Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత మంగళవారం(ఏప్రిల్ 22) జరిగిన ఉగ్రదాడితో యావత్ దేశం ఉలిక్కపడింది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు, ఒక నేవీ అధికారి సహా ప్రాణాలు కోల్పోగా, లష్కర్–ఎ–తోయిబాతో అనుబంధం ఉన్న ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ బాధ్యత వహించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టే వరకు పాకిస్తాన్‌తో 1960లో కుదిరిన సింధూ నదీ జలాల ఒప్పందం (ఇండస్ వాటర్స్ ట్రీటీ) అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
Also Read: భారత్ సంచలన నిర్ణయం.. పాకిస్తాన్ కు భారీ షాక్
సింధూ నది, దాని ఉపనదుల జలాలను భారత్, పాకిస్తాన్ మధ్య సమన్యాయంగా పంచుకోవడానికి 1960 సెప్టెంబర్ 19న ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో సింధూ నదీ జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు.
ఒప్పందం ఇదీ..
తూర్పు నదులు: రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు పూర్తి హక్కులు లభించాయి, వీటి వార్షిక ప్రవాహం సుమారు 33 మిలియన్ ఎకరాల అడుగులు (MAF).
పశ్చిమ నదులు: సింధూ, జీలం, చీనాబ్ నదులపై పాకిస్తాన్‌కు ప్రధాన హక్కులు దక్కాయి, వీటి వార్షిక ప్రవాహం 135 MAF.
భారత్ పశ్చిమ నదుల నీటిని పరిమిత సాగు, జలవిద్యుత్ ఉత్పత్తి, తాగునీరు, జల రవాణా కోసం ఉపయోగించుకోవచ్చు, కానీ నీటిని నిల్వ చేయడం లేదా మళ్లించడం నిషేధం. ఈ ఒప్పందం స్నేహం, సహకార స్ఫూర్తితో జల వనరులను పంచుకోవాలని నిర్దేశిస్తుంది. దీని అమలు కోసం ‘శాశ్వత సింధూ కమిషన్’ (PIC) ఏర్పాటైంది, ఇందులో రెండు దేశాల నుంచి కమిషనర్లు ఉంటారు. ఏటా సమావేశాలు, సమాచార పంపిణీ ద్వారా సహకారం కొనసాగుతుంది.
ఒప్పందం నిలిపివేత..
పహల్గామ్ దాడి తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశంలో ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకారం, ‘‘సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ విశ్వసనీయంగా, శాశ్వతంగా విడనాడే వరకు ఈ ఒప్పందం అమలు నిలిచిపోతుంది.’’ ఈ నిర్ణయంతో సాంకేతిక సమావేశాలు, డేటా పంపిణీ, నీటి ప్రవాహ నోటిఫికేషన్లు ఆగిపోనున్నాయి.
భారత్ ఐదు కీలక చర్యలు..
అటారీ–వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్ మూసివేత.
పాకిస్తాన్ హైకమిషన్ సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించడం.
పాకిస్తాన్ సైనిక, నౌకా, వైమానిక సలహాదారులను ‘పర్సనా నాన్ గ్రాటా’గా ప్రకటించి, వారిని వారంలో భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశం.
SAARC వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ కింద పాకిస్తాన్ పౌరులకు ఇచ్చిన వీసాలు రద్దు, 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం.
ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ నుంచి భారత సైనిక సలహాదారుల ఉపసంహరణ.
పాకిస్తాన్‌పై ప్రభావం..
సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేత పాకిస్తాన్‌కు తీవ్ర పరిణామాలను తెచ్చిపెట్టనుంది. పాకిస్తాన్ వ్యవసాయం, నీటిపారుదలలో 90% సింధూ నదీ వ్యవస్థపై ఆధారపడి ఉంది, ముఖ్యంగా పంజాబ్, సింధ్ ప్రాంతాలు. ఈ నీటి సరఫరాలో ఏ చిన్న అంతరాయం జరిగినా పంట దిగుబడులు తగ్గడం, నీటి కొరత, ఆర్థిక అస్థిరత వంటి సమస్యలు తలెత్తవచ్చు. అటారీ సరిహద్దు మూసివేత వల్ల రూ. 3,886 కోట్ల విలువైన వాణిజ్యం, 71,563 మంది ప్రయాణికుల రాకపోకలు ఆగిపోనున్నాయి, ఇది చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ఒప్పందంలో గత వివాదాలు
గత 64 ఏళ్లలో 1965, 1971, 1999 యుద్ధాలు, ఉద్రిక్తతల నడుమ కూడా ఈ ఒప్పందం కొనసాగింది. అయితే, ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్‌లో జీలం, చీనాబ్ నదులపై నిర్మితమవుతున్న కిషన్‌గంగ, రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరాలు లేవనెత్తింది. ఈ ప్రాజెక్టులు నీటి ప్రవాహాన్ని తగ్గిస్తాయని, ఒప్పంద నిబంధనలను ఉల్లంఘిస్తాయని ఆరోపించింది. దీనిపై ప్రపంచ బ్యాంకు తటస్థ నిపుణుడిని నియమించింది. భారత్ మాత్రం ఈ ప్రాజెక్టులు ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని, జలవిద్యుత్ ఉత్పత్తికి పరిమితమని వాదిస్తోంది.
అదనంగా, 2024 ఆగస్టు 30న భారత్ ఒప్పందాన్ని సవరించాలని, జనాభా పెరుగుదల, పర్యావరణ మార్పులు, సీమాంతర ఉగ్రవాదం వంటి కారణాలతో సమీక్ష అవసరమని పాకిస్తాన్‌కు నోటిఫికేషన్ జారీ చేసింది. పాకిస్తాన్ దీనిని వ్యతిరేకించింది.
పాకిస్తాన్ స్పందన..
పాకిస్తాన్ ఈ దాడిని ‘‘భారత ఆక్రమిత కాశ్మీర్’’లో జరిగిన సంఘటనగా అభివర్ణించి, దీనికి తాము బాధ్యులం కాదని, ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నామని పేర్కొంది. అయితే, ఒప్పందం నిలిపివేతపై అధికారిక స్పందన ఇంకా రాలేదు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ జాతీయ భద్రతా కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఈ చర్యలపై చర్చించారు. మరోవైపు అంతర్జాతీయంగా, అమెరికా, రష్యా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు ఈ దాడిని ఖండించి, భారత్‌కు సంఘీభావం తెలిపాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, భారత్‌లో పర్యటిస్తూ ఈ దాడిని ‘‘విధ్వంసకరం’’ అని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ మాత్రం అంతర్జాతీయంగా నిశ్శబ్దాన్ని ఎదుర్కొంటోంది.
ఇది పాక్ చాలా పెద్ద షాక్. ఇండస్ రివర్ వాటర్ ఆగిపోతే పాకిస్తాన్ ఎడారిగా మారుతుంది అనడంతో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచంలో అతి తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. దీనికి ప్రధాన ఆయువు ఇండస్ రివర్ వాటర్ ఒక్కటే. మొత్తం దేశ వ్యవసాయం సింధూ జలాలపైనే ఆధారపడి ఉంటుంది. అక్కడి పంజాబ్, సింధ్ వంటి రాష్ట్రాలకు ఇదే ప్రధాన వనరు. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాలు అతి తక్కువ నీటి వనరులు కలిగిన ప్రాంతాలుగా ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఈ నీటిని ఆపేస్తే ఈ ప్రాంతాలన్నీ ఎడారిగా మారతాయి. ఇప్పటికే విపరీతమైన ద్రవ్యోల్బణం, పేదరికాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఈ దెబ్బకు మలమల మాడిపోవడం ఖాయం. దీంతో అక్కడ తాగు నీటికి కూడా కొరత ఏర్పడుతుంది.
Also Read: పాకిస్తాన్ పై భగ్గుమన్న ఆ దేశ మాజీ క్రికెటర్.. ఇంత ఉలికిపాటు ఎందుకు?