తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ ఉన్న ఎర్రవెల్లి నుంచి యాదాద్రి వెళ్లే రూట్‌లో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని సీఎం దత్తత తీసుకున్నారు. ఈ గ్రామాన్ని రూ.100 కోట్లతో అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంకాపూర్, ఎర్రవల్లి, చింతమడక గ్రామాల తరహాలోనే వాసాలమర్రిని తయారు చేస్తామని, ఊళ్లోని అందరికీ ఉపాధి చూపుతామని హామీ ఇచ్చారు. ఇందుకోసం వంద కోట్లే కాదు అవసరమైతే ఎన్ని కోట్లయినా సరే ఖర్చు పెడతామని చెప్పారు. నెల రోజుల్లోనే వాసాలమర్రి రూపరేఖలు మారుస్తామన్నారు. నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో వాసాలమర్రి నేతలు కేసీఆర్‌ను కలవగా ఈ హామీలిచ్చారు. అభివృద్ధికి సంబంధించి వెంటనే ఓ బ్లూప్రింట్ తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామానికి చెందిన నేతలు జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్‌తో మాట్లాడి బ్లూప్రింట్‌పై చర్చించాలన్నారు.
Also Read: అదేంటో.. రఘునందన్‌రావు డబ్బులే దొరుకుతున్నయ్!
అలాగే నిజామాబాద్‌లోని అంకాపూర్ అభివృద్ధిని వాసాలమర్రి గ్రామస్తులకు చూపించాలని… త్వరలోనే వారిని అక్కడికి తీసుకెళ్లాలని ఆదేశించారు. మరో 10 రోజుల్లో తానే స్వయంగా గ్రామానికి వచ్చి సహపంక్తి భోజనం చేస్తానని స్పష్టం చేశారు. ఎర్రవెల్లి–యాదాద్రి రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరిస్తుండడంతో తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో చాలా మంది భూములు, ఇళ్లు కోల్పోతున్నారు. సీఎం కేసీఆర్ ఈ రూట్‌లో వెళ్తున్నప్పుడల్లా ఆ ఊరి ప్రజలు ఆందోళనలు చేస్తూ వస్తున్నారు.
తాజాగా.. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభానికి సీఎం కేసీఆర్ ఈ రూట్‌లోనే వెళ్లారు. ఈ టైంలో టీఆర్‌ఎస్ ఎంపీటీసీ పలుగుల నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో వాసాలమర్రి గ్రామస్తులు రోడ్డు పక్కన నిలబడి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఇది గమనించిన పోలీసులు వెంటనే ఎంపీటీసీని అదుపులోకి తీసుకున్నారు. ఊరి వారిని ఇళ్లకు పంపించేశారు. అయితే.. సీఎం కొడకండ్ల నుంచి తిరిగివస్తూ.. ముల్కలపల్లి, వాసాలమర్రి గ్రామాల్లో కొద్దిసేపు ఆగారు. ఊరి వాళ్లతో మాట్లాడారు.
Also Read: టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ: రాష్ట్రంలో భీకర వాతావరణం
రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు, భూములు, ప్రభుత్వ స్కూల్, గుడి పోతున్నాయని గ్రామస్తులు తెలిపారు. దీనిపై చర్చించేందుకు గ్రామ పంచాయతీ అధికారులను కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పిలిపించారు. సుమారు రెండు గంటలపాటు వాసాలమర్రి గ్రామ అధికారులు, నేతలతో కేసీఆర్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గ్రామ అభివృద్ధి నమూనా రూపకల్పన కోసం డీఆర్డీవో పీడీ ఉపేందర్ రెడ్డిని స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. గ్రామ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. సీఎం నిర్ణయంపై వాసాలమర్రి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్