్చింది. వివిధ రాష్ట్రాల్లో క్యాండిల్ ర్యాలీలు, ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలని నినాదాలు చేశారు. ఈ ఘటన భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదని నాయకులు పేర్కొన్నారు.
Also Read: కాశ్మీర్ ఉగ్రవాద ఘటనకు వ్యతిరేకంగా ఒక్కటైన యావత్ ప్రపంచం