Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ‘మినీ స్విట్జర్లాండ్’గా ప్రసిద్ధి చెందిన పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భారత సైనిక దుస్తుల్లో మోటార్‌సైకిళ్లపై వచ్చిన ముష్కరులు, పర్యాటకులను చుట్టుముట్టి సమీపం నుంచి విచక్షణారహిత కాల్పులు జరిపారు. ఈ దాడిలో 28 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.
Also Read: కాశ్మీర్ ఉగ్రవాద ఘటనకు వ్యతిరేకంగా ఒక్కటైన యావత్ ప్రపంచం
అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడితో ప్రధాని మోదీ అత్యవసరంగా భారత్ తిరిగి వచ్చారు. సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని బుధవారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలోనే ఆయన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో అత్యవసర సమావేశమై, దాడి వివరాలను సమీక్షించారు. ఉదయం 11 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించనున్నారు.
కేంద్ర మంత్రుల చురుకైన చర్యలు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీనగర్‌లో భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై, పరిస్థితిని సమీక్షించారు. ఆయన బుధవారం దాడి జరిగిన పహల్గామ్ ప్రాంతాన్ని సందర్శించి, పరిశీలన చేయనున్నారు. అటు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన అమెరికా పర్యటనను కుదించుకుని భారత్‌కు తిరిగి వస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటన తీవ్రతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అప్రమత్తమైంది.
భద్రతా బలగాల గాలింపు..
దాడి అనంతరం భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నాయి. అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. అత్యాధునిక ఆయుధాలతో దాడి జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
పర్యాటక రంగంపై ప్రభావం..
పహల్గామ్ వంటి ప్రముఖ పర్యాటక కేంద్రంలో జరిగిన ఈ దాడి కాశ్మీర్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయినప్పటికీ, ప్రభుత్వం బాధిత కుటుంబాలకు సంపూర్ణ సహాయం, గాయపడినవారికి ఉత్తమ వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఉగ్రవాదులను వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడి కాశ్మీర్ శాంతిని కలచివేసినప్పటికీ, భారత ప్రభుత్వం తక్షణ చర్యలతో స్పందించింది. అంతర్జాతీయ, దేశీయ సంఘీభావం భారత్‌కు బలాన్నిచ్చినా, ఈ ఘటన ఉగ్రవాద నిర్మూలనకు మరింత దృఢమైన వ్యూహాల అవసరాన్ని గుర్తుచేస్తోంది.