Inverter : ఎండాకాలం రాగానే చాలా రాష్ట్రాల్లో కరెంట్ కోతలు మొదలవుతాయి. అందుకే చాలా మంది తమ తమ ఇళ్లలో ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకుంటారు. కానీ, ఇన్వర్టర్‌లో అమర్చిన బ్యాటరీ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. ప్రతి బ్యాటరీకి ఓ లైఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత దానిని మార్చాల్సిన సమయం వస్తుంది. మీ ఇంట్లో ఉన్న ఇన్వర్టర్ బ్యాటరీని మార్చాల్సిన సమయం వచ్చిందో లేదో తెలుసుకోవడం ఎలాగో తెలుసా ? దాని గురించి వివరంగా తెలుసుకుందాం.
బ్యాటరీ ఎన్నేళ్లు పని చేస్తుంది ?
కొత్త బ్యాటరీ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందంటే.. బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రకారం, ఒక ఇన్వర్టర్ బ్యాటరీ సాధారణంగా మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు పనిచేస్తుంది. అయితే, బ్యాటరీ లైఫ్ టైం దాని వినియోగం, మెయింటెనెన్స్ పై ఆధారపడి ఉంటుంది.
మీ ఇన్వర్టర్‌లో ఏ రకమైన బ్యాటరీ అమర్చబడి ఉంది. మీరు సరైన సమయంలో బ్యాటరీలో వేయాల్సిన నీటిని నింపుతున్నారా లేదా.. బ్యాటరీ నట్ల దగ్గర కార్బన్ పేరుకు పోయిందా లేదా అనే దానిపై బ్యాటరీ లైఫ్ టైం ఆధారపడి ఉంటుంది. కార్బన్‌ను కూడా తొలగించడం చాలా ముఖ్యం.
లైట్ పోయిన తర్వాత మీరు ఎక్కువ టూల్స్ ఉపయోగిస్తే అది బ్యాటరీపై లోడ్‌ను పెంచుతుంది. ఈ అలవాటు కారణంగా బ్యాటరీ త్వరగా పాడైపోవచ్చు. మీరు బ్యాటరీని మార్చడానికి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఎప్పుడు మార్చాల్సిన అవసరం వస్తుంది?
ఇన్వర్టర్ బ్యాటరీ మునుపటిలా ఎక్కువ సమయం బ్యాకప్ ఇవ్వకపోతే బ్యాటరీని మార్చాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకోండి. బ్యాటరీ బ్యాకప్ తగ్గడంతో పాటు, బ్యాటరీ తరచుగా పాడైపోతుంటే లేదా బ్యాటరీ వేడెక్కడం ప్రారంభిస్తే, వెంటనే బ్యాటరీని మార్చాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకోవాలి. మీ ఇన్వర్టర్ మంచి పర్ఫామెన్స్ కోసం బ్యాటరీని క్రమం తప్పకుండా చెక్ చేయడం, అవసరమైనప్పుడు మార్చడం చాలా ముఖ్యం.