Magunta Sreenivasulu Reddy
Magunta Sreenivasulu Reddy: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి దూకుడు పెంచారు. వైసీపీని వీడేందుకు దాదాపు నిర్ణయించుకున్నారు. టిడిపిలో చేరేందుకు కీలక చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ఆయనకు ఎంపీ అభ్యర్థిగా గ్రీన్ సిగ్నల్ లభించింది. తన కుమారుడు ఎమ్మెల్యే టికెట్ విషయమై సస్పెన్స్ కొనసాగుతోంది. చంద్రబాబు నుంచి అనుమతి వచ్చిన మరుక్షణం ఆయన టిడిపిలో చేరే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల ముందు టిడిపి నుంచి వైసీపీలో చేరిన ఆయన.. ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కానీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ విషయంపై జగన్ స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో ప్రత్యామ్నాయం వైపు మాగుంట అడుగులు వేస్తున్నారు. టిడిపిలో చేరితేనే బాగుంటుందన్న స్థిర నిర్ణయానికి వచ్చారు. కుమారుడితో పాటు టిడిపిలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు.
మరోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాల్లో వివాదాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ సీటు తనకు, ఎంపీ స్థానం మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఇవ్వాలని బాలినేని కోరుతూ వచ్చారు. కానీ హై కమాండ్ మాత్రం ఒంగోలు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బరిలో దించాలని చూస్తోంది. అదే విషయాన్ని బాలినేనికి స్పష్టం చేసింది. అయితే ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ ఇస్తేనే తాను పోటీ చేస్తానని.. లేకుంటే లేదని బాలినేని తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే దీనిపై వైసీపీ హై కమాండ్ నుంచి సానుకూల స్పందన రాలేదు. అందుకే మా గుంట శ్రీనివాసులు రెడ్డి టిడిపిలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.
మాగుంట శ్రీనివాసులు రెడ్డి టిడిపిలో చేరితే నెల్లూరు ఎంపీ స్థానాన్ని కట్టబెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఆయన కుమారుడు రాఘవకు సైతం కావలి టిక్కెట్ అడుగుతున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో కుమారుడికి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని మాగుంట శ్రీనివాసులు రెడ్డి భావిస్తున్నారు. కానీ జగన్ నుంచి సానుకూలత రాలేదు. పెద్ద మొత్తంలో నగదు కడితేనే టిక్కెట్ అని షరతు పెట్టినట్లు తెలుస్తోంది.పైగా కుమారుడికి అవకాశం లేదని.. పోటీ చేస్తే మీరే చేయాలని కండిషన్ పెట్టినట్లు సమాచారం. మరోవైపు అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును పరిశీలించడాన్ని మాగుంట జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే టిడిపిలో చేరి నెల్లూరు ఎంపీ సీటుతో పాటు తన కుమారుడికి కావలి అసెంబ్లీ సీటు దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుతో చర్చించినట్లు సమాచారం. అటు కావలి అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపికి బలమైన నాయకత్వం అవసరం. అక్కడ మాగుంట కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆ నియోజకవర్గం అయితే తన కుమారుడికి సరిపోతుందని మాగుంట శ్రీనివాసులు రెడ్డి భావిస్తున్నారు. చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన మరుక్షణం మాగుంట తన కుమారుడితో టిడిపిలో చేరడం ఖాయంగా తేలుతోంది.
అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ఇంతవరకు తేలలేదు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట కుటుంబం ఉండాలని బాలినేని పట్టుపడుతున్నారు. అయితే బాలినేనికి సైతం ఒంగోలు అసెంబ్లీ సీటు విషయంపై ఇంతవరకు స్పష్టత లేదు. దీంతో వేచి ఉండడం వృధా అని మాగుంట శ్రీనివాసులు రెడ్డి బాలినేనికి సముదాయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మాగుంట మాదిరిగా బాలినేని నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. బాలినేని ఒంగోలు అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. కానీ అక్కడ దామెర్ల జనార్ధన ఉన్నారు. ఆయనకు తప్పించి బాలినేని టిక్కెట్ ఇవ్వడం అసాధ్యం. అయితే జాప్యం చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని మాగుంట ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు పార్టీని వీడితే మేలు జరుగుతుందని ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. అయితే మాగుంట వెంట బాలినేని వస్తారా? లేదా? అన్నది చూడాలి.